‘శాతవాహన’లో కలకలం

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

శాతవాహన విశ్వవిద్యాలయంలో కలకలం రేగింది. విశ్వవిద్యాలయానికి 12బీ గుర్తింపు రాకుండా అడ్డుకునే యత్నాలు చేశారంటూ వర్సిటీలో ఒప్పంద అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురిపై ఉపకులపతి వేటు వేశారు.

‘శాతవాహన’లో కలకలం
శాతవాహన యూనివర్సిటీ వ్యూ

- 12బీ అడ్డుకునే యత్నం చేశారని ఒప్పంద అధ్యాపకులపై ఆరోపణలు

- ఐదుగురిపై వేటు

గణేశ్‌నగర్‌, మే 19: శాతవాహన విశ్వవిద్యాలయంలో కలకలం రేగింది. విశ్వవిద్యాలయానికి 12బీ గుర్తింపు  రాకుండా అడ్డుకునే యత్నాలు చేశారంటూ వర్సిటీలో ఒప్పంద అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురిపై ఉపకులపతి వేటు వేశారు. యూజీసీ నుంచి 12బీ గుర్తింపు వచ్చే క్రమంలో రాకుండా అడ్డుపడే విధంగా ఆరు లేఖలు వర్సిటీకి సంబంధం లేని వ్యక్తుల పేర్లతో రాసిన శాతవాహన యూనివర్సిటీలోని ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులను విధుల నుంచి తొలగించారు. ముందుగా నలుగురితో కూడిన ప్రత్యేక కమిటీ వేసి అనుమానితులకు షోకాజు నోటీసులు పంపించారు. కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా వీసీ ప్రొఫెసర్‌ సుంకిశాల మల్లేశం వారిపై వేటు వేసినట్లు తెలిసింది. వీరితోపాటు మరికొంతమంది అధ్యాపకులు కూడా ఉన్నట్లు, వారిని కూడా గుర్తించే పనిలో కమిటీ ఉన్నట్లు సమాచారం. యూజీసీ గుర్తింపు ఇవ్వద్దంటూ, వర్సిటీలో తెలుగు, మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌, బాటనీ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన విషయాల్లో పలు లోపాయాలన్నాయంటూ వారు లేఖలో పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ యూజీసీకి దరఖాస్తు చేసకున్నారని, 12బీ తనిఖీలకు వస్తే సదరు అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారని వివిధ ఆరోపణలు చేస్తూ లేఖల్లో పేర్కొన్నారు. 


 విచారణ జరపాలంటూ యూజీసీ సూచన


శాతవాహనకు 12బీ గుర్తింపు వచ్చిన తర్వాత యూజీసీ నుంచి శాతవాహన యూనివర్సిటీకి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు 12బీ గురించి పలు లేఖలు వచ్చాయని, దానిపై లోతుగా విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు వీసీ నలుగురితో కూడిన ఒక కమిటీ వేసి విచారణ ప్రారంభించారు. విచారణ ప్రారంభమైన మొదటిరోజు పలు విభాగాలకు చెందిన కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో చూడగా లేఖలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇందులో తెలుగు, ఇంగ్లీష్‌, బాటనీ, కంప్యూటర్‌, ఎంబీఏ అధ్యాపకులు ఉన్నట్లు తేలడంతో వారిని తొలగించినట్లు వీసీ తెలిపారు. ఇద్దరు యూనివర్సిటీ పరిపాలన విభాగంలో పనిచేసే సిబ్బంది పాత్ర ఉన్నట్లు తెలిసింది. వారి పాత్రపై కూడా ప్రత్యేక కమిటీతో లోతుగా విచారణ జరుగుతోంది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ అధికార యంత్రాంగం ప్రకటించింది. 


 కఠిన చర్యలు తీసుకోవాలి - కరికె మహేశ్‌, పూర్వ విద్యార్థి

శాతవాహన యూనివర్సిటీకి 12బీ గుర్తింపు రాకుండా యూజీసీకి లేఖలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వీరికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. గతంలోనూ యూనివర్సిటీపై తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకొని యూనివర్సిటీ నుంచి బహిష్కరించేలా వీసీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. 







Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST