అన్నాడీఎంకేకు మళ్ళీ Sasikala షాక్‌

ABN , First Publish Date - 2021-10-18T16:33:52+05:30 IST

అన్నాడీ ఎంకే నాయకులంతా పార్టీ స్వర్ణోత్సవాలను అట్టహాసంగా జరుపుకుంటున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీలో చిచ్చురగిల్చేలా ఆ పార్టీకి తానే ప్రధాన కార్యదర్శినంటూ

అన్నాడీఎంకేకు మళ్ళీ Sasikala షాక్‌

శిలాఫలకంలో ప్రధాన కార్యదర్శిగా ప్రకటన

పోటీగా పార్టీ స్వర్ణోత్సవాలు


చెన్నై: అన్నాడీ ఎంకే నాయకులంతా పార్టీ స్వర్ణోత్సవాలను అట్టహాసంగా జరుపుకుంటున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీలో చిచ్చురగిల్చేలా ఆ పార్టీకి తానే ప్రధాన కార్యదర్శినంటూ ఓ శిలాఫలకం సాక్షి గా ప్రకటించుకున్నారు. ఓ వైపు అన్నాడీఎంకే నేతలంతా రాయపేటలోని పార్టీ ప్రదాన కార్యాలయం వద్ద పార్టీ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటుండగా అదే సమయంలో శశికళ పోటీగా పార్టీ స్వర్ణోత్సవ వేడుకలు జరిపారు. పార్టీ పతాకాన్ని సైతం ఆవిష్కరించారు. ఎప్పటివలెనే జయలలిత ఉపయోగించిన లగ్జరీ కారులో అన్నాడీఎంకే పతకాన్ని కట్టు కుని అన్నిచోట్లా పర్యటించారు. అన్నా డీఎంకే స్వర్ణోత్సవాలను పురస్కరిం చుకుని శశికళ ఆదివారం ఉదయం టి.నగర్‌లో ఉన్న ఎంజీఆర్‌ స్మారక మందిరానికి వెళ్ళి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంజీఆర్‌ విగ్రహానికి గజమాలను వేసి నివాళులర్పించారు.


ఆ తర్వాత స్వర్ణోత్సవాల ప్రారంభాన్ని తెలియ జేసేలా ఓ శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించా రు. ఆ శిలాఫలకంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అని చెక్కబడి వుండటం తీవ్ర సంచలనం కలిగించింది. ఆ తర్వాత శశికళ స్మారకమందిరంలో ఎంజీఆర్‌ ఉపయో గించిన వస్తువులతో కూడిన ప్రదర్శనశాలను తిలకించారు. ఎంజీఆర్‌, జయలలిత చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఎంజీఆర్‌ ఉపయోగించిన కారు ఎదుట నిలిచి ఫొటో తీయించుకున్నారు. టి.నగర్‌లో ఈ కార్యక్రమాలను ముగించుకుని శశికళ మందీమార్బలంతో రామాపురంలోని ఎంజీఆర్‌ నివాసగృహానికి ఉదయం 12గంటలకు వెళ్ళారు. అక్కడ శశికళకు మహిళా కార్యకర్తలు కర్పూర హారతినిచ్చి స్వాగతం పలికారు. ఎంజీఆర్‌ నివాసగృహంలో అడుగుపెట్టడానికి ముందు శశికళ గడపను కళ్ళకు అద్దుకున్నారు. ఎంజీఆర్‌ కుటుంబీకులు ఇచ్చిన కొబ్బరి నీళ్ళను శశికళ తాగారు. ఆ తర్వాత ఎంజీఆర్‌ సతీమణి జానకి రామచంద్రన్‌ చిత్రపట్టం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత ఎంజీఆర్‌ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ స్వర్ణోత్సవాల ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడి బధిర,మూగ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేసి, తాను కూడా వారితో కలిసి భోజనం చేశారు. టి.నగర్‌లోని ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద, రామాపురం ఎంజీఆర్‌ నివాసగృహం వద్ద శశికళ రాక సందర్భంగా వేలాదిమంది పార్టీ కార్యకర్తలు గుమికూడి ‘చిన్నమ్మ వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. శశికళను ఆహ్వానిస్తూ మంగళవాయిద్యాలతో కళాకారులు స్వాగతం పలికారు.

Updated Date - 2021-10-18T16:33:52+05:30 IST