'కీ'లక్‌ సమయ్‌ 'మే'...

ABN , First Publish Date - 2020-04-18T01:48:21+05:30 IST

కరోనా భూతానికి జడిసి జనమంతా ఇంట్లో కూర్చున్నాం సరే. కానీ ఎల్లకాలం ఇలా తలుపులు మూసుకుని ఉండలేం కదా?

'కీ'లక్‌ సమయ్‌ 'మే'...

కరోనా భూతానికి జడిసి జనమంతా ఇంట్లో కూర్చున్నాం సరే. కానీ ఎల్లకాలం ఇలా తలుపులు మూసుకుని ఉండలేం కదా? రేపెప్పుడో మరి తాళాలు తెరవాల్సిందే కదా? అలాగని అమాంతం తెరిచేయలేం. భూతాన్ని చంపకుండా పరిస్థితుల్ని యథాప్రకారం మార్చలేం. మరి ముందరున్నవి ఎన్ని మార్గాలు? ఏ తలుపు తెరవాలి? ఏ దారి ఓపెన్‌ చేయాలి? ప్రస్తుత పరిస్థితి మీద ఓ చిన్న కామెడీ సెటైర్‌...


( అది ఒక వర్చువల్‌ ప్లేస్‌. మోదీ, అమిత్‌ షా, ఓ ఆఫీసర్‌, ఓ కార్యకర్త ముందు నాలుగు ద్వారాల భవనం.  సంపూర్ణ మార్గము ... పాక్షిక మార్గము... లాభ మార్గము... నష్ట మార్గము.. అన్నీ మూసేసి ఉంటాయి. అమిత్‌ షా చేతిలో తాళాలు.. )


మోదీ : అమిత్‌ జీ!

అమిత్‌ షా : చెప్పండి మోదీజీ!


మోదీ : ( చుట్టూ చూస్తూ ) చెప్పండి, ఏం చేద్దాం?

అమిత్‌ షా : చెప్పాల్సింది మీరే సార్‌! మీరు ఏం వెలిగించమంటే అవి వెలిగిస్తాం.


మోదీ : ఎంతసేపూ లైట్లు వెలిగించడమేనా? నేను మాట్లాడేది లాక్‌ విషయం. ఇది లైట్‌ విషయం కాదు. లైట్‌గా తీసుకునే విషయం కాదు. చెప్పండి. లాక్‌ తెరుద్దామా? వద్దా?

కార్యకర్త : ( మోదీ తో ) సార్‌ మీకు పుణ్యం ఉంటుంది, తెరవండి సార్‌. దేశప్రజలంతా ఏ తప్పూ చెయ్యకపోయినా ఖైదీల్లాగ లోపల మగ్గిపోతున్నారు… ఈ చెరనించి ఎప్పుడు బయటపడతామా అని తెగ ఇదైపోతున్నారు.


మోదీ : బావుంది. ఇది మన ఒక్క దేశం సమస్యా కాదయ్యా. అంతర్జాతీయ సమస్య. అమాంతం తెరిచేయడానికి లేదు. తాళం చేతిలో ఉంది కదా అని - కప్ప తెరిచేస్తే... జనం కప్పల్లా ఎగిరి బయటికొచ్చేస్తారు.

కార్యకర్త : ( ఎక్స్‌ప్రెషన్‌ )

కార్యకర్త : సరే. కప్పల తక్కెడని కంట్రోల్‌ చేయలేం అనుకుంటే మరి... ఇలాగే మూసే ఉంచండి మరి.


మోదీ : మూసి ఉంచేస్తే ఇంకో ముప్పుంది. ఆర్థికంగా బాగా దెబ్బ తినిపోతాం.

అమిత్‌ షా : ఎస్‌. ముందు నుయ్యి... వెనక గొయ్యి అన్నట్టుంది ఈ వ్యవహారం.

కార్యకర్త : నుయ్యీ గొయ్యీ కాదండి. ముందు ప్రాణాంతకం. వెనక ఆర్థికం.. (మోదీతో ) ఏం సార్‌?


మోదీ : ( ఎక్స్ ప్రెషన్ )

అమిత్‌ షా : ( మోదీకి మార్గాలు చూపిస్తూ ) అవుగో సార్‌. మన ముందున్న ఆప్షన్స్‌ అవీ... ( సంపూర్ణ మార్గం ) అది సంపూర్ణ మార్గం ... అది తెరిస్తే... మొత్తం అందరూ బయటికొచ్చేయచ్చు.


