తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌చంద్ర శర్మ

ABN , First Publish Date - 2021-09-18T07:51:30+05:30 IST

న్యాయవ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న సర్వోన్నత న్యాయస్థానం మరో చరిత్ర సృష్టించింది...

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌చంద్ర శర్మ

  • ఏపీకి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా
  • 8 హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు
  • 5 హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌ల బదిలీ
  • 28 మంది జడ్జిలు కూడా..
  • తెలంగాణ ఏసీజే రామచంద్రరావు పంజాబ్‌కు
  • త్రిపురకు మరో న్యాయమూర్తి అమర్‌నాథ్‌గౌడ్‌
  • కొలీజియం సిఫార్సు.. కేంద్రం ఆమోదమే తరువాయి
  • సీజే రమణ సారథ్యంలో 106కు చేరిన నియామకాలు


న్యూఢిల్లీ/అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న సర్వోన్నత న్యాయస్థానం మరో చరిత్ర సృష్టించింది. ఒకేసారి 8 హైకోర్టులకు కొత్త ప్రధానన్యాయమూర్తులను నియమించాలని, 5 హైకోర్టుల చీఫ్‌ జస్టి్‌సలతో పాటు వివిధ హైకోర్టులకు చెందిన 28మంది న్యాయమూర్తులను బదిలీచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సారథ్యం లోని కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమాకోహ్లీ సుప్రీంకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానాన్ని కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో భర్తీ చేయాలని కొలీజియం సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామిని ఛత్తీ్‌సగఢ్‌కు బదిలీచేసి.. ఆయన స్థానంలో ఛత్తీ్‌సగఢ్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను ఏపీకి కేటాయించింది. వీరితోపాటు అలహాబాద్‌, కలకత్తా, కర్ణాటక, మేఘాలయ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టులకు కూడా కొత్త సీజేల పేర్లను సిఫారసు చేసింది. బదిలీచేయాలని సూచించిన 28 మంది న్యాయమూర్తుల్లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి, పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాను ఏపీ హైకోర్టుకు, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌ తెలంగాణకు.. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావును పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు, మరో న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ను త్రిపుర హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సూచించింది. ఈ సిఫారసులకు కేంద్రం త్వరలోనే ఆమోదముద్ర వేస్తుందని న్యాయ వర్గాలు భావిస్తున్నా యి. హైకోర్టుల్లో పదోన్నతులు, బదిలీల వ్యవహారాన్ని చీఫ్‌ జస్టిస్‌ రమణ, జస్టిస్‌  లలిత్‌, జస్టిస్‌ ఏఎం.ఖన్విల్కర్‌ల త్రిసభ్య కొలీజియం చూస్తోంది. 


వంద మందికిపై నియామకం..

దేశంలోని 25 హైకోర్టుల్లో 1,080 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఈ ఏడాది మే 1 నాటికి 420 మంది మాత్రమే ఉన్నారు. ఏప్రిల్‌ 24న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా రమణ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 106మంది న్యాయమూర్తుల నియామకం జరగడం విశేషం. న్యాయవ్యవస్థలో 90ు ఖాళీల భర్తీకి కంకణం కట్టుకున్నామని జస్టిస్‌ రమణ ఇటీవల బార్‌ కౌన్సిల్‌ తనకు జరిపిన సన్మాన కార్యక్రమంలో వెల్లడించారు. రికార్డు స్థాయిలో గత నెల 17న ఒకేసారి సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేయగా.. కేంద్రం అంతే వేగంగా ఆమోదం తెలిపింది. ఆగస్టు 31న వీరంతా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 4న ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది న్యాయమూర్తుల నియామకానికి పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.  


బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు..

జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి (ఆంధ్ర నుంచి ఛత్తీ్‌సగఢ్‌కు), జస్టిస్‌ అకిల్‌ ఖురేషీ (త్రిపుర నుంచి రాజస్థాన్‌కు) జస్టిస్‌ మొహ్మద్‌ రఫిక్‌ (మధ్యప్రదేశ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌కు), జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి (రాజస్థాన్‌ నుంచి త్రిపురకు), జస్టిస్‌ విశ్వనాథ్‌  సమద్దర్‌ (మేఘాలయ నుంచి సిక్కింకు).


బదిలీ అయిన న్యాయమూర్తుల్లో కొందరు..

జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి (అలహాబాద్‌ నుంచి ఏపీకి); జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా (పట్నా నుంచి ఏపీకి); జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌ (బాంబే నుంచి తెలంగాణకు); జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు (తెలంగాణ నుంచి పంజాబ్‌-హరియాణాకు); జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ (తెలంగాణ నుంచి త్రిపురకు); జస్టిస్‌ సబీనా (రాజస్థాన్‌ నుంచి హిమాచల్‌కు); జస్టిస్‌ ఎ.ఎం.బదర్‌ (కేరళ నుంచి పట్నాకు); వివేక్‌ అగర్వాల్‌ (అలహాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు); సుదీప్‌ అహ్లూవాలియా(పంజాబ్‌-హరియాణా నుంచి కలకత్తాకు); చందర్‌ ధారి సింగ్‌ (అలహాబాద్‌ నుంచి ఢిల్లీకి); అనూప్‌ చిట్కారా(హిమాచల్‌ నుంచి పంజాబ్‌-హరియాణాకు); యశ్వంత్‌ వర్మ(అలహాబాద్‌ నుంచి ఢిల్లీకి); టీఎస్‌ శివజ్ఞానం(మద్రాసు నుంచి కలకత్తాకు); మణీంద్ర మోహన్‌ శ్రీవాత్సవ(ఛత్తీ్‌సగఢ్‌ నుంచి రాజస్థాన్‌కు).




పిన్న వయసులోనే సీనియర్‌ అడ్వొకేట్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా రానున్న జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో విద్యావంతుల కుటుంబంలో 1961 నవంబరు 30న పుట్టారు. ఆయన తండ్రి బీఎన్‌ శర్మ రైతు, విద్యావేత్త. ఆయన జబల్‌పుర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, బర్కతుల్లా యూనివర్సిటీ వీసీగా సేవలందించారు. జస్టిస్‌ సతీశ్‌చంద్ర తల్లి శాంతి శర్మ డీఈవోగా పనిచేశారు. జస్టిస్‌ సతీశ్‌ చంద్ర పీజీ తర్వాత సాగర్‌లోని డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి మూడు బంగారు పతకాలు పొందారు. 1984 సెప్టెంబరు 1న న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి రాజ్యాంగ, సివిల్‌, క్రిమినల్‌, సర్వీసు సంబంధిత అంశాలపై ఎన్నో కేసులను మధ్యప్రదేశ్‌ హైకోర్టులో వాదించారు. 1993లో కేంద్ర ప్రభుత్వ అదనపు కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 42 ఏళ్ళ వయసులోనే సీనియర్‌ అడ్వకేట్‌ అయ్యారు. మధ్యప్రదేశ్‌లో అతికొద్ది మందికే ఈ గుర్తింపు లభించింది. 2008 జనవరి 18న ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరిలో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2020 డిసెంబరు 31న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఆయన్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ బదిలీచేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదంముద్ర వేసిన తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 



Updated Date - 2021-09-18T07:51:30+05:30 IST