‘మీ భవిష్యత్తు కోసం నన్ను కాపాడండి’

ABN , First Publish Date - 2021-07-13T06:46:30+05:30 IST

ఓ ఆడబిడ్డలారా, బాగున్నారు కదూ! 16 ఏళ్ల వయసులో మీరంతా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నేలపై అడుగు పెట్టినప్పుడు సాదరంగా ఒడిలోకి ఆహ్వానించిన మీ ప్రియ కళాశాలను నేను....

‘మీ భవిష్యత్తు కోసం నన్ను కాపాడండి’

కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ఆత్మనివేదన

ఓ ఆడబిడ్డలారా, బాగున్నారు కదూ! 16 ఏళ్ల వయసులో మీరంతా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నేలపై అడుగు పెట్టినప్పుడు సాదరంగా ఒడిలోకి ఆహ్వానించిన మీ ప్రియ కళాశాలను నేను. లక్షలు పెడితే తప్ప చేరలేని కోర్సుల్ని ఎలా చదవగలం అని మీరు ఆవేదన చెందుతున్నప్పుడు నేనున్నానంటూ మీకు ధైర్యం చెప్పిన మూడు అంతస్థుల ఆశాజ్యోతిని. ఆడపిల్లలకు చదువు ఎందుకు అని కొందరు, పది చదివితే చాలు అని ఇంకొందరు, మగపిల్లలతో పాటు చదివితే ఆగమైతరేమో అని మరికొందరు ఆందోళన చెందుతుంటే, నేనున్నానని భరోసా ఇచ్చి మీ అందరినీ నా గూటికి రప్పించి, చదివించాను, ఆడించాను, పాడించాను. అమ్మా నాన్న గుర్తొచ్చి మీరు ఏడిస్తే ఓదార్చాను. దేశంలో ఎక్కడకు వెళ్లినా బతకగలనన్న భరోసాని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగలమన్న ఆత్మస్థయిర్యాన్ని, పై చదువులను పూర్తిచేయాలనే దృఢ సంకల్పాన్ని, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని మీలో నింపడానికి ప్రయత్నించాను.


మూడు సంవత్సరాల తరువాత, బయట ప్రపంచంలో నా బిడ్డలుగా ఆర్కిటెక్టులుగా, సివిల్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా...ఇంకా ఎన్నెన్నో ఉన్నత స్థానాల్లో మీరు రాణిస్తుంటే ఆనందపడ్డాను, మురిసిపోయాను. ఇంకా ఎంతోమంది పేద, బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డలను మీలాగ తయారు చేయాలని కలలు కన్నాను. కానీ అది జరిగేలా లేదు. వేలాది ఆడబిడ్డలకు బంగారు భవిష్యత్తు అందించిన నాకు ఇక భవిష్యత్తే లేకుండా పోయేలా ఉంది. త్వరలోనే నన్ను పూర్తిగా మూసేయాలని చూస్తున్నారు. నన్ను పోషించే ఆర్థికస్తోమత లేదన్న కారణాలు చూపిస్తున్నారే కానీ ఎంతోమంది పేదింటి ఆడబిడ్డలు విలువైన కోర్సులను కోల్పోతారని మర్చిపోతున్నారు.


ఒకవైపు ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినదిస్తూనే, మరోవైపు అరవై ఏళ్ల ఘనచరిత్ర గల మొట్టమొదటి మహిళా కళాశాలను మూసేస్తే ఏమిటి దానర్థం? ఎంతోమంది పేద విద్యార్థులకు విలువైన సాంకేతిక విద్యను దూరం చేసే ఈ చర్యకు ఎందుకోసం, ఎవరి కోసం పూనుకున్నట్లు? సంవత్సరానికి కోటి రూపాయలతో నడిపించే ఆర్థికస్తోమత లేక మూసేద్దామని నిర్ణయించుకున్న ఎగ్జిబిషన్ సొసైటీ, కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసివచ్చే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఎట్లా సిద్ధమవుతోంది? కళాశాలను రద్దు చేస్తున్నట్టు గాని, నిలిపివేయాలని గాని ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటీసులు లేకుండానే, ఉన్నపళంగా ఈ ఏడాది అడ్మిషన్లు రద్దు చేస్తూ SBTET కమిషనర్ నవీన్ మిట్టల్ నోటీస్ జారీ చేయడం వెనుక కారణాలు ఏమిటి? గట్టిగా అడగాలని ఉంది కానీ మూగ జ్ఞాననిలయాన్ని. అయితే ఏం రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ చూసినా నా బిడ్డలే. చదువుల తల్లి కష్టాల్లో ఉంటే, అమ్మ ఋణం తీర్చుకునే సమయం ఆసన్నమైతే, ఎందుకు స్పందించరు నా బిడ్డలు? కచ్చితంగా స్పందిస్తారు, మూగదైన ఈ చదువుల తల్లి గొంతులవుతారు, నినదిస్తారు, ప్రశ్నిస్తారు. అవసరమైతే కొట్లాటకైనా సిద్ధమవుతారు. ఒక్కొక్కరు జత కలిసి, వేలాది మందిగా తరలి వస్తారు.. Save KNPW – Save Girls Education అని నినదిస్తూ పోరు బాట పడతారు. పేదోళ్ల విద్యగా చెప్పుకునే పాలిటెక్నిక్ విద్యను రక్షిస్తారు. తమ భవిష్యత్తుకు పునాది అయిన కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కాపాడుకొని తీరుతారు. నాకెందుకు లే అని ఊరుకోరు.. నా కోసం తప్పక వస్తారు. ఈ చదువులమ్మ రుణం తీర్చుకుంటారు. అదే ఆశతో మీ కోసం, ఎక్కుపెట్టే మీ స్వరం కోసం ఎదురుచూస్తున్నా.

మీ

చదువులమ్మ

(రచన: పూర్వ విద్యార్థిని స్వాతి మణిపుత్రి)

Updated Date - 2021-07-13T06:46:30+05:30 IST