Abn logo
May 30 2020 @ 02:47AM

హనుమంతుని శక్తి

హనుమంతుడు వేద వేదాంగాలను అభ్యసించిన నవ వ్యాకరణ వేత్త. మహా బలవంతుడు, బుద్ధికుశలుడు, కార్యదక్షుడు. అందుకే.. సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని దాటి లంకకు వెళ్లగలిగిన కార్యశూరుడు ఎవరా అని అందరూ ఆలోచిస్తుంటే.. జ్ఞానవృద్ధుడైన జాంబవంతుడు హనుమ పేరు చెప్పాడు. ఆ సమయంలో దూరంగా ఒంటరిగా కూర్చున్న ఆంజనేయుడి వద్దకు వెళ్లి..


పక్షయోః యద్బలం తస్య తావద్భుజ బలం తవ

విక్రమశ్చాపి వేగశ్చ న తే తేనావహీయతే

బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్త్వంచ హరి పుఙ్గవ

విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే


..అన్నాడు. ‘‘ఓ వాయుపుత్రా! గరుత్మంతుని రెక్కలకు ఎంతటి బలం ఉన్నదో, నీ భుజాలకు కూడా అంతటి బలమున్నది. గరుత్మంతునికి సాటి రాగలిగిన శక్తి సామర్థ్యాలను, బలపరాక్రమాలను ప్రయాణ వేగమును నీవు కలిగియున్నావు. ఓ వానర శ్రేష్ఠుడా! గొప్పవైన దేహబల బుద్ధి బలములను, తేజస్సు, సామర్థ్యములను కలిగి ఉన్న నీవు వానరులలోనే కాక సర్వప్రాణులలోనూ విశిష్టుడవని గుర్తించు’’ అని చెప్పి సముద్రలంఘనానికి సిద్ధం చేశాడు. హనుమంతుని వ్యవహార దక్షతను, సంభాషణా చాతుర్యాన్ని, శక్తియుక్తులను గుర్తించినందునే.. శ్రీరామచంద్రుడు ఆనవాలుగా తన ఉంగరాన్ని హనుమకు ఇచ్చాడు. అంతేకాదు.. దేవతలు దిక్పాలకులు కూడా ప్రవేశించడానికి భయపడే లంకలోకి ప్రవేశించి, అశోక వన భంగం చేసి రావణుని ముఖ్య పరివారాన్ని వధించి, లంకాదహనం చేసి సీతాదేవి క్షేమంగా ఉందన్న సమాచారంతో తిరిగి వచ్చిన హనుమంతుని శక్తిసామర్థ్యాలను గురించి


కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభమ్‌

మనసాపి యదన్యేన నశక్యం ధరణీతలే

‘‘ఈ భూలోకంలో వేరెవరూ సాధించలేని, కనీసం మనసులో సంకల్పించడానికి కూడా సాధ్యపడని, దుర్లభమైన మహత్కార్యాన్ని హనుమంతుడు సాధించాడ’’ని లక్ష్మణుడికి రాముడు చెప్పాడు. యుద్ధరంగంలో ఇంద్రజిత్తు బాణాలకు రామలక్ష్మణులు మూర్ఛిల్లి, వానరసైన్యమంతా కకావికలమైనప్పుడు.. ‘హనుమ జీవించి ఉన్నాడా?’ అని జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు.


‘‘రామలక్ష్మణులు, సుగ్రీవాంగదుల గురించి కాకుండా హనుమంతుడి గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నావ’’ని విభీషణుడు అడగ్గా.. ‘హనుమ ఒక్కడు జీవించి ఉంటే మన పరివారమంతా చనిపోయినా అందరూ బతికి ఉన్నట్లే. మనందరినీ బతికించగల శక్తి హనుమంతుడికి ఉన్నది. హనుమంతుడు ఒక్కడు జీవించి లేకపోతే మనమంతా జీవించి ఉన్నా ప్రాణాలు కోల్పోయినవారమే అవుతాం’’ అని బదులిచ్చాడు. అంజనీపుత్రుడి శక్తియుక్తులు ఎంత గొప్పవో చెప్పే పలుకులివి. శక్తి, యుక్తితోపాటు.. వినయవిధేయతలను కలిగి ఉన్నవారే సర్వవిజయాలనూ సాధించగల కార్యదక్షత కలిగి ఉంటారని చెప్పే హనుమ జీవితం మనందరికీ ఆదర్శం. 


- సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267

Advertisement
Advertisement
Advertisement