ఆరు నెలలు నరకం చూశా...

ABN , First Publish Date - 2022-06-30T06:08:39+05:30 IST

మహారాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ చెరలో వున్న ఆరు నెలలు నరకం చూశానని బాధితుడు పాంగి గోవర్దన్‌ తెలిపాడు. పోలీసుల రెస్క్యూ ఆపరేషన్‌తో బంధ విముక్తుడై చింతపల్లి చేరుకున్న బాధితుడు గోవర్దన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో బుధవారం మాట్లాడాడు.

ఆరు నెలలు నరకం చూశా...
స్మగ్లర్‌ చెర నుంచి పోలీసులు తీసుకొచ్చిన బాధితులు నాగేంద్రబాబు, గోవర్దన్‌, అతని భార్య ధనలక్ష్మి

వైర్‌ కట్టర్‌తో శరీరంపై గాయాలు చేసేవాడు

నాలుగు రోజులకొకసారి భోజనం పెట్టేవాడు

దాహం తీర్చుకునేందుకు బాత్‌రూమ్‌లోని నీటిని తాగాల్సి వచ్చేంది

గంజాయి తీసుకు రాకపోతే భార్య, మరదలితో వ్యభిచారం చేయిస్తానని బెదిరించేవాడు

స్మగ్లర్‌ చెర నుంచి బయటకు వచ్చిన గోవర్దన్‌


చింతపల్లి, జూన్‌ 29: మహారాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ చెరలో వున్న ఆరు నెలలు నరకం చూశానని బాధితుడు పాంగి గోవర్దన్‌ తెలిపాడు. పోలీసుల రెస్క్యూ ఆపరేషన్‌తో బంధ విముక్తుడై చింతపల్లి చేరుకున్న బాధితుడు గోవర్దన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో బుధవారం మాట్లాడాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే..

మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్‌ సుభాష్‌ అన్నా పవర్‌ డబ్బులు ఆశ చూపించి ప్రలోభపెట్టడం వల్ల గంజాయి ఇస్తామని ఒప్పుకున్న పాపానికి ఆరు నెలలు చిత్రహింసకు గురికావాల్సివచ్చింది. 2021 డిసెంబరు నెలాఖరులో నన్ను సుభాష్‌ అన్నా పవర్‌ మహారాష్ట్ర తీసుకువెళ్లి నెల రోజులు గదిలో బంధించాడు. మీ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి గంజాయి తీసుకురమ్మని చెప్పు అంటూ కర్రతో కొట్టేవాడు. ఓ వైపు నా భార్యకు ఫోన్‌ చేయించి, లైన్‌లో ఉండగానే వైర్‌ కట్టర్‌తో నా శరీరంపై గాయాలు చేసేవాడు. నేను అరుస్తుంటే నా భార్యకు ఫోన్‌లో వినిపించి, గంజాయి తీసుకొచ్చేంత వరకు నీ భర్త పరిస్థితి ఇలానే వుంటుందని చెప్పేవాడు. పోలీసులకు చెబితే నీ భర్తను చంపేస్తానని నా భార్యను బెదిరించేవాడు. ఆరు నెలలైనా నా కుటుంబ సభ్యులు గంజాయి పంపించలేదు. నా భార్య, పిల్లలు, మా తమ్ముడు ఇక్కడకు వస్తే నన్ను పంపించేస్తానని చెప్పడంతో ఫోన్‌ చేసి వారిని రమ్మని చెప్పాను. నా భార్య ధనలక్ష్మి, ఐదేళ్లలోపు పిల్లలు తరుణ్‌, సందీప్‌, తమ్ముడు కేశవ్‌, మరదలు యశోద కారులో మహారాష్ట్ర వచ్చారు. ‘మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తాం, నా భర్తను విడిచిపెట్టండి’ అని సుభాష్‌ను నా భార్య...ప్రాధేయపడింది. అయితే తనకు డబ్బులు ముఖ్యం కాదని, గంజాయి కావాలని చెప్పేవాడు. మహారాష్ట్ర వచ్చిన నా కుటుంబ సభ్యులందరిని గదిలో బంధించి, తమ్ముడిని గంజాయి తీసుకుని రావాలని గ్రామానికి పంపించేశాడు. నాకు నాలుగు, ఐదు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవాడు. బాత్‌రూమ్‌లోని నీళ్లను తాగుతూ ఉండేవాడిని. నాతో పాటు భార్య, పిల్లలు స్మగ్లర్‌ చెరలో చిక్కుకున్నారనే బాధను భరించలేకపోయేవాడిని. నా తమ్ముడు గంజాయి తీసుకురాకపోతే నా భార్య, మరదలతో వ్యభిచారం చేయిస్తానని భయపెట్టేవాడు. అదృష్టవశాత్తూ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించి మమ్మల్ని విడిపించారు. లేకుంటే సుభాష్‌ పవర్‌ పెట్టే చిత్రహింసకు చనిపోయి ఉండేవాడిని..అని గోవర్దన్‌ కన్నీరు పెట్టుకున్నారు. అలాగే చింతపల్లి మండలానికి చెందిన గెమ్మెలి నాగేంద్రబాబు మాట్లాడుతూ తన అన్నయ్య చిట్టిబాబు డబ్బులు తీసుకొని గంజాయి తీసుకొనిరాలేదని సుభాష్‌ రెండేళ్లగా మహారాష్ట్ర తీసుకొనివెళ్లి, అక్కడే బందీగా ఉంచాడని చెప్పాడు. తనతో వెట్టిచాకిరి చేయించేవాడని తెలిపాడు. తమలా గంజాయి స్మగ్లర్ల మాటలు విని జీవితాలను ఎవరు నాశనం చేసుకోవద్దని గోవర్దన్‌, నాగేంద్రబాబు తెలిపారు. 


Updated Date - 2022-06-30T06:08:39+05:30 IST