ఆదివాసీల ఆరోగ్యమే లక్ష్యంగా..

ABN , First Publish Date - 2021-03-10T05:30:00+05:30 IST

ఏజెన్సీ మారుమూల ప్రాంతమే కాకుండా అత్యంత సమస్యాత్మకమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో... అనేక గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యం కూడా లేదు. పలు గ్రామాల్లో గిరిజన ఆదివాసీలు తరచూ మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలే కాకుండా

ఆదివాసీల ఆరోగ్యమే లక్ష్యంగా..

ఎండనకా, వాననకా... అడవుల్లో వాగులూ, వంకలూ దాటి గిరిజన పల్లెల్లో సేవలు అందిస్తూ... నిరుపేదలకు ఆరోగ్యప్రదాయినిగా నిలుస్తున్నారు సట్ల మౌనికా చందర్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సత్యనారాయణపురంలో వైద్యురాలుగా పని చేస్తున్న ఆమె తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ... ఆదివాసీలకు వైద్యం చెయ్యాలన్న తన కలను నిజం చేసుకుంటున్నారు.


ఏజెన్సీ మారుమూల ప్రాంతమే కాకుండా అత్యంత సమస్యాత్మకమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో... అనేక గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యం కూడా లేదు. పలు గ్రామాల్లో గిరిజన ఆదివాసీలు తరచూ మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలే కాకుండా రక్తహీనత లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం బారినపడ్డారని తెలిస్తే చాలు... పల్లెలు చివురుటాకుల్లా వణికిపోతాయి. వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, చికిత్స అందించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోయి ప్రాణ నష్టం సంభవించిన సందర్భాలు ఎన్నో. కనీసం నడిచే మార్గం కూడా లేని గ్రామాలకు వైద్యులు, వైద్య సిబ్బంది వెళ్ళడం సాహసమనే చెప్పాలి.  అలాంటి గ్రామాల్లో మహిళా వైద్యురాలు సట్ల మౌనిక చందర్‌ నిత్యం పర్యటిస్తూ, గిరిజనులకు సేవలు అందిస్తున్నారు. మౌనికా చందర్‌ తండ్రి సట్ల మధుచందర్‌.


ఆయన  గైనకాలజిస్టుగా వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో పని చేసి రిటైరయ్యారు.  పట్టణ ప్రాంతాల్లో కన్నా మారు మూల పల్లెల వారికి వైద్యం అందించడం చాలా ఇష్టంగా భావించే వారు. ఆయనే తనకు స్ఫూర్తితోనే అటవీగ్రామాల్లోని ఆదివాసీలకు వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటారు మౌనిక. ఆమె చైనాలోని నాన్‌జింగ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యురాలుగా చేరారు. వరంగల్‌, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల్లో పని చేశారు. చర్ల మండలం సత్యనారాయణపురం (24 గంటల) వైద్యశాలలో 2018లో డాక్టర్‌గా అవకాశం వచ్చింది. అప్పటి నుంచీ ఆమె స్థానికంగానే నివసిస్తున్నారు. ఆసుపత్రిలో ఓపీ సేవలతో పాటు, గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. 


గతంతో పోలిస్తే ఇప్పుడు గిరిజన గ్రామాల్లో తొంబై శాతం మందికి వైద్యం అందుతోంది . ముఖ్యంగా మహిళలూ, పిల్లల వైద్యంలో మౌనిక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలతో గడపడం ఎంతో సంతోషంగా ఉంటుందనే ఆమె వారికి తినుబండారాలు, దుస్తులూ అందిస్తూ ఉంటారు. 


‘‘చర్ల మండలంలోని అనేక ఆదివాసీ గ్రామాలు సత్యనారాయణపురం వైద్యశాల పరిధిలో ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది ప్రజలు నాటు మందులనూ, మంత్రాలనూ నమ్ముతారు. వైద్యానికి దూరంగా ఉంటారు. శిబిరాలు నిర్వహించే సమయంలో అలాంటి వారిని గుర్తించి, వారికి అవగాహన కల్పిస్తున్నాం. నాటుమందుల వల్లా, మూఢ నమ్మకాల వల్లా కలిగే అనర్థాలను వివరిస్తున్నాం. ప్రేమగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకుంటున్నాం. దీనికి మా వైద్య సిబ్బంది  రాజేశ్వరి, కనకదుర్గ, రామకృష్ణ, సుబ్బారావు, తిరుపతమ్మ, వీరమ్మ తదితరులు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో చాలామార్పు వచ్చింది’’ అని చెబుతున్నారు మౌనిక. గతంతో పోలిస్తే ఇప్పుడు గిరిజన గ్రామాల్లో తొంబై శాతం మందికి వైద్యం అందుతోంది . ముఖ్యంగా మహిళలూ, పిల్లల వైద్యంలో మౌనిక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 


పిల్లలతో గడపడం ఎంతో సంతోషంగా ఉంటుందనే ఆమె వారికి తినుబండారాలు, దుస్తులూ అందిస్తూ ఉంటారు. ‘‘మహిళలు ఏదైనా ప్రధాన సమస్యతో వస్తే... మా నాన్నగారితో మాట్లాడి సలహాలూ, సూచనలూ ఇస్తూ ఉంటాను. నా భర్త ఎం.రామకృష్ణ భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో జనరల్‌ సర్జన్‌. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. విధినిర్వహణలో అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు’’ అన్నారు మౌనిక. ‘‘పేదలకు వైద్యం చేయడంలో ఉన్న సంతృప్తి మా నాన్నను చూశాక అర్థమయింది. అందుకే వైద్య వృత్తి మీద మక్కువ పెంచుకున్నాను. ఎలాగైనా డాక్టర్‌ కావాలనీ, పేదలకు సేవ చెయ్యాలనీ నా కోరిక. అది కూడా పట్టణాల్లో కాకుండా, అటవీ గ్రామాల్లో ఆదివాసీలకు వైద్యం అందించాలనుకున్నాను. నా చిన్ననాటి లక్ష్యం ఇప్పుడు నెరవేరుతోంది’’ అంటున్నారామె.

Updated Date - 2021-03-10T05:30:00+05:30 IST