అన్నార్తుల ఆకలి తీర్చండి

ABN , First Publish Date - 2022-01-19T06:37:49+05:30 IST

దేశవ్యాప్తంగా సామూహిక వంటగదులను (కమ్యూనిటీ కిచెన్స్‌) ఏర్పాటుచేసేందుకు వీలుగా

అన్నార్తుల ఆకలి తీర్చండి

  • సామూహిక వంటగదులపై ఆలోచించండి
  • ఒక నమూనా పథకాన్ని రూపొందించండి
  • కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సుప్రీం కోర్టు
  • ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

   

న్యూఢిల్లీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సామూహిక వంటగదులను (కమ్యూనిటీ కిచెన్స్‌) ఏర్పాటుచేసేందుకు వీలుగా ఒక నమూనా పథకాన్ని రూపొందించే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కేంద్రాన్ని ఆదేశించారు. ఈ పథకాన్ని అమలుచేసేందుకు రాష్ట్రాలకు అదనపు ఆహార ధాన్యాలు కేటాయించాలని స్పష్టం చేశారు. ‘‘ఆకలిని తీర్చడం ముఖ్యం, ప్రజలు తిండిలేక వీధుల్లో తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమస్యను గుర్తిస్తున్నారు, మానవతా దృక్పథంతో పరిష్కారం కనుక్కోండి, జీవించడానికి కనీసం ఆహారం కావాలి’’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.




దేశంలో ఆకలి చావులను నివారించేందుకు సామూహిక వంటగదుల విధానం అమలుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ ఎ.ఎస్‌. బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం మంగళవారం విచారించింది. రాష్ట్రాలే ఈ పథకాన్ని అమలుచేయాలని సు ప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు... పోషకాహారం, ఆకలి మరణాలపై అఫిడ విట్లు దాఖలు చేసి, కేంద్రానికి సూచనలు ఇచ్చేందుకు రాష్ట్రాలకు రెండు వారాల వరకు గడువు ఇచ్చింది. గతంలో అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోనందుకు రాష్ట్రాలపై పెనాల్టీ విధించిన సుప్రీం... ఈ పెనాల్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది.


కాగా, రాజకీయ పార్టీలు అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించేలా చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను విచారిస్తామని, తేదీని ప్రకటిస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-19T06:37:49+05:30 IST