ఆసియా సంపన్న మహిళ సావిత్రి జిందాల్‌

ABN , First Publish Date - 2022-07-31T07:09:12+05:30 IST

జిందాల్‌ గ్రూప్‌ చైర్‌వుమెన్‌ సావిత్రి జిందాల్‌ ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు.

ఆసియా సంపన్న మహిళ సావిత్రి జిందాల్‌

ఆమె ఆస్తి రూ.89,835 కోట్లు 

న్యూఢిల్లీ: జిందాల్‌ గ్రూప్‌ చైర్‌వుమెన్‌ సావిత్రి జిందాల్‌ ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌టైం ఇండెక్స్‌ ప్రకారం.. శుక్రవారం నాటికి ఆమె ఆస్తి 1,130 కోట్ల డాలర్లు (రూ.89,835 కోట్లు)గా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 1,330 కోట్ల డాలర్ల స్థాయితో పోలిస్తే జిందాల్‌ సంపద భారీగా తగ్గినప్పటికీ, ఇప్పటివరకు ఆసియా నం.1గా ఉన్న యాంగ్‌ హుయాన్‌ ఆస్తి అంతకుమించి క్షీణించడం ఇందుకు కారణమైంది. చైనాలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ఒకటైన కంట్రీ గార్డెన్‌ హోల్డింగ్స్‌లో యాంగ్‌ హుయాన్‌ మెజారిటీ వాటాదారు. హుయాన్‌ తండ్రి యాంగ్‌ గుయోకియాంగ్‌ ఈ కంపెనీని 1992లో స్థాపించారు. 2005 లో తన వాటాను కూతురి పేరిట బదిలీ చేశారు.  41 ఏళ్ల హుయాన్‌ ఆస్తి ఈ ఏడాది ప్రారంభంలో 2,400 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండగా.. చైనాలో ప్రాపర్టీ మార్కెట్‌ సంక్షోభం కారణంగా ఈ నెల 29 నాటికి 1,100 కోట్ల డాలర్లకు (రూ.87,450 కోట్లు) పడిపోయింది. దాంతో ఆమె ఆసియా సంపన్న మహిళల లిస్ట్‌లో అగ్రస్థానం నుంచి నేరుగా మూడో స్థానానికి జారుకున్నారు.  

Updated Date - 2022-07-31T07:09:12+05:30 IST