జాతీయోద్యమంలో ఈ నేల ముషాయిరా

ABN , First Publish Date - 2022-08-14T06:23:53+05:30 IST

హైదరాబాద్‌ సంఘ సంస్కరణోద్యమానికి ఆద్యుడిగా చరిత్రకెక్కిన అఘోరనాథ్‌ చటోపాధ్యాయ ఎనిమిది మంది సంతానంలో పెద్ద వారు సరోజినీదేవి.

జాతీయోద్యమంలో ఈ నేల ముషాయిరా

భారత కోకిలగా జాతీయోద్యమంలో ఖ్యాతికెక్కిన వైతాళికురాలు సరోజినీదేవి నాయుడు. ఆమె పక్కా హైదరాబాదీ. మహాత్మాగాంధీని సైతం విమర్శించగల తెగువ సరోజినీ సొంతం. ఆంగ్లేయులపై నిరసన జ్వాలగా ఎగసిపడిన సరోజినీ పోరాట స్ఫూర్తిని భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ స్మరించుకుందాం.

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సంఘ సంస్కరణోద్యమానికి ఆద్యుడిగా చరిత్రకెక్కిన అఘోరనాథ్‌ చటోపాధ్యాయ ఎనిమిది మంది సంతానంలో పెద్ద వారు సరోజినీదేవి. భారత జాతీయోద్యమంలో ఆమె ప్రస్థానం ప్రత్యేకమైంది. పద్నాలుగో ఏట నిజాం సైన్యంలో వైద్యుడిగా పనిచేసే డా. గోవిందరాజులతో సరోజినీ ప్రేమలో పడ్డారు. ఆమెకు అప్పుడు పెళ్లికన్నా, చదువు ముఖ్యమని భావించిన అఘోరనాథ్‌.. సరోజినీదేవిని ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌ పంపారు. చిన్నప్పటి నుంచి చదువులో మేటి సరోజినీ. మెట్రిక్యులేషన్‌లో మద్రాసు యూనివర్సిటీ ఫస్ట్‌ ర్యాంకర్‌ కూడా. పదమూడేళ్లకే 1,300 పంక్తుల సుదీర్ఘ కవిత రాసి సాహిత్య విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 

కందుకూరి చేతులమీదుగా పెళ్లి

సరోజినీదేవి లండన్‌ కేంబ్రిడ్జి వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. అక్కడున్న సమయంలోనే ఆమె రాస్తున్న కవితలు పాశ్చాత్య శైలిలో ఉండటాన్ని ఎడ్మండ్‌ గాస్‌ గుర్తించాడు. భారతీయ ఆత్మ ప్రతిబింబించేలా రాయాలని ఆమెకు సూచించారు. అలా విమర్శకుల సూచనలతో రాసిన కవితలను 1916లో ‘ది గోల్డెన్‌ త్రెషోల్డ్‌’ పేరుతో ప్రచురించారు. ఆ సంకలనం వెలువడిన తర్వాతే ఆబిడ్స్‌లోని తన ఇంటికి గోల్డెన్‌ త్రెషోల్డ్‌గా పేరు మార్చారు. ఇప్పటికీ ఆ ఇల్లు అదే పేరుతో సెంట్రల్‌ యూనివర్సిటీ కేంద్రంగా కొనసాగుతోంది. దేశంకాని దేశం వెళ్లినా, ప్రేమికుడిని మర్చిపోలేకపోయింది. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం చేతులమీదుగా సరోజినీదేవి, గోవిందరాజుల వివాహం 1898లో మద్రా్‌సలో జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘసంస్కర్త రాజారామ్మోహన్‌ రాయ్‌ సతీమణి హాజరైనట్లు చరిత్ర అధ్యయనకారులు చెబుతారు. 

క్విట్‌ ఇండియా పోరాటంలో..

సరోజినీదేవి నాయుడు 1915లో గోపాలకృష్ణ గోఖలే ప్రభావంతో భారత స్వాతంత్ర్యోద్యమంలోకి దుమికారు. ఆలిండియా హోమ్‌ రూల్‌ లీగ్‌కు సభ్యురాలుగానూ ఎంపికయ్యారు. 1925లో జాతీయ కాంగ్రె్‌సకి తొలి భారతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1930లో అరెస్ట్‌ అయి జైలు శిక్షనూ అనుభవించారు. 1931లో లండన్‌లో రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మహాత్మాగాంధీతోపాటు పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తినందుకుగాను 1942లో మరోసారి అరెస్ట్‌ అయ్యారు. ఆమె వాక్చాతుర్యం సామాన్యులను సైతం ఆకట్టుకునేదని సరోజినీదేవి ఉపన్యాసం విన్నవాళ్లు చెబుతుంటారు. ఆబిడ్స్‌లోని గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో రవీంద్రనాథ్‌ టాగూర్‌, మహాత్మాగాంధీ వంటి మహనీయులు బసచేశారు. 

పద్మజా నాయుడు పోరాటం

ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌తోపాటు ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తోనూ సరోజినీదేవికి మంచి పరిచయం ఉంది. తన తండ్రికి, తనకు మధ్య తేడా ఏమిటని ఓ రోజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సరోజినీదేవిని అడిగారట. అందుకు ఆమె ఏమాత్రం తడుముకోకుండా.. ‘మీ తండ్రిగారికి హృదయం ఉంది. మీకు మేధస్సు ఉంది’ అని బదులిచ్చారట. సరోజినీదేవి నాయుడు కూతురు పద్మజానాయుడు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసిన రోజున, ఆమె హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టినట్లు చరిత్రలో నమోదైంది. అంతేకాదు, నిజాం ప్రభుత్వ నిర్బంధాలను వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేపట్టినందుకు ఒకటి, రెండు సందర్భాల్లో జైలుకూ వెళ్లారు. నిజాం వ్యతిరేక పోరాటానికి పరోక్షంగా పద్మజానాయుడు మద్దతుగా నిలిచారు. మహాత్మాగాంధీకి ‘మిక్కీ మౌస్‌’ వంటి మారుపేర్లు పెట్టే ధైర్యం ఒక్క సరోజినీదేవిలోనే చూస్తామని చరిత్ర అధ్యయనకారుడు నరేంద్ర లూథర్‌ ఒకచోట ప్రస్తావించారు. బాపూజీ సింప్లిసిటీని సైతం చమత్కరించగల తెగువ ఆమె సొంతం. స్వాతంత్ర్యానంతరం ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రెండేళ్లకే సరోజినీదేవి నాయుడు తుదిశ్వాస విడిచారు. హైదరాబాదీగా ఆమె భారతదేశ జాతీయోద్యమంలో తనదైన ముద్ర వేశారు. 


Updated Date - 2022-08-14T06:23:53+05:30 IST