Jul 31 2021 @ 16:21PM

‘సర్కారు వారి పాట’: ఆగస్ట్ 9న బ్లాస్టర్, జనవరి 13న మూవీ

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2022, జనవరి 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ తెలియజేసింది. అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్ట్ 9న చిత్రానికి సంబంధించి ఓ బ్లాస్టర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ అధికారికంగా ఓ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మహేష్ బాబును పవర్ ఫుల్ లుక్‌లో చూపించారు. ఆయన కారు దిగుతోన్న విధానం, కారు అద్దాలు బద్దలైన తీరు చూస్తుంటే ఇదొక యాక్షన్ సన్నివేశం అని తెలుస్తోంది. మొత్తంగా చాలా రోజుల నుంచి మహేష్ బాబు లుక్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన అభిమానులకు ఈ పోస్టర్ రూపంలో చిత్రయూనిట్ ఫుల్ మీల్స్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని నవీన్‌ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్‌. మధి కెమెరామ్యాన్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఎఎస్‌ ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.