సహజ ఆసుపత్రి భవనంలోకి అధికారుల కార్యాలయాలు

ABN , First Publish Date - 2021-12-06T04:41:05+05:30 IST

సత్యదేవుడి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం డార్మెటరీ నిర్మాణానికి ఓ దాత రూ.2 కోట్ల రూపాయలను సాయం చేయడంతో పనులు వేగవంతం చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.

సహజ ఆసుపత్రి భవనంలోకి అధికారుల కార్యాలయాలు
సహజ ఆసుపత్రి భవనంలో గదులు పరిశీలిస్తున్న ఈవో, చైర్మన్‌

   విష్ణుసదన్‌లో 14 వివాహ ఫంక్షన్‌ హాల్స్‌కు శీతలీకరణ
  ఇంజనీరింగ్‌ భవనం కార్యాలయం తొలగించి డార్మెటరీ ఏర్పాటు
  సౌకర్యాలను పరిశీలించిన ఈవో, చైర్మన్‌లు

అన్నవరం, డిసెంబరు 5: సత్యదేవుడి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం డార్మెటరీ నిర్మాణానికి ఓ దాత రూ.2 కోట్ల రూపాయలను సాయం చేయడంతో   పనులు వేగవంతం చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. శిథిలావస్థకు చేరిన ఇంజనీరింగ్‌ భవనం తొలగించి అక్కడ డార్మెటరీ నిర్మించనున్నారు. ఆ భవనంలో ఉన్న ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, లీజులు, పరిపాలన, ఆడిట్‌ తదితర కార్యాలయాలన్నీ ప్రకాష్‌సదన్‌ వెనుక ఉన్న సహజ ఆసుపత్రి భవనంలోకి మార్చనున్నారు. ఈ మేరకు ఆదివారం ఈవో త్రినాథరావు, చైర్మన్‌ ఐవీ రోహిత్‌, పీఆర్వో కొండలరావు, ఇంజనీరింగ్‌ అధికారులు సహజ ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. కార్యాలయాలకు అనుగుణంగా భవనాన్ని సిద్ధం చేయాలని ఈవో ఆదేశించారు కింద అంతస్తులో ఈవో క్యాంప్‌ కార్యాలయం, సహాయ కమిషనర్‌ కార్యాలయాలను ఇదే భవనంలో ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నవరం దేవస్థానంలో వివాహాలు చేసుకునేందుకు ఏసీ హాల్స్‌ లేకపోవడంతో విష్ణుసదన్‌ నందు 14 హాల్స్‌ను శీతలీకరణ చేయాలని నిర్ణయించారు. మాఘమాసంలో వివాహాల సమయానికి హాల్స్‌ శీతలీకరణ పూర్తికావాలని చైర్మన్‌ రోహిత్‌ ఎలక్ర్టికల్‌ అధికారులను ఆదేశించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లను దాత సహాయంతో గ్రానైట్‌ చేయడానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, డీఈలు గుర్రాజు, విశ్వనాథుల సత్యనారాయణ, అధికారులు బలువు సత్యశ్రీనివాస్‌, ఐవీ రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T04:41:05+05:30 IST