శశికళతో భేటీకి దినకరన్‌ బెంగళూరు పయనం

ABN , First Publish Date - 2020-09-24T13:58:12+05:30 IST

అక్రమార్జన కేసులో శిక్షపడి బెంగళూరు పరపన అగ్రహారం జైలు లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి

శశికళతో భేటీకి దినకరన్‌ బెంగళూరు పయనం

చెన్నై : అక్రమార్జన కేసులో శిక్షపడి బెంగళూరు పరపన అగ్రహారం జైలు లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను కలుసుకునేందుకు అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌ రహస్యంగా బెంగళూరు బయలుదేరి వెళ్ళారు. శశికళను ముందుగా విడుదల చేయించడానికి గాను దినకరన్‌ ఇటీవల ప్రత్యేక  విమానంలో తన స్నేహితుడు మల్లిఖార్జునను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్ళారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదులతో శశికళ ముందస్తు విడుదల చేయించడానికి గల అవకాశాలపై చర్చించారు. శశికళ ఈ నెలాఖరులోగా విడుదలవుతారని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ చెబుతున్నారు. అయితే కర్నాటక జైళ్ల శాఖ అధికారులు శశికళ విడుదల పై ఆర్టీఐ చట్టం ప్రకారం ఓ ప్రముఖుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ శశికళ వచ్చే యేడాది జనవరి 27 విడుదలయ్యే అవకాశం ఉందని, అయితే ఆలోగా ఆమె రూ.10 కోట్ల అపరాధ రుసుము చెల్లించాల్సి వుందని సమాధానమిచ్చారు.


ఈ అంశాలపై ఢిల్లీలో కలుసుకున్న న్యాయవాదులు, న్యాయనిపుణులకు దినకరన్‌ వివరించారు. న్యాయవాదులతో చర్చలు  అనంతరం దినకరన్‌ ఢిల్లీలో బీజేపీ సీనియర్‌ నాయకులు పలువురిని రహస్యంగా కలుసు కున్నారు. ఢిల్లీలో ఓ స్టార్‌ హోటల్‌లో బసచేసిన దినకరన్‌ వీడియో కాన్షరెన్స్‌ ద్వారా బీజేపీ సీనియర్‌ నాయకులతో వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తుల కోసం చర్చించినట్లు తెలుస్తోంది. సుమారు గంటన్నర సేపు ఈ చర్చలు కొనసాగినట్లు దినకరన్‌ అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో శశికళను ముందుగా విడుదల చేయించడానికి తగు చర్యలు తీసుకోవాలని దినకరన్‌ బీజేపీ నాయకులను కోరారని వారు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లోగా ప్రస్తుతమున్న అన్నాడీఎంకేతో కలిసి సమైక్య పార్టీగా మారి పోటీ చేస్తే అటు అన్నాడీఎంకే, ఇటు బీజేపీ లాభపడతాయని బీజేపీ నేతలు దినకరన్‌కు సలహా ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాలపై దినకరన్‌ ఎలాంటి వివరాలను వెల్లడించకుండా ఢిల్లీ నుంచి చెన్నై చేరుకుని మంగళవారం మధ్యాహ్నం విమానంలో బయల్దేరి బెంగళూరు చేరుకున్నారు.


సుమారు ఐదు నెలల తర్వాత దినకరన్‌ జైలులో ఉన్న శశికళను కలుసుకోనుండటం విశేషం. ప్రస్తుతం కర్నాటకలో కరోనా నిబంధనల కారణంగా ఆ రాష్ట్రంలో వివిధ జైళ్లలో ఉన్న ఖైదీల ను కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ విషయం తెలిసినా దినకరన్‌ బెంగుళూరు వెళ్ళారు. అక్కడి జైళ్లశాఖ ఉన్నతాధికారులను కలుసుకుని అనుమతి పొందిన తర్వాత దినకరన్‌ ఒకట్రెండు రోజుల్లో శశికళను కలుసుకుంటారని చెబుతున్నారు. శశికళను కలుసుకుని ఢిల్లీలో తాను ఆమె విడుదల కోసం న్యాయనిపుణులతో జరిపిన చర్చలు గురించి, బీజేపీ జాతీయ కమిటీ నాయకులతో ఎన్నికల పొత్తులపై జరిగిన మంతనాలను గురించి ఆయన వివరించనున్నట్లు తెలుస్తోంది.


అన్నాడీఎంకే విముక్తికి యత్నాలు...

బెంగళూరు జైలు నుంచి శశికళ విడుదల కాగానే అన్నాడీఎంకేకు విముక్తి కలిగించే ప్రయ త్నాలు చురుకుగా జరుగుతాయని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం కోశాధికారి, మాజీ శాసనసభ్యుడు వెట్రివేల్‌ తెలిపారు. చెన్నైలో బుధవారం ఉదయం ఆయన మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ శశికళ జైలు నుంచి విడుదల కాగానే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయని జోస్యం చెప్పారు. ఢిల్లీ వెళ్ళిన దినకరన్‌ బీజేపీ నేతలతో చర్చలు జరిపినట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పారు. ఏది ఏమైనప్పటికీ శశికళ జైలు నుంచివిడుదలైన వెంటనే అన్నాడీఎంకేను అవినీతిపరుల బారి నుంచి విముక్తి కలిగిస్తారని ఆయన చెప్పారు.

Updated Date - 2020-09-24T13:58:12+05:30 IST