Abn logo
Dec 21 2020 @ 00:01AM

బతికించే మొక్కల్ని కాపాడాలని...

‘‘ప్రకృతివైద్యం, మూలికా వైద్యం మన వారసత్వం. దాన్ని మనం కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని అది కాపాడుతుంది’’ అంటారు సరోజినీ గెయెల్‌. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆమె అరుదైన ఔషధ మొక్కల పరిరక్షణకు పాటుపడుతున్నారు.  నాలుగువందల మందికి పైగా మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.


నేను నివసించే ప్రాంతం చుట్టుపక్కల దాదాపు 290 జాతుల ఔషధ, సుగంధ మొక్కలు పెరుగుతాయి. వాటిలో అరుదైన ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. అవి అంతరించిపోకుండా కాపాడి, వాటి ప్రయోజనాలను రాబోయే తరం వారికి తెలియజేయడం మన కర్తవ్యం. 


‘‘మారుమూల ఉన్న ఆదివాసీ పల్లెలకు వైద్య సదుపాయాలు అందనంత దూరంలో ఉంటాయి. ఆసుపత్రికి వెళ్ళాలంటే ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది ఎంతో సమయం, ఖర్చు, శ్రమలతో కూడకున్న వ్యవహారం. వారికి తక్షణం అందుబాటులో ఉండేది సంప్రదాయ వైద్య పద్ధతులే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అరవై అయిదు శాతం మంది ఆధారపడుతున్నది సంప్రదాయ వైద్యం మీదే’’ అని చెబుతారు సరోజినీ గోయెల్‌. ముప్ఫై తొమ్మిదేళ్ళ సరోజిని పుట్టింది, పెరిగింది ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఉన్న దుధితంగా రక్షితారణ్యానికి దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరు. ఆమెది తరతరాలుగా వైద్యం చేసే కుటుంబం. ‘‘మా నాన్న మా ప్రాంతంలో హస్తవాసి ఉన్నవాడిగా పేరు పొందారు. ముఖ్యంగా పచ్చకామెర్లను తగ్గించడానికి ఆయన మంచి మందులు ఇచ్చేవారు. నా చిన్నప్పుడు మా అమ్మా నాన్నలతో కలిసి అడవుల్లోకి వెళ్ళేదాన్ని. ఏ మొక్క ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందో వాళ్ళు చెప్పేవాళ్ళు.. ఆ మొక్కల్ని గుర్తు పట్టడం కూడా అలవాటయింది. ప్రకృతి మనకు అందించిన ఈ అపారమైన సంపద గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాను. ఔషధ మొక్కలు, వాటి బెరళ్ళు, వేర్లు, పండ్లు, కాయలు, పువ్వుల ఉపయోగాల గురించి నేర్చుకున్నాను. వాళ్ళు సేకరించే మొక్కలు, వేర్లతో మందులు తయారు చేసేవారు. ఆరోగ్య సమస్యలతో వైద్యం కోసం మా ఇంటికి వచ్చేవారికి చికిత్స అందించేవారు. నేను, నా సోదరి ఆ మార్గంలోనే నడవాలనుకున్నాం’’ అని తన ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఆమె గుర్తు చేసుకున్నారు.


ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన తరువాత నేచురోపతీలో, యోగా సైన్స్‌లో ఆమె గ్రాడ్యుయేషన్‌తో పాటు రాష్ట్ర వైద్య మొక్కల బోర్డు, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) నిర్వహించే విలేజ్‌ బొటానిస్ట్‌ కోర్సు కూడా పూర్తి చేశారు. ఆ కోర్సు ద్వారా మొక్కల శాస్త్రీయ నామాల గురించీ, అడవికి హాని కలిగించకుండా వాటి పెంపకం గురించి ఆమె నేర్చుకున్నారు. ‘‘మా రాష్ట్రంలో నలభై నాలుగు శాతం భూభాగంలో అడవులే ఉన్నాయి. జీవవైవిధ్యానికి ఆ ప్రాంతం పెట్టింది పేరు. ఓషధీ గుణాలున్న మొక్కలు కూడా ఎక్కువే. అయితే, ఏ మొక్కలు ఏ వ్యాధి చికిత్సలో పనికొస్తాయనే పరిజ్ఞానం క్రమేణా అంతరించిపోతోంది. ఆ పరిజ్ఞానాన్ని కాపాడుకోగలిగితే చాలా తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. సాధారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలకు చుట్టూ ఉన్న చెట్లు, మొక్కల ద్వారా ఎలా చికిత్స చేసుకోవచ్చో మహిళలకు తెలియజేస్తే ప్రయోజనం ఉంటుందనిపించింది. దీనివల్ల వారి ఇంటికి వారే వైద్యులవుతారు. తీవ్రమైన వ్యాధులు వస్తే తప్ప దూరప్రాంతాలకు వెళ్ళనక్కరలేదు. అందుకే గ్రామాల్లో తిరిగి మహిళలకు ఓషధీ మొక్కలను గుర్తించడం, పెంచడం, సేకరించడం, మందుల తయారీ, చిన్న చిన్న వైద్యాలు చేయడం లాంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను’’ అంటారామె. 2010లో తమ గ్రామంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళల కోసం స్వయంసహాయక బృందాన్ని సరోజిని ఏర్పాటు చేశారు. వారికి ఔషధ మొక్కల గురించి వివరించారు. వాటితో మందులు తయారు చేయడం నేర్పారు. మూడేళ్ళ తరువాత సొంత హెర్బల్‌ ఔషధాన్ని ఆమె విడుదల చేశారు. ‘‘అడవికి సమీపంగా నివసించే వారికి ప్రకృతి గురించీ, చెట్లు, మొక్కల్లో ఉండే ఓషధీ విలువల గురించి లోతైన అవగాహన ఉంటుంది. వారిలో చాలా మందికి ఔషధ మొక్కల ప్రయోజనాలు, ఇంట్లో వాటిని ఉపయోగించే పద్ధతులూ తెలుసు. వారు ఆ విషయాలను మరింత లోతుగా తెలుసుకోడానికి నేను సాయం చేశాను. నేను నివసించే ప్రాంతం చుట్టుపక్కల దాదాపు 290 జాతుల ఔషధ, సుగంధ మొక్కలు పెరుగుతాయి. వాటిలో అరుదైన ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. అవి అంతరించిపోకుండా కాపాడి, వాటి ప్రయోజనాలను రాబోయే తరం వారికి తెలియజేయడం మన కర్తవ్యం. వాటి ద్వారా మేము జీవనోపాధి సైతం పొందవచ్చని నాకు అనిపించింది’’ అని చెబుతారు సరోజిని. ఆమె శిక్షణ ఇచ్చినవారిలో నాలుగువందల మందికి పైగా మహిళలకు ఇదే ఇప్పుడు ఉపాధిగా మారింది.  సరోజిని ఏర్పాటు చేసిన హెర్పల్‌ మెడికల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వహించే  మొక్కల పెంపకంలో, మందుల మార్కెటింగ్‌లో ఈ స్వయంసహాయక మహిళలు పాలుపంచుకుంటున్నారు.


‘‘మా యూనిట్‌ ద్వారా ఇచ్చే శిక్షణ చాలా నిర్దిష్టంగా ఉండేలా చూస్తున్నాం. దీనిలో ప్రధానంగా రెండు దశలు ఉంటాయి. అడవికి వెళ్ళడం, ఒక నిర్దిష్టమైన మొక్కను గుర్తించడం, మందుల తయారీ కోసం వాటి వేర్లు, బెరళ్లూ, పువ్వులు సేకరించడం మొదటి దశ. వాటిని ఎలా శుద్ధి చెయ్యాలి, వాటిలో అవసరమైన ఇతర పదార్థాలు కలిపి మందులు ఎలా తయారు చెయ్యాలి అనేది రెండో దశ’’ అని వివరించారు సరోజిని

‘‘ఎక్కువగా దగ్గు, జలుబు, డయేరియా, చర్మ సమస్యలు ఉన్నవారు నా దగ్గరకు వస్తూ ఉంటారు. కొన్ని తీవ్రమైన వ్యాధులకు కూడా ప్రాథమికంగా వైద్యం చేస్తూ ఉంటాను. సంప్రదాయ వైద్యం మీద ప్రజల్లో ఇప్పుడు అవగాహన పెరుగుతోంది. ‘కొవిడ్‌-19’ వచ్చిన తరువాత రోగ నిరోధకతను పెంచే హెర్బల్‌ మందుల వినియోగం, విక్రయాలు బాగా పెరిగాయి. ప్రకృతికి దగ్గరగా ఉంటే అందరం సంతోషంగా జీవించగలం. కాబట్టి ప్రతి ఇంట్లో తులసి, వేప, కలబంద, బ్రహ్మీ, అశ్వగంధ లాంటి మొక్కలు పెంచుకోవాలి. చాలా సమస్యలకు వాటి ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సత్వరమైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది’’ అని అంటారామె. 
ప్రత్యేకం మరిన్ని...