వారిద్దరి సమస్యను పరిష్కరిస్తా .. ఆ బాధ్యత నాకుంది

ABN , First Publish Date - 2022-06-27T16:49:34+05:30 IST

అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం ఓపీఎ్‌స-ఈపీఎస్‌ మధ్య నెలకొన్న సమస్యను తాను పరిష్కరిస్తానని, పార్టీని ఆది నుంచి పరిశీలించిన

వారిద్దరి సమస్యను పరిష్కరిస్తా .. ఆ బాధ్యత నాకుంది

తిరుత్తణిలో శశికళ

రాష్ట్ర పర్యటనకు శ్రీకారం


చెన్నై/అడయార్‌: అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం ఓపీఎ్‌స-ఈపీఎస్‌ మధ్య నెలకొన్న సమస్యను తాను పరిష్కరిస్తానని, పార్టీని ఆది నుంచి పరిశీలించిన వ్యక్తిగా ఆ బాధ్యత తనకుందని వీకే శశికళ ప్రకటించారు. ఆదివారం ఉదయం స్థానిక టి.నగర్‌లోని తన నివాసం నుంచి రాష్ట్ర పర్యటనకు బయలుదేరిన శశికళ.. కోయంబేడు, పూందమల్లి, తిరువళ్ళూరు రోడ్డు మీదుగా తిరుత్తణికి చేరుకున్నారు. ఆమెకు స్థానిక నేతలు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలుకగా, భారీగా వాహనాలు ఆమె కాన్వాయ్‌ను వెంబడించాయి. ఈ సందర్భంగా ఆమె తిరుత్తణిలో విలేఖరులతో మాట్లాడుతూ... పార్టీలో సమస్య ఓపీఎ్‌స-ఈపీఎస్‌ మధ్యనే వుంది తప్ప, ఇతర నేతల్లో లేదని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌, జయలలిత స్థాపించిన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తామందరిపైనా వుందని, అందుకే తాను ఆ బాధ్యతలు తీసుకుంటానని పేర్కొన్నారు. అన్నాడీఎంకేకు తాను నేతృత్వం వహిస్తానని, ఈసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తన వెంటే వున్నారని, తాను పార్టీ పగ్గాలు చేపడతానని కార్యకర్తలు ఎంతో నమ్మకంతో వున్నారన్నారు. తన నాయకత్వంలో పని చేసేందుకు కార్యకర్తలంతా తహతహలాడుతున్నారని శశికళ పేర్కొన్నారు. 


దినకరన్‌తో ఓపీఎస్‌ భేటీ?

ఈపీఎ్‌సతో తీవ్రంగా విభేదిస్తున్న ఓపీఎస్‌.. అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌తో మాట్లాడినట్లు తెలిసింది. చాలాకాలంగా శశికళ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న ఓపీఎస్‌.. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం కనబరచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు పార్టీలో ఆయన అధికారాలకు కత్తెర వేసేందుకు ఈపీఎస్‌ సిద్ధమైన తరుణంలో.. ఓపీఎస్‌ దినకరన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో దాదాపు ఒంటరైన తనను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఓపీఎస్‌ కోరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. 

Updated Date - 2022-06-27T16:49:34+05:30 IST