అభివృద్ధి పేరుతో సర్కార్‌ కాలక్షేపం

ABN , First Publish Date - 2020-05-25T10:01:47+05:30 IST

అభివృద్ధి పేరుతో సర్కార్‌ కాలక్షేపం చేస్తూ ప్రజలను టీఆర్‌ఎస్‌ పూర్తిగా తప్పుదొవ పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, చేవెళ్ల ..

అభివృద్ధి పేరుతో సర్కార్‌ కాలక్షేపం

కేంద్రంపై నిందలు మోపితే ఊరుకునేది లేదు

పాలమూరు ఎత్తిపోతలపై నోరు మెదపని సీఎం కేసీఆర్‌

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బెక్కరి జనార్దన్‌రెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): అభివృద్ధి పేరుతో సర్కార్‌ కాలక్షేపం చేస్తూ ప్రజలను టీఆర్‌ఎస్‌ పూర్తిగా తప్పుదొవ పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి బెక్కరి జనార్దన్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల ఎంపీగా రంజిత్‌ రెడ్డిని గెలిపిస్తే ఆరు నెలల్లో జీవో నెం.111ను ఎత్తివేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. చేవెళ్ల ఎంపీ జీవో ఎత్తివేతకు సర్పంచ్‌ల అభిప్రాయాలు సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకువెళ్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వికారాబాద్‌ను పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎంపీ చెబుతున్నా, ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని ఏద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా చేవెళ్ల పార్లమెంట్‌ ప్రజల కాళ్లు కడుతానన్న సీఎం అసలు ప్రాజెక్టు గురించే పట్టించుకోకపోవడం దారుణ మన్నారు.


పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీరు తరలించే ప్రయత్నం ఆంధ్ర ప్రభుత్వం చేస్తుంటే ఎవరూ నోరు మెదపడం లేదన్నారు. ప్రధాని మోదీ అఖండ భారత అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఏం చేసిందో చెప్పాలన్నారు. చేవెళ్ల ఎంపీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో ప్రజలకు చెబితే బాగుండేదన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేయాలని అందుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-25T10:01:47+05:30 IST