వైజ్ఞానికుని నాయకత్వ స్ఫూర్తి

ABN , First Publish Date - 2020-09-26T06:04:33+05:30 IST

ప్రశస్త నవీన భారతీయులలో సతీష్ ధావన్ ఒకరు, పారిశ్రామిక వ్యవస్థాపనలో జేఆర్‌డి టాటా, హస్త కళల రంగంలో కమలాదేవి చటోపాధ్యాయ, సహకార ‌‌ఉద్యమంలో వర్ఘీస్....

వైజ్ఞానికుని నాయకత్వ స్ఫూర్తి

ప్రశస్త నవీన భారతీయులలో సతీష్ ధావన్ ఒకరు, పారిశ్రామిక వ్యవస్థాపనలో జేఆర్‌డి టాటా, హస్త కళల రంగంలో కమలాదేవి చటోపాధ్యాయ, సహకార ‌‌ఉద్యమంలో వర్ఘీస్ కురియన్ మాదిరిగా వైజ్ఞానిక రంగంలో ధావన్ అద్వితీయుడు. సైన్స్, రాజకీయాలు, వ్యాపార రంగం, పరిపాలన, పౌర సమాజ వ్యవహారాలలో ఉదయిస్తున్న నాయకులు ధావన్ జీవితం నుంచి నేర్చుకోవల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగత జీవితం, వృత్తిగత ప్రవర్తనలో నైతిక నిష్ఠ; ప్రతిభను గుర్తించి, పెంపొందించే సమర్థత; సరైన వారికి సరైన బాధ్యతలు అప్పగించే వివేకమూ; విజయంలో సహ భాగస్వాములను గౌరవించే, యువ సహచరులను ప్రోత్సహించే పెద్ద మనసు; వైఫల్యానికి నిందను భరించే నైతికధైర్యమూ ధావన్ నాయకత్వ విశిష్టతలు.


కథలు స్ఫూర్తిదాయకాలు. కీర్తిశేషుడు ఎపిజె అబ్దుల్ కలాంకు కథలు చెప్పడం మహా ఇష్టం. తాను చెప్పదలుచుకున్న సత్యాలను కథల రూపేణా ఆయన చెబుతుండేవారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)  1979 జూలైలో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ చరిత్రాత్మక ఘటనకు సంబంధించిన ఒక విశేషాన్ని ఆయన తరచూ ఒక కథగా చెబుతుండేవారు. నాయకత్వ ఉత్కృష్ట గుణాన్ని విశదం చేయడమే ఆ కథ పరమార్థం. ఇస్రో ఉపగ్రహ ప్రయోగ ప్రాజెక్టుకు కలాం నాయకుడు. ప్రయోగానికి పరిస్థితులు సానుకూలంగా లేవని కొంత మంది సందేహించారు. వారి అభ్యంతరాలను కలాం తోసిపుచ్చి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది నింగిలోకి వెళ్ళకుండా బంగాళాఖాతంలో కూలిపోయింది. దీని గురించి కలాం కుంగిపోయారు. ప్రయోగ వైఫల్యాన్ని పత్రికల వారికి ఎలా చెప్పాలా అని ఆయన మథనపడ్డారు. ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి ఆయన్ని ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ రక్షించారు. తానే స్వయంగా మీడియా ప్రతినిధుల ముందుకు వెళ్ళి ఉపగ్రహ ప్రయోగం విఫలమయిందని ప్రకటించారు. అయినా, ఆ ప్రాజెక్టుకు బాధ్యులైన శాస్త్రవేత్తల బృందం ప్రతిభాపాటవాలు, శక్తిసామర్థ్యాలలో తనకు పరిపూర్ణ విశ్వాసం ఉందని, తదుపరి ప్రయత్నంలో వారు తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం తనకు పరిపూర్ణంగా ఉందని ధావన్ చెప్పారు. ఆ మరుసటి నెలలోనే ఉపగ్రహాన్ని మరొకసారి ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమయింది. కలాం బృందాన్ని ధావన్ అభినందించారు. విలేకరుల సమావేశానికి వెళ్ళి రోదసిలో భారత విజయపతాక గురించి చెప్పమని కలాంను పురమాయించారు. తదనంతర కాలంలో భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడూ, ఆ తరువాత కలాం తరచు ఆ విషయాన్ని చెబుతూ ఇలా ముక్తాయించేవారు: ‘ఓటమి సంభవిస్తే నాయకుడు బాధ్యత వహిస్తాడు. విజయం వరిస్తే ఆ గౌరవాన్ని నాయకుడు తన సహచరులకే ఇస్తాడు’. ఉత్తమ నాయకత్వానికి ఉత్తమ నిర్వచనం ఇంతకు మించి మరేముంటుంది? 


