Abn logo
Nov 22 2020 @ 00:34AM

సర్పంచులమా.. జీతగాళ్లమా?

విద్యుత్‌ మరమ్మతులకు రూ. 50 వేల లంచం అడిగారు

మండల సమావేశంలో సర్పంచ్‌ల ఆవేదన


వెల్దుర్తి, నవంబరు 21: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రజాప్రతినిధులమని కూడా చూడకుండా కాంట్రాక్టర్లు లంచం డిమాండ్‌ చేస్తున్నారని సర్పంచ్‌లు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ స్వరూప అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బొమ్మారం సర్పంచ్‌ శంకర్‌యాదవ్‌ మాట్లాడుతూ గ్రామంలో ప్రమాదవశాత్తు కూలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కోసం విద్యుత్‌ కాంట్రాక్టర్‌ రూ.50 వేల లంచం డిమాండ్‌ చేశారని ఆరోపించారు. మరమ్మతులు చేయించాలని ఏఈని కోరితే అవమానకరంగా మాట్లాడడమేకాకుండా   రెతులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రిపేరుకు అవసరమయ్యే సామగ్రిని తెప్పిస్తామని చెప్పినా విద్యుత్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యుత్‌ కాంట్రాక్టర్‌ ప్రతీ పనికి డబ్బులు అడుగుతున్నారని సభ్యులు ఆరోపించడంతో, కాంట్రాక్ట్‌ తొలగించాలని సమావేశంలో తీర్మానం చేశారు. శాంశరెడ్డిపల్లి తండా సర్పంచ్‌ శాంతి మాట్లాడుతూ అప్పు చేసి గ్రావల్లో అభివృద్ధి పనులు చేపడితే బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులపై ఒత్తిడి తీసుకువచ్చే అధికారులు బిల్లులు మాత్రం ఇప్పించడము లేదన్నారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సుధాకర్‌గౌడ్‌ మాట్లాడుతూ సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. జడ్పీటీసీ రమేష్‌గౌడ్‌ ఎంపీడీవో జగదీశ్వరాచారి తదితరలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement