కుదుటపడుతున్న శశికళ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-01-25T12:45:43+05:30 IST

కరోనా బారిన పడి ఆస్పత్రి పాలైన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ క్రమంగా కోలుకుంటున్నారు. దీంతో ఆమె మద్దతుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కానీ ముందుగా...

కుదుటపడుతున్న శశికళ ఆరోగ్యం

27న చెన్నై రాక అనుమానమే

స్వాగత ఏర్పాట్లు వాయిదా

చిన్నమ్మ ఆరోగ్యంపై ఎమ్మెల్యే వాకబు


చెన్నై (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి ఆస్పత్రి పాలైన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ క్రమంగా కోలుకుంటున్నారు. దీంతో ఆమె మద్దతుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కానీ ముందుగా అనుకున్నట్టుగా ఆమె ఈనెల 27వ తేదీన చెన్నై రావడం దాదాపు రద్దయినట్టే కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈనెల 27వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే ఆమె కరోనా కారణంగా అనారోగ్యం బారిన పడడంతో బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు జ్వరం తగ్గినట్లు వైద్యులు ప్రకటించారు. అంతేగాక ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్‌ తగ్గిందని, రక్తపోటు, మధుమేహం నియంత్రణలోకి వచ్చాయని వారు వివరించారు.


27న రానట్టే : ముందుగా అనుకున్న ప్రకారం శశికళ ఈనెల 27వ తేదీన చెన్నై రావాల్సి వుంది. ఆమెకు వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి. కానీ ఈ స్వాగత ఏర్పాట్లను వాయిదా వేసుకున్నాయి. శశికళ కోలుకున్న అనంతరం ఆమె 15 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాల్సి వుంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె చెన్నైకి రాలేరు. అందువల్ల బెంగుళూరులోనే ఏదో ఒక ఆస్పత్రిలో గానీ, లేదా ప్రత్యేక భవనంలో గానీ వుంటారని ఆమె బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె ఆరోగ్య దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రిలో వుంచుతామని వారు పేర్కొన్నారు. మరోవైపు ఆమె విడుదల కావాల్సిన రోజున జైలు అధికారులు ఆస్పత్రికి వచ్చి దస్త్రాలపై ఆమె వద్ద సంతకం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక శశికళ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, అధికారులే ఆస్పత్రికి వచ్చి ఆమెకు సంబంధించిన వస్తువులు, జైలులో ఆమె చేసిన పనికి వచ్చిన జీతం చెక్కు తదితరాలను ఆమెకు అప్పగిస్తారని జైళ్లశాఖ వర్గాలు పేర్కొన్నారు. అదేవిధంగా ఆమెకు పోలీసు భద్రత కూడా ఉపసంరించుకుంటారు. అందువల్ల శశికళ అక్కడే వుండాలా, లేక వేరే ప్రాంతానికి వెళ్లాలా అన్నది ఆమె ఇష్టమే.  


అన్నాడీఎంకే ఎమ్మెల్యే వాకబు : శశికళ జైలు నుంచి విడుదల తేదీ సమీపించేకొద్దీ అన్నాడీఎంకేకు రోజుకో షాక్‌ తగులుతోంది. ఇన్నాళ్లూ మిన్నకుండిపోయిన ఒక్కోనేత బహిరంగంగానే శశికళను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా దిండుగల్‌ జిల్లా వేడచ్చందూర్‌ అన్నాడీఎంకే ఎమ్మెల్యే డాక్టర్‌ పరమశివం అమ్మా మక్కల్‌ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్‌కు ఫోన్‌ చేసి శశికళ ఆరోగ్యంపై వాకబు చేసిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో హాల్‌చల్‌ చేస్తోంది. నిజానికి పరమశివానికి శశికళే ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. ఆమె అనుచరగణమే ఆయనకు విజయం చేకూర్చిపెట్టింది. అన్నాడీఎంకే నుంచి శశికళను బహిష్కరించినప్పుడే ఆయన కూడా పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడుతూ ఇన్నాళ్లూ శశికళ వ్యవహారంపై నోరెత్తలేదు. కానీ ఇప్పుడు ఆయన శశికళ ఆరోగ్యంపై వాకబు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-01-25T12:45:43+05:30 IST