SBI: ఎస్‌బీఐ ఖాతాదారులందరికీ హెచ్చరిక.. ఆ మెసేజ్‌ మీకూ వచ్చిందా? లేదా?.. ఒకవేళ వస్తే ఇలా చేయండి

ABN , First Publish Date - 2022-09-06T00:55:09+05:30 IST

డిజిటల్ యుగంలో బ్యాంకు ఖాతాదారుల సొమ్ము భద్రత ప్రశ్నార్థకమైంది. ఆన్‌లైన్, సెల్‌ఫోన్ చెల్లింపులకు ఎన్నో సవాళ్లు పొంచివుంటున్నాయి.

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులందరికీ హెచ్చరిక.. ఆ మెసేజ్‌ మీకూ వచ్చిందా? లేదా?.. ఒకవేళ వస్తే ఇలా చేయండి

న్యూఢిల్లీ : డిజిటల్ యుగంలో బ్యాంకు ఖాతాదారుల సొమ్ము భద్రత ప్రశ్నార్థకమైంది. ఆన్‌లైన్, సెల్‌ఫోన్ చెల్లింపులకు ఎన్నో సవాళ్లు పొంచివుంటున్నాయి. బ్యాంకులు అలెర్ట్ చేస్తున్నా.. కస్టమర్లు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా ఆన్‌లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. డిజిటల్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాల్లో నగదు దోపిడీలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో ఇటివల ఎస్‌బీఐ(SBI) ఖాతాదారులకు బ్యాంక్ పేరిట నకిలీ  మెసేజ్‌లు పంపిస్తున్నారు. అకౌంట్ బ్లాక్ అవ్వకూడదంటే పాన్‌కార్డ్ నంబర్‌(PanCard), కేవైసీ(KYC)ను అప్‌డేట్ చేసుకోవాలంటూ ఖాతాదారులకు ఎస్‌బీఐ పేరిట మెసేజీలు పంపిస్తున్నారు. అయితే ఈ నకిలీ సందేశాలపై ఖాతాదారులను కేంద్ర ప్రభుత్వం, ఎస్‌బీఐ ఉమ్మడిగా హెచ్చరించాయి. ‘‘ ఎస్‌బీఐ పేరిట ఒక ఫేక్ మెసేజ్ సర్క్యూలేట్ అవుతోంది. పాన్‌కార్డ్ అప్‌డేట్ చేసుకోకుంటే అకౌంట్ బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు’’ అని తెలియజేస్తూ పీఐబీ(Press Information Bureau) ఒక ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు తెలియజేయాలని కోరే మెసేజ్‌లకు ఏమాత్రం స్పందించవద్దని ఎస్‌బీఐ కస్టమర్లను అప్రమత్తం చేసింది. అలాంటి మెసేజ్‌లు వస్తే report.phishing@sbi.co.in కి ఫిర్యాదు చేయాలని సూచించింది. 


ఇక మోసగాళ్లు పంపించిన ఓ సందేశాన్ని కూడా పీఐబీ షేర్ చేసింది. ‘‘ డియర్ కస్టమర్. మీ ఎస్‌బీఐ యోనో అకౌంట్ ఈ రోజే క్లోజ్ అయ్యింది. ఇప్పుడే సంప్రదించి.. మీకు పంపిన లింక్‌లో మీ పాన్‌కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయండి’’ అని ఈ మెసేజ్‌లో ఉంది. దీంతో ఈ తరహా సందేశాలపై ఎస్‌బీఐ కూడా తన బ్యాంక్ ఖాతాదారులను హెచ్చరించింది. సర్క్యూలేట్ అవుతున్న మెసేజ్‌లు, టిప్స్‌కు సంబంధించి ప్రమాణికతను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించింది. కార్డు/పిన్/ఓటీపీ/సీవీవీ వివరాలను ఎస్‌బీఐ అడగబోదని గుర్తుంచుకోవాలని ఖాతాదారులకు తెలిపింది. మొబైల్ లేదా ఈమెయిల్స్‌కు వచ్చే తెలియని లింక్స్‌పై క్లిక్ చేయవద్దని పేర్కొంది. ఎస్‌‌బీఐ నుంచి వచ్చే మెసేజీలు SBIBNK, SBIINB, SBYONO, ATMSBI ఇలా షార్ట్‌కట్‌లో ఉంటాయని గుర్తించాలని సూచించింది.



Updated Date - 2022-09-06T00:55:09+05:30 IST