‘పదిరోజుల్లో శశికళ విడుదల’

ABN , First Publish Date - 2020-10-23T16:33:35+05:30 IST

అక్రమార్జన కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పదిరోజుల్లో విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ ప్రకటించారు. గురువారం ఆయన చెన్నైలో మీడియా ప్రతినిధులతో

‘పదిరోజుల్లో శశికళ విడుదల’

చెన్నై : అక్రమార్జన కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పదిరోజుల్లో విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ ప్రకటించారు.  గురువారం ఆయన చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కర్నాటకలోని కోర్టులకు దసరా సెలవులు ముగిసిన తర్వాత శశికళ విడుదలకు సంబంధించిన శుభవార్త వెలువడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు శశికళ వచ్చే యేడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి వుంది. అయితే శశికళను వచ్చే యేడాది జనవరి చివరలో విడుదల చేసే అవకాశముందని, అంతకు ముందు కోర్టు విధించిన అపరాధపు సొమ్ము రూ.10.10కోట్లను ఆమె చెల్లించాల్సి ఉందని కర్నాటక జైళ్ల శాఖ అధికారులు ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రకటించారు. ఈ విషయమై రాజా సెంధూర్‌ పాండ్యన్‌ మాట్లాడుతూ అపరాధపు సొమ్ము ఇప్పటికే సిద్ధం చేశామని, కర్ణాటకలో కోర్టులు తెరచిన వెంటనే ఆ సొమ్ము చెల్లిస్తామన్నారు.


శశికళ నుంచి తగిన సమాచారం రాగానే అపరాధపు సొమ్ము తక్షణమే చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కర్ణాటక జైళ్ల శాఖ నిబంధనల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రతి నెలా మూడురోజులపాటు శిక్ష తగ్గే అవకాశముంటుం దన్నారు. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు శశికళకు 129 రోజులు జైలు శిక్ష తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే శశికళ 43 నెలలపాటు పూర్తిగా జైలు శిక్ష అనుభవించారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో శశికళ ఏ సమయంలోనైనా విడుదలయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలోని కోర్టులకు దసరా సెలవులని, ఈ నెల 26 తర్వాత కోర్టులు పునఃప్రారంభం అయిన తరువాత ఈ నెల 27న శశికళ విడుదలకు సంబంధించి శుభవార్త వెలువడుతుందని రాజా సెంధూర్‌పాండ్యన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల శశికళ తనకు రాసిన లేఖలో వీలైంత త్వరగా విడుదలవుతాననే నమ్మకాన్ని ప్రకటించారని ఆయన చెప్పారు. కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు శశికళకు ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే వెంటనే తనకు తెలియజేస్తారని, ఆ సమాచారం ఆధారంగా తాను న్యాయకోవిదులతో సంప్రదింపులు జరిపి వీలైనంత త్వరగా విడుదల చేయిస్తానని ఆయన చెప్పారు. ఏది ఏమైనప్పటికి శశికళ విడుదలపై పదిరోజుల్లో శుభవార్త వెలువడటం ఖాయమని రాజా సెంధూర్‌ పాండ్యన్‌ గట్టిగా చెబుతున్నారు.

Updated Date - 2020-10-23T16:33:35+05:30 IST