సాత్విక్‌ జోడీ అదుర్స్‌

ABN , First Publish Date - 2021-07-25T08:55:53+05:30 IST

లిఫ్టర్‌ మీరాబాయి దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించగా.. మిగతా విభాగాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి.

సాత్విక్‌ జోడీ అదుర్స్‌

సుమిత్‌ ముందంజ

దీపిక-జాదవ్‌కు నిరాశ

రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు



టోక్యో:  లిఫ్టర్‌ మీరాబాయి దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించగా.. మిగతా విభాగాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆర్చరీ, షూటింగ్‌, జూడోలో నిరాశ ఎదురవగా.. బ్యాడ్మింటన్‌, హాకీ తదితర ఈవెంట్లలో మన ఆటగాళ్లు ముందంజ వేయడం శుభపరిణామం. 


బ్యాడ్మింటన్‌: భళా.. సాత్విక్‌-చిరాగ్‌

తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, ముంబైకి చెందిన చిరాగ్‌ శెట్టి అద్భుతంగా ప్రారంభించారు. ప్రపంచ పదో ర్యాంకర్‌ సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 21-16, 16-21, 27-25తో చైనీస్‌ తైపీకి చెందిన మూడోర్యాంకర్‌ జంట చిన్‌ లిన్‌ వాంగ్‌-యాంగ్‌ లీని కంగుతినిపించింది. 


సాయిప్రణీత్‌కు తొలి మ్యాచ్‌లో నిరాశ: పురుషుల సింగిల్స్‌లో 13వ సీడ్‌ సాయిప్రణీత్‌కు తొలిమ్యాచ్‌లో చుక్కెదురైంది. గ్రూప్‌-డిలో భాగంగా జరిగిన తన తొలి పోరులో ప్రపంచ కాంస్య పతక విజేత ప్రణీత్‌ 17-21, 15-21తో ప్రపంచ 47వ ర్యాంకర్‌ మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌) చేతిలో కంగుతిన్నాడు. దీంతో నాకౌట్‌ చేరాలంటే సాయిప్రణీత్‌ తన గ్రూప్‌లో మిగతా రెండు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి. తర్వాతి మ్యాచ్‌లో మార్క్‌ కాల్‌జో (నెదర్లాండ్స్‌)తో సాయిప్రణీత్‌ ఆడనున్నాడు.  


ఆర్చరీ: మిక్స్‌డ్‌ నుంచి దీపిక జోడీ అవుట్‌

మిక్స్‌డ్‌ పెయిర్‌ విభాగంలో దీపికా కుమారి-ప్రవీణ్‌ జాదవ్‌ జోడీ క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. ఈ జోడీ క్వార్టర్స్‌లో 2-6తో కొరియాకు చెందిన కిమ్‌ జె దియోక్‌-అన్‌ సాన్‌ జంట చేతిలో చిత్తయింది. 


బాక్సింగ్‌:  వికాస్‌ అవుట్‌

బాక్సింగ్‌ బరిలోకి దిగిన వికాస్‌ క్రిషన్‌ తొలిరౌండ్లోనే కంగుతిన్నాడు. పురుషుల 69 కిలోల విభాగం ఆరంభ బౌట్‌లో వికాస్‌ 0-5తో స్థానిక ఫేవరెట్‌ సెవాన్‌రెట్స్‌ క్విన్సీ మెన్సా చేతిలో ఓటమిపాలయ్యాడు. కంటికింద గాయంతోపాటు భుజం గాయం తిరగబెట్టడంతో వికాస్‌ ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే విశ్వక్రీడల నుంచి నిష్క్రమించాడు. 

హాకీ: పురుషుల గెలుపు, మహిళల ఓటమి

హాకీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో భారత జట్టు న్యూజిలాండ్‌ను 3-2తో ఓడించగా, మహిళల జట్టు 1-5తో నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమిపాలైంది. భారత జట్టులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26వ నిమిషం, 33వ) రెండు గోల్స్‌తో సత్తాచాటగా, రూపిందర్‌పాల్‌ సింగ్‌ (10వ) మరో గోల్‌ కొట్టాడు. 


టెన్నిస్‌: సుమిత్‌.. సూపర్‌ 

సుమిత్‌ నగాల్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో 6-4, 6-7(6), 6-4తో డెనిస్‌ ఇస్తోమిన్‌ (ఉజ్భెకిస్థాన్‌)పై గెలుపొందాడు. దీంతో 1996లో పేస్‌ తర్వాత విశ్వక్రీడల్లో  పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ గెలిచిన మూడో భారత ఆటగాడిగా సుమిత్‌ రికార్డుకెక్కాడు.


టీటీ: సింగిల్స్‌లో ముందంజ.. మిక్స్‌డ్‌లో నిరాశ

టేబుల్‌ టెన్ని్‌సలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ కమల్‌- మనికా బాత్రా ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. శరత్‌ జోడీ 0-4తో మూడోసీడ్‌ చెంగ్‌ చింగ్‌-లిన్‌ యన్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓటమిపాలైంది. మనికా బాత్రా మహిళల సింగిల్స్‌లో 4-0తో తిన్‌ తిన్‌ హో (బ్రిటన్‌)పై, మరో భారత అమ్మాయి సుతీర్థ ముఖర్జీ 4-3తో లిండా (స్వీడన్‌)పై గెలిచారు. 

షూటింగ్‌: గురి తప్పింది

భారత షూటర్లు నిరాశపరిచారు. భారీ అంచనాలున్న సౌరభ్‌ చౌదరి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో ఏడోస్థానానికి పరిమితమవగా, అభిషేక్‌ వర్మ ఫైనల్స్‌ కూడా చేరలేకపోయాడు. ఇక, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఎలవెనిల్‌, అపూర్వి ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయారు.  


రోయింగ్‌: రెపిచేజ్‌కు అరవింద్‌, అర్జున్‌

రోయింగ్‌లో భారత క్రీడాకారులు అరవింద్‌ సింగ్‌, అర్జున్‌ లాల్‌ లైట్‌ వెయిట్‌ డబుల్స్‌ స్కల్స్‌ విభాగంలో రెపిచేజ్‌ రౌండ్‌కు అర్హత సాధించారు. హీట్స్‌-2లో పోటీపడ్డ అరవింద్‌-అర్జున్‌ జోడీ ఐదోస్థానంలో నిలిచారు.  

జూడో: సుశీలా దేవి ఇంటికి

మహిళల జూడోలో భారత పోరాటానికి తెరపడింది. మహిళల 48 కిలోల కేటగిరిలో హంగేరి అమ్మాయి ఎవా సెర్నోవిచ్‌ చేతిలో సుశీల ఓటమిపాలై ఇంటిబాట పట్టింది.

Updated Date - 2021-07-25T08:55:53+05:30 IST