Abn logo
Feb 20 2020 @ 04:05AM

బాలింత మృతిపై వివాదం

వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆందోళన

మధ్యాహ్నం వరకూ న్యాయం కోసం డిమాండ్‌

జిల్లా సర్వజనాస్పత్రిలో దారుణం


అనంతపురం వైద్యం, ఫిబ్రవరి 19 : ఓ నిండు గర్భిణి నవమాసాలు నిండి ప్రసవం కోసం జిల్లా సర్వజనాస్పత్రికి వచ్చింది. సాధారణ ప్రసవంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బంధువులందరూ ఆనందపడ్డారు. అయితే ఆ ఆనందం కొన్నిగంటల్లో ఆవిరైపోయింది. జన్మనిచ్చిన తల్లి కన్నుమూసింది. పుట్టిన బిడ్డ అమ్మలేని అనాథగా మారిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి చనిపోయిందంటూ బంధువులు ఆర్తనాదాలు పెట్టారు. మధ్యాహ్నం వరకూ బాలింత శవాన్ని వార్డులోనే ఉంచి నిరసన సాగించారు. చివరకు పోలీసులు, సూపరింటెండెంట్‌ హామీతో ఆందోళన విరమించారు. ఈ ఘటన బుధవారం జిల్లా సర్వజనాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శింగనమల మండలం సోదనపల్లికి చెందిన అపర్ణ (19)కు అదే మండలం నాయనపల్లికి చెందిన నారాయణస్వామితో ఏడాది క్రితం వివాహమయింది. గర్భిణీ అయిన ఆమె ప్రసవం కోసం మంగళవారం సాయంత్రం జిల్లా ఆస్పత్రిలో అ డ్మిట్‌ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సాధారణ ప్రసవంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కథ మలుపులు తిరిగింది. ప్రసవం తర్వాత గర్భంలో ఉన్న మాయపూర్తీగా బయటకు రాలేదు. గర్భసంచికి మాయ అతుక్కుని ఉందని వైద్యులు గుర్తించారు. ఆ మాయను తీయడానికి సాధారణ ప్రయత్నాలు చేసినా ఫలించలేదని వైద్యులు చెబుతున్నారు.


మత్తు మందు ఇచ్చి తొలగించామన్నారు. ఆ తర్వాత కూడా కొన్ని గంటలు అపర్ణ బాగానే ఉంది. అందరితో మాట్లాడినట్లు బంధువులు చెబుతున్నారు. మళ్లీ ఏమి జరిగిందో తెలియదుగానీ.. పడుకుని ఉన్న అపర్ణ పడుకుని ఉన్నట్లుగానే ప్రాణాలు కోల్పోయింది. బుధవారం ఉదయం 7.20 గంటలకు చనిపోయింది. ఆ సమయంలో కూడా వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ఏమి చేశారో మాకు తెలియదు.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మా అమ్మాయి చనిపోయిందంటూ మండిపడ్డారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఆర్‌ఎంఓ డాక్టర్‌ లలితతో బాలింత బంధువులు వాదనకు దిగారు. గంట తర్వాత పెద్ద ఎత్తున బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ శవాన్ని తీసుకెళ్లేది లేదంటూ వార్డులోనే ఉంచారు. మధ్యాహ్నం వరకూ ఈ నిరసన సాగింది. చివరకు పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌, ఇతర అధికారులు వచ్చి బాలింత బంధువులు, వారి తరుపున వచ్చిన పెద్ద మనుషులతో చర్చించారు. ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి బాలింత మృతదేహాన్ని తమ ఊరికి తీసుకెళ్లారు. ఇలా దాదాపు ఆరుగంటల పాటు బాలింత మృతి ఘటన జిల్లా ఆస్పత్రిలో అలజడి రేపింది.


ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి

అపర్ణ మృతి చెందిన విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున ఆస్పత్రికి బంధువులు చేరుకున్నారు. మృతదేహాన్ని చూస్తూ ఆర్తనాదాలు పెట్టారు. ముందుగానే తల్లిలేని అపర్ణ... ఇప్పుడు పెళ్లై ఏడాదికే ఆడబిడ్డకు జన్మనిచ్చి చనిపోవడం జీర్ణించుకోలేకపోయారు. అయ్యో... అపర్ణ ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా అంటూ బంధువులు ఒకరిని ఒకరు పట్టుకుని ఏడ్వడం అందరినీ కలచివేసింది.


ఆ డాక్టర్‌పై ముందు నుంచి విమర్శలు

ప్రస్తుతం బాలింత అపర్ణకు ప్రసవం చేసిన డాక్టర్‌పై ముందు నుంచి అనేక విమర్శలున్నాయి. ఆమె ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ప్రైవేట్‌ ఆస్పత్రి నడుపుతున్నారు. ఆ ఆస్పత్రిలో లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఆత్మకూరుకు చెందిన ఓ గర్భిణీకి అబార్షన్‌ చేయగా... మరణించింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జిల్లా వైద్యాధికారి సైతం ఆ డాక్టర్‌ తీరుపై మండిపడి ఆస్పత్రి సీజ్‌చేసి... షోకాజ్‌ నోటీసు కూడా జారీచేశారు. తాజాగా ఇప్పుడు జిల్లా ప్రభుత్వాస్పత్రి డ్యూటీలో కూడా ఆమె సమక్షంలోనే అపర్ణ ప్రసవం జరిగింది.


పూర్తీస్థాయిలో విచారిస్తాం.. డాక్టర్‌ రామస్వామినాయక్‌,  సూపరింటెండెంట్‌

బాలింత అపర్ణ మృతిపై పూర్తీస్థాయిలో విచారిస్తాం. ఇందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రసవం.. ఆ తర్వాత ఎలాంటి వైద్యసేవలు చేశారో కేషీట్‌ ఆధారంగా పరిశీలిస్తాం. ఫలిమినరీ ఎంబోలిజమ్‌(గర్భానికి మాయ అతక్కుపోవడం)తో పాటు బీపీ, రక్తహీనత కూడా సమస్యకు కారణమైనట్లు వైద్యులు అంచనాకు వచ్చారు. అయితే అన్ని విధాలుగా విచారణ జరుపుతాం. అందులో వైద్యుల లోపం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement
Advertisement