సత్తా చాటేలా..!

ABN , First Publish Date - 2022-05-14T05:19:32+05:30 IST

సత్తా చాటేలా..!

సత్తా చాటేలా..!
అమిత్‌షా సభకు సిద్ధమవుతున్న వేదిక


  • నేడు తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభ
  • బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు
  • భారీగా జన సమీకరణకు నేతల సన్నాహాలు
  • హాజరు కానున్న అమిత్‌షా
  • చరిత్ర సృష్టిస్తామంటున్న కమలనాథులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):తుక్కుగూడలో నేడు జరగనున్న భారీ బహిరంగసభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించి సత్తా చాటేలా బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా తుక్కుగూడలో సాయంత్రం నిర్వహించే బహిరంగసభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ తన సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ శివార్లలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ముందుగా మహేశ్వరం నియోజకవర్గాన్ని టార్గెట్‌ చేసింది. ఈ మేరకు అనునిత్యం ఏదో కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహిస్తోంది. ఈ విషయంలో బీజేపీ ఇప్పటివరకు కొంత సఫలీకృతమైంది. స్థానికసంస్థల ఎన్నికల్లో ఇది రుజువైంది కూడా. నేడు తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభద్వారా తన సత్తా చాటాలని భావిస్తోంది. అంతేకాక వచ్చే ఎన్నికలకు సంబంధించి రాజకీయ ఎజెండా ఖరారుకు ఈ సభ వేదిక కానుంది. బీజేపీ నాయకత్వం ఈ వేదిక ద్వారా కీలక ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు. బీజేపీ ఈ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో అధికార పార్టీకి తామే ప్రత్యర్ధులమనే సంకేతాలు ఇవ్వాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయి సన్నద్ధమవుతున్న భారతీయ జనతాపార్టీ ఈ సభ ద్వారా రాజకీయంగా మరింత  దూకుడు పెంచాలని భావిస్తోంది. ముఖ్యంగా కీలకమైన నగర శివార్లలో పాగా వేసేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాలపై బీజేపీ నాయకత్వం ఎక్కువగా ఫోకస్‌ చేసింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో శివారు ప్రాంతాలపై కన్నేసి చాపకింద నీరులా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. రాజకీయంగా తమకు లాభించే ప్రతి అంశాన్నీ వాడుకుంటోంది. తుక్కుగూడ బహిరంగసభ ద్వారా తన బలమేమిటో చూపాలని భావిస్తోంది. మరోవైపు రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఈ బహిరంగసభను  అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు. ముందు లక్షన్నర వరకు జనసమీకరణ చేయాలని భావించినప్పటికీ కాంగ్రెస్‌ వరంగల్‌ సభ తరువాత నిర్ణయం మార్చుకుంది. కాంగ్రెస్‌ సభను తలదన్నేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.  దాదాపు 5లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల నుంచి జనాన్ని భారీగా సమీకరిస్తున్నారు. ఈ మేరకు స్థానిక నియోజకవర్గ నేతలకు టార్గెట్లు పెట్టారు. ఒక్క మహేశ్వరం నియోజకవర్గం నుంచే దాదాపు 50వేల మందికిపైగా సమీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో డివిజన్ల వారీగా టార్గెట్‌లో పెట్టారు. సభ విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా నేతలందరూ తలో బాధ్యత తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు జనార్దన్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌, అందెల శ్రీరాములు యాదవ్‌, సామా రంగారెడ్డి ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారు. అలాగే వికారాబాద్‌ జిల్లా నుంచి మాజీమంత్రి చంద్రశేఖర్‌ తదితరులు భారీగా జనసమీరణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ అగ్రనేతలు పాల్గొంటున్న ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్యనేతలంతా  ప్రతి రోజూ సభా ప్రాంగణానికి విచ్చేసి సకాలంలో అన్ని సక్రమంగా జరిగే విధంగా చూశారు. తుక్కుగూడ సభ ద్వారా చరిత్ర సృష్టిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ సభ విజయవంతమైతే నగర శివార్లలో మరిన్ని భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరో వైపు అమిత్‌షా రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

మహేశ్వరానికి టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు

  • జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే..
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

రంగారెడ్డి అర్బన్‌/మహేశ్వరం/ఇబ్రహీంపట్నం/కందుకూరు, మే 13 : కాంగ్రెస్‌ జెండాపై గెలిచి అభివృద్ధి పేరిట టీఆర్‌ఎ్‌సలో చేరిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గంలోని నాగులదోని తాండ, దయ్యాల గుండు తాండ, మహేశ్వరం గ్రామంలో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగింది. 30వ రోజు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఎన్‌డీ తాండ, డీజే తాండ క్రాస్‌ రోడ్డులో పార్టీ జెండాను బండి సంజయ్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు మహేశ్వరంలో డిగ్రీ కళాశాల మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మించి ఇవ్వలేకపోయారని విమర్శించారు. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే సబితారెడ్డి అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. కేంద్రం నిధులతోనే మహేశ్వర నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదిక, కమ్యూనిటీ భవనాలు, స్వచ్ఛభారత్‌, పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. దీనిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఇంటికి పంపే సమయం దగ్గరపడిందని కర్ణాటక రాష్ట్ర కోనార్‌ ఎంపీ మునుస్వామి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి బండి సంజయ్‌ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో లక్షకోట్ల రూపాయలను దోచుకున్నారని ఆయన కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈయాత్రలో పాపయ్యగౌడ్‌, బొక్క నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్‌, నల్లు ఇంద్రసేనారెడ్డి, కొప్పుబాష, వి.సుధాకర్‌శర్మ, తూళ్ల వీరేందర్‌గౌడ్‌, యాదీష్‌, మిద్దె సుదర్శన్‌రెడ్డి, అనంతయ్యగౌడ్‌, ఎ.యాదయ్యగౌడ్‌, పి.సుదర్శన్‌యాదవ్‌, కె. జంగయ్యయాదవ్‌, ఎంపీపీ మంద జ్యోతి, ఎగ్గిడి సత్తయ్య, మాధవచారి పాల్గొన్నారు. సీపీఎ్‌సను రద్దు చేయాలని కోరుతూ తపస్‌ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, బదిలీలు, పదోన్నతుల కోసం ఒత్తిడి తీసుకురావాలని ఉపాధ్యాయులు బండి సంజయ్‌ను కోరారు. దీంతో స్పందించిన బండి సంజయ్‌ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంజయ్‌ను కలిసిన వారిలో తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు, సురేష్‌, తదితరులున్నారు. 

Read more