విదేశీ యాత్రికులకు సౌదీ అనుమతి !

ABN , First Publish Date - 2020-10-29T01:34:25+05:30 IST

సౌదీ అరేబియా ప్రభుత్వం కరోనా విజృంభణ నేపథ్యంలో సుమారు ఏడు నెలల తర్వాత అక్టోబర్ 4న పవిత్ర ఉమ్రా యాత్రకు దేశ పౌరులు, నివాసితులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

విదేశీ యాత్రికులకు సౌదీ అనుమతి !

రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం కరోనా విజృంభణ నేపథ్యంలో సుమారు ఏడు నెలల తర్వాత అక్టోబర్ 4న పవిత్ర ఉమ్రా యాత్రకు దేశ పౌరులు, నివాసితులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సౌదీ సర్కార్ ఉమ్రా యాత్ర విషయమై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం(నవంబర్ 1) నుంచి విదేశీ యాత్రికులకు కూడా ఉమ్రా యాత్రకు అనుమతి ఇచ్చింది. 18-50 మధ్య వయస్కులు ఉమ్రా యాత్ర కోసం సౌదీలో ప్రవేశించేందుకు అంగీకారం తెలిపింది. ఉమ్రా సర్వీసులకు సంబంధించి మూడో దశ మినహాయింపుల్లో భాగంగా ఈ అవకాశం కల్పించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 


అయితే.. దేశంలో కొవిడ్-19 మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముందు జాగ్రత్త చర్యలు మరియు నివారణ ప్రోటోకాల్స్ ప్రకారం విదేశీ యాత్రికులు సౌదీకి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. అలాగే ఈ నిబంధనల ప్రకారం యాత్రికులు కోవిడ్-19 నెగెటివ్ అని చూపించే పీసీఆర్ మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అది కూడా 72 గంటల ముందు టెస్టు చేయించుకున్నదై ఉండాలి. ఇదిలాఉంటే... సౌదీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి వల్ల ఇప్పటికే 5,348 మంది మరణించారు. అలాగే 3,46,047 మందికి ఈ వైరస్‌ ప్రబలింది. 

Updated Date - 2020-10-29T01:34:25+05:30 IST