సర్పంచ్‌ భర్తపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T06:51:06+05:30 IST

గంభీరావుపేట మండల ప్రజాపరిషత్‌లో ఎంపీవోగా పని చేస్తున్న రాజశేఖర్‌పై భౌతికంగా దాడి చేసిన సర్పంచ్‌ భర్తపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

సర్పంచ్‌ భర్తపై చర్యలు తీసుకోవాలి
అదనపుకలెక్టర్‌ సత్యప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న ఎంపీడీవో, ఎంపీవో, గ్రామస్థులు

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 27: గంభీరావుపేట మండల ప్రజాపరిషత్‌లో ఎంపీవోగా పని చేస్తున్న రాజశేఖర్‌పై భౌతికంగా దాడి చేసిన సర్పంచ్‌ భర్తపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సోమవారం  కలెక్టరేట్‌కు తరలివచ్చి నిరసన తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ముస్తాఫానగర్‌ సర్పంచ్‌ కొక్కు సంధ్యారాణి భర్త దేవేందర్‌ అక్కడి గ్రామపంచాయతీ కార్యదర్శితోపాటు  మండల పరిషత్‌లో పని చేస్తున్న ఎంపీడీవోతోపాటు ఎంపీవోలను వేధింపులకు గురి చేయడంతోపాటు భౌతిక దాడులకు పాల్పడుతుండడంతో అగ్రహించిన ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు  కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్ధానిక సంస్థల  అదనపు కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ అక్కడి చేరుకున్నారు. సర్పంచ్‌ భర్త చేసిన సంఘటనలను వివరించడంతోపాటు న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందించారు.  డీఆర్‌డీవో మదన్‌మోహన్‌, డీపీవో రవీందర్‌, ఎంపీవో సంఘం జిల్లా అధ్యక్షుడు జోగం రాజు, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు రాజేఽశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యోగులపై భౌతిక దాడులను సహించం

 - స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్‌సత్యప్రసాద్‌

ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడితే సహించబోమని  స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు.  కలెక్టరేట్‌కు  సోమవారం తరలివచ్చిన పంచాయతీ శాఖ ఉద్యోగులతో మాట్లాడారు.  గంభీరావుపేట మండల పరిషత్‌ పంచాయతీ అధికారి రాజశేఖర్‌పై భౌతికంగా దాడి చేసిన ముస్తాఫానగర్‌ సర్పంచ్‌ సంధ్యారాణి భర్త దేవేందర్‌  విషయాన్ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి దృష్టికి తీసుకవెళ్లామన్నారు. సర్పంచ్‌కు బదులు ఆమె భర్త విధుల్లో జ్యోకం చేసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిని అమలు చేయాలని మరోసారి లిఖీతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.  భౌతిక దాడి ఘటనపై  పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదైనందున చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్‌ అధికారులకు సూచిస్తామన్నారు. అధికారులు, ఉద్యోగులపై  ఫిర్యాదులు ఉంటే  జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని  కోరారు. క్షేత్రస్ధాయిలో పని చేసే ఉద్యోగులకు జిల్లా అధికారులు అన్ని విధాలుగా అండగా ఉంటారన్నారు. 

ముస్తాఫానగర్‌ సర్పంచ్‌ సస్పెండ్‌  

పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించడం, విధుల నిర్వహణలో వైఫల్యం, అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే చట్ట వ్యతిరేక పనుల చేయడం వంటివాటితోపాటు  సంబంధిత గ్రామ కార్యదర్శి రాజు, గంభీరావుపేట మండల పంచాయతీ అధికారి రాజశేఖర్‌పై ఒత్తిడి తెచ్చిన ముస్తాఫానగర్‌ సర్పంచ్‌ కొక్కు సంధ్యరాణిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేఽశారు. గతంలోనూ అధికారిక విధుల్లో భర్త జ్యోక్యాన్ని పోత్రహించడం, సర్పంచ్‌గా ఉంటూ సెట్‌ బ్యాక్‌ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టడంతో  అప్పటి కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-28T06:51:06+05:30 IST