Abn logo
Mar 6 2021 @ 23:25PM

సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు : కలెక్టర్‌

 నెల్లూరు(హరనాథపురం), మార్చి 6: మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుకు సహకరించాలని చిత్తూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల కలెక్టర్‌లను జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు కోరారు. ఆయన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం వారితో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయని, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లా సరిహద్దులతో పాటు తిరవళ్లూరు జిల్లా సరిహద్దులోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ ఎన్నికల నియమావళి అమలయ్యేలా పరస్పరం సహకరించుకోవాలని కోరారు. మూడు జిల్లాల కలెక్టర్‌లు పరస్పరం సహకరించుకుని ఎన్నికల నియమావళి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో షఽణ్ముకకుమార్‌, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు


ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

నెల్లూరు(జడ్పీ), మార్చి 6 : జిల్లాలో జరుగుతున్న నాలుగు పంచాయతీలు, 54 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మూడురోజులపాటు సాగింది. చివరిరోజున సర్పంచు స్థానాలకు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 19లకు చేరుకుంది. అలాగే 54 వార్డులకు 46 నామినేషన్లు దాఖలవగా వీటి సంఖ్య మొత్తం 105కు చేరుకుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన  జరగనుంది. 

 

ఆర్టీసీ ఎండీ నేడు జిల్లాలో పర్యటన 

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), మార్చి 6: ఏపీఎస్‌ ఆర్టీసీ   ఎండీ ఆర్పీ ఠాగూర్‌ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం జిల్లాకు చేరుకున్న ఆయన  కృష్ణపట్నం పోర్టులో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం ఉదయం కాకుటూరులోని ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌, నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండు, ఒకటి, రెండు డిపోల గ్యారేజ్‌లు, ఆత్మకూరు బస్టాండు, పడుగుపాడులోని ఆర్టీసీ వర్క్‌షాప్‌లను ఆయన పరిశీలిస్తారు.


జేసీ ప్రభాకరరెడ్డి శాఖల్లో కోత 

నెల్లూరు (హరనాథపురం), మార్చి 6 : పలు శాఖలను పర్యవేక్షిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి (డెవల్‌పమెంట్‌) శాఖలకు కోత పెడుతూ శనివారం కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. జేసీ చూస్తున్న ఆర్టీసీ, రవాణా శాఖలను మరో జేసీ హరేందిర ప్రసాద్‌కు, భూగర్భ జల శాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ, పౌర సంబంధాలు, టూరిజం శాఖలను మరో జేసీ (ఆసరా) టీ.బాపిరెడ్డికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జేసీ (డెవల్‌పమెంట్‌)ఇంట్లో పనిచే సిన అంగన్‌వాడీ హెల్పర్‌ రెహనా విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే.  ఆయన దగ్గర పని చేసిన సిబ్బందిని బదిలీ చేసిన కలెక్టర్‌ తాజాగా ఆ జేసీ పర్యవేక్షిస్తున్న శాఖలకు కోత పెట్టారు.  


సివిల్‌ సప్లయీస్‌ డీఎంగా పద్మ

నెల్లూరు(హరనాథపురం), మార్చి 6 : జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎంగా పద్మ నియమితులయ్యారు. ఆమె కడప సివిల్‌ సప్లయీస్‌ డీఎంగా పనిచేస్తున్నారు. కడప నుంచి నెల్లూరుకు బదిలీపై వచ్చారు. ఇంతకుముందు సివిల్‌ సప్లయీస్‌ డీఎంగా పనిచేస్తున్న కేఎం రోజ్‌మాండ్‌ ఐసీడీఎస్‌ పీడీగా నియమితులయ్యారు.


కరోనా కేసులు నిల్‌

 3,550 మందికి కరోనా టీకా

నెల్లూరు (వైద్యం), మార్చి 6: జిల్లాలో శనివారం ఎలాంటి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. మృతులు లేవు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 64,064 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా బాధితులను ఎవ్వరినీ డిశ్చార్జ్‌ చేయలేదు. ఇదిలా ఉంటే 3,550 మందికి కరోనా టీకా వేశారు. 

Advertisement
Advertisement
Advertisement