భారతీయ వైజ్ఞానిక లోకం శుక్రవారం నాడు సతీష్ ధావన్‌ను ఆయన శత జయంతి సందర్భంగా ఘనంగా స్మరించుకుంది. 1920 సెప్టెంబర్ 25న ధావన్ శ్రీనగర్‌లో జన్మించారు. ఒక న్యాయమూర్తి కుమారుడైన ఆయన లాహోర్‌లో విద్యాభ్యాసం చేశారు. ఫిజిక్స్, మేథమెటిక్స్, సాహిత్యం, మెకానికల్ ఇంజినీరింగ్‌లలో పట్టభద్రులయ్యారు. ఇదొక అసాధారణ విషయం. భిన్న ప్రపంచాలైన విజ్ఞాన, మానవీయ, సాంకేతికతా శాస్త్రాల మధ్య ధావన్ ఒక వారధి అయ్యారు. 1930, 40 దశకాలలో లాహోర్, ఇటువంటి విద్యాసక్తులను ప్రోత్సహించేది. విద్యాభ్యాసంలో విలక్షణ ప్రయోగాలకు ఆస్కారం కల్పించేది. ఆ దశకాలలో లాహోర్‌ భారత ఉపఖండంలో ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగానూ. సమున్నత విద్వత్‌కు నెలవుగా ఉండేది. అప్పట్లో అది నిరుపమాన హిందూ, ఇస్లామిక్, సిక్కు, యూరోపియన్ మేధా సంప్రదాయాల సంగమంగా విలసిల్లింది. 


1945లో మూడో డిగ్రీ తీసుకున్న అనంతరం బెంగలూరుకు వచ్చి కొత్తగా ఏర్పాటైన హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేశారు. ఆ తరువాత మరింత ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో ఎమ్‌ఎస్‌ చేసి, కేలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్‌లో పిహెచ్‌డి సాధించారు. స్వాతంత్ర్య సిద్ధి, దేశ విభజనకాలంలో ఆయన అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్‌లోని ఆయన కుటుంబం భారత్‌కు అనివార్యంగా వలస వచ్చింది. 


సతీష్ ధావన్ భారత్‌కు తిరిగివచ్చి బెంగలూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్)లోని ఎయిరోనాటిక్స్ విభాగంలో చేరారు. ఆయన తొలి విద్యార్థులలో ఒకరైన రొడ్డం నరసింహ ఇలా గుర్తు చేసుకున్నారు: ‘ధావన్ మా విద్యా సంస్థకు యవ్వనోత్సాహాన్ని, నిత్యనూతనత్వాన్ని, ఆధునికతను, పట్టుదలను కేలిఫోర్నియా జీవనాచారాలను తీసుకు వచ్చారు. తన వ్యక్తిత్వం, విద్వత్తుతో విద్యార్థులు, సహచరులను ఎంతగానో ప్రభావితం చేశారు’. 


