Abn logo
Mar 3 2021 @ 19:58PM

భార్యకి 60.. భర్తకి 25.. ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’

'కేరింత' ఫేమ్ పార్వతీశం, 'బాబూ చిట్టీ' డైలాగ్‌తో అభిమాన నటిగా మారిపోయిన సీనియర్‌ నటి శ్రీలక్ష్మీ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. ఈ కాంబినేషన్‌ చూస్తేంటేనే అర్థమవుతోంది.. ఇదొక వైవిధ్యభరిత చిత్రమని.  ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో భార్య పాత్రలో సీనియర్ నటి శ్రీలక్ష్మి నటిస్తోందని.. 60 ఏళ్ల ఆవిడకు 25 సంవత్సరాల కుర్రాడు ఎలా భర్త అయ్యాడనే ఆసక్తికర కథాంశంతో వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రం రూపొందనుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇచ్చారు. బుధవారం నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ.. ''దర్శకుడిగా నా తొలి చిత్రమిది. నా స్నేహితుడు నరేంద్ర నిర్మిస్తున్నారు. మాది చాలా ఏళ్ల పరిచయం. రెండేళ్ల నుంచి మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాం. 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' కంటే ముందు రెండు కథలు చెప్పాను. రెగ్యులర్ గా ఉన్నాయి. నా మనసులోనూ ఏదో చిన్న అసంతృప్తి. అప్పుడు ఈ సినిమా కథ చెప్పాను. వెంటనే ముందుకు వెళ్దామని నరేంద్ర అన్నారు. కథగా చెప్పాలంటే... పాతికేళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎలా అయ్యారు అనేది ఆసక్తికరమైన అంశం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది.." అని తెలిపారు.


నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి వినోదాత్మక చిత్రమిది. ఆద్యంతం ప్రేక్షకులు నవ్వుకునేలా దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈరోజు(బుధవారం) రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌లో 25 రోజులు, అవుట్ డోర్ లొకేషన్‌లో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం. 45 రోజుల్లో మొత్తం సినిమా పూర్తి చేస్తాం" అని అన్నారు.

సీనియర్‌ నటి శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ''వైవిధ్యమైన ఎన్నో మేనరిజమ్స్‌తో ఎన్నో వెరైటీ పాత్రలు చేశాను. చాలా రోజుల తర్వాత మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాను. కాస్త లేట్ అయినప్పటికీ లేటెస్ట్ గా మంచి పాత్ర వచ్చింది. ఇంతవరకు నేను ఇటువంటి పాత్ర చేయలేదు. నాకు కుమారుడుగా నటించవలసిన పార్వతీశం భర్తగా చేస్తున్నారు. యూత్ మొగుడు... వింటుంటే నాకే నవ్వొస్తుంది. సినిమాకు వస్తే మిమ్మల్ని నవ్విస్తుంది. మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని తెలుపగా.. భర్తగా నటిస్తున్న హీరో పార్వతీశం మాట్లాడుతూ "నాకు 'కేరింత' మంచి పేరు తెచ్చింది. అంతకు మించి పేరు తీసుకొచ్చే పాత్ర ఈ సినిమాలో లభించింది. హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కథను నమ్మి మేమంతా ఈ సినిమా చేస్తున్నాం. శ్రీలక్ష్మీగారితో కలిసి నటించడం హానర్‌గా భావిస్తున్నాను.." అని‌ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ ఆషి రాయ్‌, గీత్‌ షా, ముస్కాన్‌ అరోరా, సంగీత దర్శకుడు ఎస్‌.కె. ఖద్దూస్‌, శివారెడ్డి, జనార్థన్‌ (జెన్నీ) తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement