Abn logo
Sep 27 2021 @ 01:52AM

ఎస్‌బీఐ లాంటి 5 బడా బ్యాంకులు కావాలి..

బ్యాంకింగ్‌ రంగం మరింత ఎదగాలి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబై: దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ మరింత పటిష్ఠం కావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్‌ అన్నారు. పెరుగుతున్న ఆర్థిక, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా మరో నాలుగైదు ఎస్‌బీఐ స్థాయి బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) 74వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె ఈ విషయం స్పష్టం చేశారు. మారుతున్న ఆర్థిక, పారిశ్రామిక అవసరాల దృష్ఠ్యా విదేశాల్లో ఉన్నట్టుగానే.. మన దేశంలోనూ పెద్ద బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఆ లక్ష్యంతోనే బ్యాంకుల విలీనం చేపట్టినట్టు తెలిపారు. 


సాఫీగానే విలీనాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) విలీనాలపై కొన్ని భయాలు వ్యక్తమైనా, అంతా సాఫీగానే జరిగిందని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ బ్యాంకుల సాఫ్ట్‌వేర్‌ ఒకదానితో ఒకటి సమ్మిళితమై ఉండడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. పీఎ్‌సబీలు, ప్రైవేటు బ్యాంకుల డిజిటల్‌ వ్యవస్థల్లోనూ ఇలాంటి సమ్మిళితం ఉండాలన్నారు. ముందుముందు డిజిటల్‌ సేవలే బ్యాంకింగ్‌ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయన్నారు. 


అన్ని జిల్లాలకు విస్తరించాలి

దేశంలోని ఇంకా కొన్ని జిల్లాల్లో బ్యాంకు శాఖలే లేకపోవడంపై ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ లోపాన్ని సరిదిద్దాలని ఐబీఏను కోరారు. ఆర్థిక కార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందిన కొన్ని జిల్లాల్లోనూ ఇప్పటికీ చాలినన్ని బ్యాంక్‌ శాఖలు లేకపోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో ఒక పూర్తి స్థాయి బ్యాంక్‌ శాఖ లేదా బ్యాంకింగ్‌ సేవలు అందించే కేంద్రాన్ని అయినా ఏర్పాటు చేసేందుకు ఐబీఏ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 


‘బ్యాడ్‌ బ్యాంక్‌’ అనొద్దు 

కొత్తగా ఏర్పాటు చేసే జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)ని బ్యాడ్‌ బ్యాంక్‌ అనడంపై ఆర్థిక మంత్రి సీతారామన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అమెరికా వంటి దేశాల్లో ఉన్న బ్యాడ్‌ బ్యాంక్‌ కాదన్నారు. ఎన్‌పీఏల భారం తగ్గినందున పీఎ్‌సబీల మూలధన పటిష్ఠీకీరణ కోసం ఇక పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండన్నారు.