కరువు జిల్లా గొంతు కోయొద్దు!

ABN , First Publish Date - 2021-07-12T05:39:44+05:30 IST

శ్రీశైలం జలాశయం వద్ద..

కరువు జిల్లా గొంతు కోయొద్దు!
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి, కొండపి ఎమ్మెల్యే స్వామి

రాయలసీమ ఎత్తిపోతల, తెలంగాణ ప్రాజెక్టులతో చేటు

శ్రీశైలం నిండకుండా కడితే మాకు కన్నీళ్లే

ముఖ్యమంత్రికి టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

ప్రత్యామ్నాయం చూడాలని విజ్ఞప్తి

సత్వరం వెలిగొండ పూర్తి, చెక్‌డ్యాంలు, 

బోర్ల తవ్వకాలకు డిమాండ్‌


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తే జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నిండకుండా అక్కడ ప్రాజెక్టులు నిర్మించి అసలే కరువుతో అల్లాడే జిల్లా గొంతు కోయొద్దని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. తక్షణం రాయలసీమ ఎత్తిపోతలను ఆపి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసి జిల్లాకు నీరందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు పర్చూరు, అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదివారం సీఎంకు లేఖ రాశారు.  గతకొన్నేళ్ల నుంచి వెంటాడిన అసాధారణమైన కరువు జిల్లా ప్రజల బతుకులను అతలాకుతలం చేసిందని అందులో పేర్కొన్నారు. గడిచిన 15 ఏళ్లలో మూడేళ్లు మినహా మిగిలిన 12 సంవత్సరాలు తీవ్ర దుర్భిక్షంతో ప్రజలు అల్లాడిపోయారన్నారు. జిల్లాకు భూగర్భ జలాలు, సాగర్‌ నీరే ఆధారం కాగా వర్షాలు లేక, సాగర్‌ నీరు సరిగా రాక రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.


అసలే కరువుతో అల్లాడుతున్న జిల్లాకు శ్రీశైలం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పేరుతో మీరు, తెలంగాణ పరిధిలో మరికొన్ని ప్రాజెక్టులను వారు నిర్మిస్తే ఇక ఆ జలశాయం నిండే అవకాశమే ఉండదన్నారు. శ్రీశైలం నిండి సాగర్‌కు నీరువస్తేనే జిల్లా ప్రజల గొంతు తడుస్తుందని, పొలాలకు నీరు పారుతుందని పేర్కొన్నారు. అయితే మీరు, వాళ్లు నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం నిండటం, సాగర్‌కు నీరు రావడం అసాధ్యమవుతుందన్నారు. దాని వల్ల జిల్లాకు ఉన్న కొద్దిపాటి నీటి సౌకర్యం కూడా అందక జిల్లా ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలపేరుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 80వేల క్యూసెక్కులకు విస్తరించాలని మీరు తీసుకున్న నిర్ణయం జిల్లాకు తీరని నష్టం చేకూరుస్తుందని, దీనిని నిర్మించి మా జిల్లా గొంతు కోయొద్దని కోరారు. తక్షణం ఆ ప్రాజెక్టును ఉపసంహరించుకొని ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఆ లేఖలో సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. కృష్ణానదిలో నీటి రాక తగ్గినప్పుడు ఉన్న జలాలను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచాలన్నారు.


అందుకు భిన్నంగా అటు తెలంగాణ వాళ్లు, ఇటు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో మీరు తరలించుకుపోతే మా జిల్లా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు, రైతులు కరువుకు మరింత బలిఅవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదన విరమించుకోవాలని లేదా ప్రకాశం జిల్లాకు సరైన నీటి వనరు చూపించిన తర్వాతనే నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2014-19 మధ్య పురోగతి సాధించిన వెలిగొండను సత్వరం పూర్తిచేసి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేయాలని, టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ముందుచూపుతో మొదలు పెట్టిన సాగర్‌ కుడికాలువకు గోదావరి జలాల తరలింపు  పనులు యుద్ధపాతిపదికన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో వేలాది చెక్‌డ్యాంల నిర్మాణం ద్వారా నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపు చర్యలు, జలసిరి పథకం కొనసాగించి బోర్ల తవ్వకం, 90శాతం రాయితీతో సూక్ష్మ సేద్య పరికరాలు అందించడంతోపాటు, గుంటూరు చానల్‌ను దగ్గుబాడు వరకూ పొడిగించాలని వారు ఆలేఖలో విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-07-12T05:39:44+05:30 IST