సౌదీలో క్వారంటైన్‌ రూల్స్‌ను బ్రేక్ చేస్తే.. రూ.40 లక్షల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్షతోపాటు..

ABN , First Publish Date - 2022-01-29T19:12:39+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌తో చాలా దేశాల్లో ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

సౌదీలో క్వారంటైన్‌ రూల్స్‌ను బ్రేక్ చేస్తే.. రూ.40 లక్షల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్షతోపాటు..

జెడ్డా: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌తో చాలా దేశాల్లో ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే సౌదీ అరేబియాలో కూడా ఇప్పుడు రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు పలు కఠిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే క్వారంటైన్ నిబంధనను అమలు చేస్తోంది. అయితే, కొందరు క్వారంటైన్ నిబంధనను బేఖాతరు చేయడం మంత్రిత్వశాఖ దృష్టికి వెళ్లింది. దాంతో మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్‌ రూల్స్‌ను బ్రేక్‌చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఇకపై దేశ పౌరులు ఈ ఉల్లంఘనకు పాల్పడితే రెండేళ్ల జైలుతో పాటు 2లక్షల సౌదీ రియాళ్ల(సుమారు రూ.40లక్షలు) జరిమానా విధిస్తామని పేర్కొంది. ఒకవేళ రెండోసారి కూడా ఉల్లంఘనకు పాల్పడితే శిక్షను రెండింతలు పెంచుతామని హెచ్చరించింది. అలాగే ప్రవాసులు క్వారంటైన్‌ను ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణతో పాటు మళ్లీ జీవితంలో తిరిగి కింగ్‌డమ్‌కు రాకుండా శాశ్వత నిషేధం విధిస్తామని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం సౌదీ అరేబియాలో సుమారు 10 మిలియన్ల మంది విదేశీయులు నివసిస్తున్నట్లు సమాచారం.


ఇదిలాఉంటే.. సౌదీలో ఇప్పటివరకు కరోనాకు 8,929 మంది బలయ్యారు. మరోవైపు సౌదీ ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23.6 మిలియన్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. దీనికోసం ఆరోగ్యశాఖ కింగ్‌డమ్ వ్యాప్తంగా 587 వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరిచింది. 'Sehhaty' యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుని టీకా తీసుకునే వెసులుబాటు కల్పించింది. అటు వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి భారీగా కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. దీనికోసం భారీ సంఖ్యలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-01-29T19:12:39+05:30 IST