ఎస్‌బీఐ బొనాంజా

ABN , First Publish Date - 2020-03-28T06:20:11+05:30 IST

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐ.. రుణాలపై వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గించింది. ఆర్‌బీఐ రెపో రేటును ముప్పావు శాతం తగ్గించిన కొన్ని గంటల్లోనే బ్యాంక్‌ ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు చేరవేస్తున్నట్లు

ఎస్‌బీఐ బొనాంజా

బ్యాంక్‌ రుణ వడ్డీ రేటు 0.75% తగ్గింపు 


దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐ.. రుణాలపై వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గించింది. ఆర్‌బీఐ రెపో రేటును ముప్పావు శాతం తగ్గించిన కొన్ని గంటల్లోనే బ్యాంక్‌ ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు చేరవేస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన వడ్డీ రేటు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ రెపో రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) లేదా మార్కెట్లోని ఇతర ప్రామాణిక రేట్ల (ఈబీఆర్‌)తో అనుసంధానించిన రుణాలకు తాజా వడ్డీ తగ్గింపు వర్తిస్తుందని బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఈబీఆర్‌తో అనుసంధానించిన ఏడాది కాలపరిమితి రుణాలకు వడ్డీ 7.80 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గనుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ అనుసంధానిత రుణాలపై వడ్డీ 7.40 శాతం నుంచి 6.65 శాతానికి జారుకోనుంది. 


రూ.60,000 కోట్ల చెల్లింపులు వాయిదా  

రుణాల ఈఎంఐలపై మూడు నెలలపాటు ఆర్‌బీఐ మారటోరియం ప్రకటించిన నేపథ్యంలో రుణగ్రహీతల నుంచి రావాల్సిన రూ.50,000-60,000 కోట్లు వాయిదా పడే అవకాశం ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. తమ కాలపరిమితి రుణాలు భారీ స్థాయిలో ఉంటాయని, ప్రతి సంవత్సరం రూ.2-2.5 లక్షల కోట్ల చెల్లింపులు జరుగుతుంటాయని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఈఎంఐలు మూడు నెలల పాటు వాయిదా పడతాయన్నారు. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో పావు శాతం వాటా ఎస్‌బీఐకే ఉంది. కాగా తమ బ్యాంక్‌కు చెందిన అన్ని శాఖలు పని చేస్తున్నాయని, స్థానిక అధికారుల సమన్వయంతో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నామని రజనీష్‌ కుమార్‌ తెలిపారు. 


రుణగ్రహీతలకు ప్రయోజనం ఎంత? 

కొత్తగా రుణాలు తీసుకునే వారికి ప్రస్తుత వడ్డీ రేటుతో పోలిస్తే 0.75 శాతం తక్కువకే రుణం లభించనుంది. ఇప్పటికే ఈబీఆర్‌ లేదా ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ రుణాలు తీసుకున్నవారికీ ఈఎంఐల భారం తగ్గనుంది. ఉదాహరణకు.. 30 ఏళ్ల కాలపరిమితి రుణంపై ఈఎఐం చెల్లింపు భారం రూ.లక్షకు రూ.52 చొప్పున తగ్గనుంది. 

Updated Date - 2020-03-28T06:20:11+05:30 IST