సౌదీఅరేబియాలో మే 24న ఈద్-ఉల్-ఫితర్

ABN , First Publish Date - 2020-05-23T10:55:33+05:30 IST

సౌదీఅరేబియా దేశంలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను మే 24వతేదీన జరపాలని ముస్లిమ్ మతపెద్దలు నిర్ణయించారు.

సౌదీఅరేబియాలో మే 24న ఈద్-ఉల్-ఫితర్

న్యూఢిల్లీ : సౌదీఅరేబియా దేశంలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను మే 24వతేదీన జరపాలని ముస్లిమ్ మతపెద్దలు నిర్ణయించారు. గల్ఫ్ దేశాల్లో శుక్రవారం చంద్రుడు కనిపించ లేదు. శనివారం నెలవంక కనిపించే అవకాశముండటంతో మే 24న ఈద్-ఉల్-ఫితర్ జరపాలని సౌదీ అధికారులు నిర్ణయించారు. రమజాన్ మాసం ఉపవాసాలు ఈ పండుగతో ముగియనున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈద్ ప్రార్థనలతోపాటు పండుగ వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని ముస్లిమ్ మతపెద్దలు సూచించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చంద్రుని వీక్షణ కోసం యూఏఈ న్యాయశాఖ మంత్రి అధ్యక్షతన వీక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. సౌదీఅరేబియాలోని రియాద్ నగర సమీపంలోని మజ్మా విశ్వవిద్యాలయం అబ్జర్వేటరీలో ఖగోళ శాస్త్రవేత్తలు శుక్రవారం షవ్వాల్ నెలవంకను చూసే అవకాశం లేదని ధ్రువీకరించారు. కర్ణాటక రాష్ట్రంలోనూ శుక్రవారం చంద్రుడు కనిపించలేదు. లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో అక్కడ మే 23వతేదీనే ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవాలని నిర్ణయించారు. కేరళ, కర్ణాటక ప్రాంతా్లో మే 24వతేదీన ఈద్-ఉల్-ఫితర్ జరపాలని నిర్ణయించినట్లు కేరళలోని హిలాల్ కమిటీ పేర్కొంది. మొత్తం మీద భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈద్-ఉల్-ఫితర్ ఏ రోజు జరుపుకుంటారనే విషయం శనివారం సాయంత్రం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. 

Updated Date - 2020-05-23T10:55:33+05:30 IST