తనదైన ప్రతిభతో హిందీ సినిమా కొరియోగ్రఫీలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు మహిళా కొరియోగ్రాఫర్ దివంగత సరోజ్ ఖాన్. త్వరలోనే ఆమె జీవిత కథ వెండితెరపైకి రానుంది. గతేడాది జూలై 3న సరోజ్‌ఖాన్ మరణించారు. శనివారం ఆమె వర్ధంతి. ఈ సందర్భంగా టీ సిరీస్ అఽధినేత భూషణ్‌కుమార్ సరోజ్‌ఖాన్ బయోపిక్‌ను త్వరలో తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. సరోజ్ ఖాన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
సరోజ్‌ఖాన్ పిల్లలు రాజు ఖాన్, సుకైనా ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు తమ ఆమోదం తెలిపారు. సరోజ్ ఖాన్ సమకూర్చిన నృత్యరీతులు మాధురీ దీక్షిత్, శ్రీదేవి లాంటి పలువురు అగ్రతారలకు మంచి పేరు తెచ్చాయి. ‘జబ్ వియ్ మెట్’, ‘మణికర్ణిక’, ‘బాజీగర్’ లాంటి హిట్ చిత్రాలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. దివ్యభారతి నటించిన చివరి చిత్రం ‘తొలిముద్దు’కు సరోజ్‌ఖాన్ కొరియోగ్రఫీ అందించారు.