ఐఐఎస్‌లో ధావన్ పూర్తిగా తన పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. దేశంలో తొలి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్స్‌ను నిర్మించారు. బెంగలూరును ఆయన అమితంగా ప్రేమించారు. నగరవాసి, జన్యుశాస్త్రవేత్త అయిన నళిని నిరోడిని వివాహం చేసుకున్నారు. 1962లో ఐఐఎస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ ఉత్కృష్ట వైజ్ఞానిక పరిశోధనా సంస్థ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి ధావన్‌ అంకురార్పణ చేశారు. కంప్యూటర్ సైన్స్, మాలిక్యులార్ బయోఫిజిక్స్, సాలిడ్‌స్టేట్ కెమిస్ట్రీ, ఇకాలజీ, అట్మాస్ఫియరిక్ సైన్స్ మొదలైన విభాగాలలో కొత్త పరిశోధనా కార్యక్రమాలకు ఆయన విశేషంగా దోహదం చేశారు. 1971–-72లో ఒక ఏడాదిపాటు సెలవు తీసుకుని పరిశోధన నిమిత్తం ధావన్ అమెరికా వెళ్ళారు. కాల్‌టెక్‌లో పరిశోధనలో నిమగ్నమై ఉన్న తరుణంలో భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమ సారథి విక్రమ్ సారాభాయ్ అకాల మరణానికి లోనయ్యారు. పిఎన్ హక్సర్ సలహా మేరకు ప్రధాని ఇందిరాగాంధీ ఇస్రో సారథ్య బాధ్యతలు చేపట్టాని సతీష్‌ ధావన్‌ను కోరారు. ఆయన రెండు షరతులతో అంగీకరించారు. ఒకటి తనను ఐఐఎస్ డైరెక్టర్‌గా కొనసాగించడం; రెండు- అంతరిక్ష పరిశోధనా కార్యక్రమ ప్రధాన కార్యాలయాన్ని అహ్మదాబాద్ నుంచి బెంగలూరుకు మార్చడం. ఈ రెండు షరతులతో పాటు, కొత్త బాధ్యతలు చేపట్టే ముందు కాల్‌టెక్‌లో తన పరిశోధనలను ముగించుకోవడానికి అనుమతినివ్వాలన్న ధావన్ అభ్యర్థనను కూడా ఇందిర అంగీకరించారు. 


ఇస్రో చైర్మన్‌గా ఆ సంస్థలో ధావన్ తీసుకువచ్చిన మార్పుల గురించి ఆర్. అరవముదన్ అనే శాస్త్రవేత్త తన ‘ఇస్రో: ఏ పర్సనల్ హిస్టరీ’ అనే పుస్తకంలో విపులంగా వివరించారు. పరిశోధనా కార్యక్రమాల ఆధారిత కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి శాస్త్రవేత్తకు వ్యక్తిగత పాత్ర, సమష్టి బాధ్యతలను ఆయన నిర్దేశించారని అరవముదన్ పేర్కొన్నారు. ఇస్రో దీర్ఘకాలిక కర్తవ్యాల విషయమై సంస్థకు చెందిన, ఇతర పరిశోధనా సంస్థలకు చెందిన నిపుణలతో ధావన్ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారని ఆయన తెలిపారు. ‘ధావన్ చాలా హుందాగా వ్యవహరించేవారు. పరిపూర్ణ మేధో నిజాయితీ ఉన్న శాస్త్రవేత్త. చిత్తశుద్ధితో కూడిన విమర్శను ప్రోత్సహించేవారు. ప్రతిభను సత్వరమే గుర్తించేవారు. ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో ఉండేలా, సాగేలా ఆయన జాగ్రత్త వహించేవారని’ అరవముదన్ తెలిపారు. ఇస్రో సామాజిక బాధ్యతలకు ధావన్ సముచిత స్థానం కల్పించారు. వాతావరణ పరిశోధనలు, సహజ వనరుల అన్వేషణ, కమ్యూనికేషన్స్ రంగాలలో ఉపగ్రహాలను మరింతగా ఉపయోగించుకోవడానికి ఆయన అగ్రప్రాధాన్యమిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన జాతి జీవనంలో ఇస్రో నిర్వహిస్తున్న పాత్రకు ధావన్ సుస్థిర ప్రాతిపదికలు నిర్మించారు. సంస్థను రాజకీయవేత్తల జోక్యానికి దూరంగా ఉంచేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యత్వ ప్రతిపాదనను ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించారు. 

