పెద్ద మనుసుతో మా పాపను కాపాడండి

ABN , First Publish Date - 2022-05-21T09:34:33+05:30 IST

బుడిబుడి అడుగులు వేసే వయసులో అరుదైన జన్యు సంబంధిత వ్యాధి బారిన పడిన తమ చిన్నారిని కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

పెద్ద మనుసుతో మా పాపను కాపాడండి

నాలుగేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి  

వైద్యం ఖరీదు రూ.16 కోట్లు 

దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు


హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): బుడిబుడి అడుగులు వేసే వయసులో అరుదైన జన్యు సంబంధిత వ్యాధి బారిన పడిన తమ చిన్నారిని కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వైద్యానికి రూ.16 కోట్లు అవసరం కాగా ఆ భారం మోయలేని ఆ అమ్మానాన్న.. దాతల నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మజ్జిగ కల్లమాడప్ప, శివమ్మ దంపతులకు కూతురు అద్విత(4) ఉంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన కల్లమాడప్ప ప్రాజెక్టు పని మీద రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. కొంతకాలం తర్వాత భార్య, కుమార్తెను కూడా అక్కడికి తీసుకెళ్లారు. అయితే, అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న అద్విత నడకలో ఒక్కసారిగా తేడా రావడాన్ని తల్లిదండ్రులు గతఏడాది గుర్తించారు. కాలును వంకరగా పెట్టి నడుస్తుండటంతో అమెరికాలోని వైద్యులను సంప్రదించారు. వివిధ పరీక్షలు చేసిన వైద్యులు అద్విత.. స్పైనల్‌ మస్కులర్‌ అట్రో ఫీ(ఎ్‌సఎంఏ) అనే అత్యంత అరుదైన జన్యు సంబంధిత జబ్బుతో బాధపడుతున్నట్లు తేల్చారు. 


ఈ వ్యాధి బారినపడిన వారిలో కండరాలు బలహీనం అయ్యి, ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ప్రస్తుతం నడవటానికి ఇబ్బంది పడుతున్న అద్విత ఈ సమస్య వల్ల మున్ముందు పూర్తిగా నడవలేని స్థితికి చేరుతుంది. ఈ ఎస్‌ఎంఏను నయం చేయాలంటే ‘జోల్గెన్స్మా (Zolgensma) అనే ఔషధం ఇవ్వాలి. దాని ఖరీదు రూ.16 కోట్ల వరకు ఉంటుంది. అంత మొత్తాన్ని భరించే స్థితిలో ఆ కుటుంబం లేదని చిన్నారి బంధువు నాగార్జున వెల్లడించారు. ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థిక సాయాన్ని కోరుతోంది. దాతలు బ్యాంక్‌ ద్వారా విరాళాలను   అందజేయాలని కోరుతున్నారు. అకౌంట్‌ పేరు- అద్విత మజ్జిగ, అకౌంట్‌ నంబర్‌ 700701717371746, ఐఎ్‌ఫఎస్‌సీ కోడ్‌  YESB0CMSNOC  (‘బి’ తర్వాత జీరోగా, ఎన్‌ తర్వాత ‘ఓ’ గమనించగలరు). యూపీఐ ఐడీ"supportkallamada@yesbankltd' ద్వారా కూడా విరాళాలు అందించవచ్చు.

Updated Date - 2022-05-21T09:34:33+05:30 IST