మోదీ : అమ్మో. అది ఇప్పుడు కాదు. కరోనా మొత్తం ఖత్మ్‌ కర్నే కే బాద్‌ హీ... ఉస్కో ఓపెన్‌ కర్నా హై.

అమిత్‌ షా : ఇక.. ( పాక్షిక మార్గం చూపిస్తూ ) ఇక.. ఇది పాక్షిక మార్గం... ఇది ఓపెన్‌ చేస్తే పరిమితంగా మాత్రమే ప్రజలు బయటికి రాగలుగుతారు.

కార్యకర్త : ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో - కరెక్ట్‌ గా చెప్పి తెరవండి సార్‌. లేకపోతే లాక్‌ ఓపెన్‌ చేయగానే గుళ్లూ మాల్‌లూ కిక్కిరిసిపోతాయ్‌. అసలే సరుకులకోసం, మనశ్శాంతి కోసం జనం వెర్రెత్తిపోయి ఉన్నారు.


మోదీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )

అమిత్‌ షా : ఇక( లాభ మార్గం చూపిస్తూ) ఇది లాభ మార్గము... దేశంలో ప్రొడక్టివిటీ పెరగాలన్నా.. దేశానికి ప్రాఫిట్‌ రావాలన్నా...ఈ మార్గంద్వారానే జనాన్ని వదలాల్సి ఉంటుంది.కాకపోతే ఇందులో కాస్త రిస్కెక్కువ.

కార్యకర్త : అమ్మో. రిస్కా? అయితే వద్దు సార్‌. లోపలే ఉందాం.


అమిత్‌ షా : ( ఎక్స్‌ప్రెషన్‌ )

అమిత్‌ షా : ( నష్టమార్గం చూపిస్తూ ) ఇక ఇది నాలుగోది.. ఇది నష్ట మార్గము.. దీని తాళం తెరిస్తే - ఏదో కొద్దిమందిని బయటికి వదుల్తుంది తప్ప – దాదాపు లాక్‌ డౌన్‌ అంతా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ పద్ధతిలో - మనం ఆర్థికంగా మరికొంతకాలం నష్టపోవాల్సి వస్తుంది.

మోదీ : ధననష్టం అయినా పరవాలేదు. కానీ జన నష్టం జరగకూడదు. జై భారత్‌ మాతా కీ జై!

అమిత్‌ షా : సరే సార్‌ ... ఇవిగో తాళాలు... ( తలుపులు.. అమిత్‌ షా చేతిలో తాళాల గుత్తి చూపిస్తాం. )

( అమిత్‌ షానుంచి మోదీ తాళాల గుత్తి తీసుకుంటాడు. )

( మోదీ ఒక్కడూ చేతిలో తాళం గుత్తితో ద్వారం దగ్గరకి వెళతాడు. రెండు తలుపులూ పట్టుకుని మధ్యలో సందుందేమో అన్నట్టు చూస్తుంటాడు. )

కార్యకర్త : ఏంటి సార్‌ చూస్తున్నారు?


మోదీ : ఏమీ లేదు. ఇంతకాలం లాక్‌ డౌన్‌తో ప్రజల్ని బాధపెట్టాం కదా? ఏం అనుకుంటున్నారో అని...

కార్యకర్త : అనుకోడానికి ఏముంది సార్‌? బతికుంటే బలుసాకు తినచ్చు. మోదీగారే కరెక్ట్‌ అంటున్నారు.


మోదీ : కానీ అభివృద్ధి మొత్తం ఆగిపోయింది కదా? అదే నా బాధ.

కార్యకర్త : బావుంది. లాక్‌ డౌన్‌ కి ముందర మాత్రం దేశం పరుగులు తీసిందా ఏంటి? అప్పుడూ ఆర్థిక సమస్యలే కదండీ? అయినా అంత గొప్పగా అభివృద్ధి చెందిపోయిన అమెరికా ఇప్పుడు ఏం పీకిందో చూస్తున్నాం కదా? ఇండియా ఇండియాలా ఉంటే చాలు సార్‌. మీరు తాళం తీయండి.


ఏబీఎన్ ఫేస్‌బుక్ పేజీ, ట్విటర్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు, కథనాలు పొందండి

టెలీగ్రామ్ ద్వారా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తాజా సమాచారం పొందండి

మీరు మెచ్చిన తారల చిత్రాలు, హాట్‌హాట్ పొలిటికల్ ట్వీట్స్ కోసం ఆంధ్రజ్యోతి ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఫాలో అవండి

మీ అభిమాన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

యాపిల్ యూజర్ల కోసం కూడా అందుబాటులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాప్

Updated Date - 2020-04-18T01:48:21+05:30 IST