ఐఐఎస్ నిస్సందేహంగా మన ఉత్కృష్ట వైజ్ఞానిక పరిశోధనా సంస్థ; ఇస్రోకచ్చితంగా మన ప్రశస్త ప్రభుత్వరంగ సంస్థ. ఈ రెండు సంస్థల కీర్తిప్రతిష్ఠలను ఇతోధికంగా పెంపొందించడంలో ఒకే వ్యక్తి కీలకపాత్ర వహించారు. ఆ దీక్షాదక్షతలు సతీష్ ధావన్‌వి అని వేరుగా చెప్పనవసరం లేదు. భిన్ననాయకత్వ శైలులు అవసరమైన సంస్థలవి. ఆ రెండిటికి ఏకకాలంలో సమర్థ నాయకత్వాన్ని సమకూర్చడంలో ధావన్ పూర్తిగా సఫలమవడాన్ని బట్టి ఆయన నాయకత్వ గొప్పదనం ఏమిటో మనకు విశదమవుతుంది.


సతీష్ ధావన్ చివరి సంవత్సరాలలో ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం ఈ వ్యాస రచయితకు లభించింది. ధావన్ ఒక మంచి శాస్త్రవేత్త, ఒక గొప్ప సంస్థా నిర్మాత, ఒక దయామయుడైన మనిషి. ‘ధావన్, తన సమకాలికులలో అనేక మంది వలే కాకుండా కులమతాలకు, భాషా, ప్రాంతాలపరమైన అభిమాన దురభిమానాలకు పూర్తిగా అతీతుడని’ ఐఐఎస్‌లో ఆయన సహచరుడైన అమూల్యారెడ్డి అన్నారు. ‘అసూయా ద్వేషాలు ఏమ్రాతం లేని ఉదాత్తుడు ధావన్’ అని కూడా ఆయన అన్నారు. ధావన్ ‘భారతీయ వైజ్ఞానిక సమాజ నైతిక, సామాజిక అంతరాత్మ’ అని రొడ్డం నరసింహ కొనియాడారు. ఇది అప్రకటిత అభిప్రాయమే అయినప్పటికీ, విస్తృతస్థాయిలో ఆమోదం పొందినదని ఆయన పేర్కొన్నారు. జీవశాస్త్రవేత్త అయిన ధావన్ కుమార్తె జ్యోత్స్న తన తండ్రి సామాజిక వివేకం గురించి రాస్తూ శ్రీహరికోటలో నిర్వాసితులైన యానాదుల పునరావాసానికి ఆయన అన్నివిధాల తోడ్పడ్డారని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అనాథలైపోయిన ప్రజల హక్కుల కోసం, మేధాపాట్కర్ పోరాటాలను ఆయన గౌరవించేవారని ఆమె తెలిపారు.


ప్రశస్త నవీన భారతీయులలో సతీష్ ధావన్ ఒకరు, పారిశ్రామిక వ్యవస్థాపనలో జేఆర్‌డి టాటా, హస్తకళల రంగంలో కమలాదేవి ఛటోపాధ్యాయ, సహకార ఉద్యమంలో వర్ఘీస్ కురియన్ మాదిరిగా వైజ్ఞానికరంగంలో ధావన్ అద్వితీయుడు. సైన్స్, రాజకీయాలు, వ్యాపార రంగం, పరిపాలన, పౌర సమాజ వ్యవహారాలలో ఉదయిస్తున్న నాయకులు ధావన్ జీవితం నుంచి నేర్చుకోవల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగత జీవితం, వృత్తిగత ప్రవర్తనలో నైతిక నిష్ఠ; ప్రతిభను గుర్తించి, పెంపొందించే సమర్థత; సరైన వారికి సరైన బాధ్యతలు అప్పగించే వివేకమూ; విజయంలో సహ భాగస్వాములను గౌరవించే, యువ సహచరులను ప్రోత్సహించే పెద్ద మనసు; వైఫల్యానికి నిందను భరించే నైతికధైర్యమూ ధావన్ నాయకత్వ విశిష్టతలు.




(వ్యాసకర్త చరిత్రకారుడు)

రామచంద్ర గుహ

Updated Date - 2020-09-26T06:04:33+05:30 IST