ఎస్‌బీఐ లాభం రూ.6,068 కోట్లు

ABN , First Publish Date - 2022-08-07T07:34:55+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.6,068 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ..

ఎస్‌బీఐ లాభం రూ.6,068 కోట్లు

క్యూ1లో 6.7% తగ్గిన ప్రాఫిట్‌

భారీ ఎంటీఎం నష్టాలే కారణం.. 


ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.6,068 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే కాలానికి ఆర్జించిన రూ.6,504 కోట్ల లాభంతో పోలిస్తే 6.70 శాతం తగ్గింది. బాండ్లలో పెట్టుబడులపై ఏర్పడిన మార్క్‌-టు-మార్కెట్‌ (ఎంటీఎం) నష్టాలు ఇందుకు కారణమయ్యాయి. ఈ క్యూ1లో బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ లాభం రూ.7,325.11 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే సమయానికి రూ.7,379.91 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో బ్యాంక్‌ వ్యాపారం, లాభదాయకత, ఆస్తుల నాణ్యత పరంగా సముచిత పనితీరును కనబర్చిందని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా ఈ సందర్భంగా అన్నారు. కాకపోతే, బాండ్ల రిటర్నుల రేట్లు గణనీయంగా పెరగడంతో ఏర్పడిన ఎంటీఎం నష్టాలు బ్యాంక్‌ నికర, నిర్వహణ లాభాలపై ప్రభావం చూపాయన్నారు. గత మూడు నెలలకు బ్యాంక్‌ ఎంటీఎం నష్టాలు రూ.6,549 కోట్లుగా నమోదయ్యాయి. 


మరిన్ని వివరాలు.. 

  • క్యూ1లో ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 12.87 శాతం పెరిగి రూ.31,196 కోట్లకు చేరుకుంది. దేశీయ నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 0.8 శాతం పెరిగి 3.23 శాతానికి ఎగబాకింది. 
  • బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. గత ఏడాది జూన్‌ 30 నాటికి 5.32 శాతంగా ఉన్న బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) లేదా మొండి బకాయిలు.. 2022లో ఇదే సమయానికి 3.91 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.77 శాతం నుంచి 1 శాతానికి దిగివచ్చాయి. 
  • గడిచిన మూడు నెలల్లో రూ.9,740 కోట్ల రుణాలు మొండి బాకీల పద్దుల్లోకి చేరాయి. రుణాల రికవరీలు, అప్‌గ్రేడేషన్‌ల విలువ రూ.5,208 కోట్లుగా ఉంది. రుణ నష్టాల కోసం కేటాయింపులు వార్షిక ప్రాతిపదికన 15.14 శాతం తగ్గి రూ.4,268 కోట్లకు పరిమితమయ్యాయి. 
  • బ్యాంక్‌ రుణాలు 14.93 శాతం వృద్ధి చెందగా.. డిపాజిట్లు 8.73 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15 శాతానికి చేరుకోవచ్చని బ్యాంక్‌ అంచనా. 
  • జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.77,347.17 కోట్ల నుంచి రూ.74,998.57 కోట్లకు తగ్గింది.

Updated Date - 2022-08-07T07:34:55+05:30 IST