తెలుగు మార్కెట్‌లో... మ్యూజిక్‌ లేబుల్‌ ‘సరేగమ’... దూకుడు... భారీగా పెట్టుబడులు...

ABN , First Publish Date - 2022-01-25T22:22:44+05:30 IST

సంగీత ప్రపంచంలో సుదీర్ఘ అనుభవమున్న ‘సరేగమ’... తెలుగు మార్కెట్‌లో దూకుడు పెంచింది.

తెలుగు మార్కెట్‌లో... మ్యూజిక్‌ లేబుల్‌ ‘సరేగమ’... దూకుడు... భారీగా పెట్టుబడులు...

హైదరాబాద్ : సంగీత ప్రపంచంలో సుదీర్ఘ అనుభవమున్న ‘సరేగమ’... తెలుగు మార్కెట్‌లో దూకుడు పెంచింది. అన్ని భాషల్లో పాతుకుపోవాలన్న లక్ష్యానికి తగ్గట్లుగా ఈ కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత రెండు దశాబ్దాలుగా విడుదలైన సూపర్ హిట్‌ తెలుగు చిత్రాల్లోని పాటలు సహా 280 తెలుగు సినిమాలకు చెందిన 1586 పాటలపై పూర్తి హక్కులను దక్కించుకుంది. మ్యాంగో మ్యూజిక్‌ నుంచి ఈ మ్యూజిక్‌ క్యాటలాగ్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందంలో భాగంగా, భారీ రిపోజిటరీ ఆడియో (సౌండ్ రికార్డింగ్, పబ్లిషింగ్ రైట్స్), వీడియో రైట్స్ రెండింటినీ సరేగమకు మ్యాంగో మ్యూజిక్ విక్రయించింది. ఈ క్రమంలో... తెలుగు మార్కెట్‌లో ‘సరేగమ’ స్థానం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. 


పాత పాటలతోపాటు కొత్త పాటల విషయంలోనూ సరేగమ దూకుడుగా ఉంది. ఇటీవలే విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ పాటల హక్కులు సరేగమ దగ్గరే ఉన్నాయి. ఇవి యూట్యూబ్‌ సహా వివిధ ఓటీటీ  స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్‌ కూడా దీనిదే. సరేగమ ఇండియా లిమిటెడ్‌ను గతంలో 'ది గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' అని పిలిచేవారు. సరేగమకు దేశంలోనే అతిపెద్ద సంగీత ఆర్కైవ్‌ ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని పెద్ద మ్యూజిక్‌ లైబ్రరీల్లో ఇది కూడా ఒకటన్న విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు రికార్డైన మొత్తం సంగీతంలో దాదాపు సగం హక్కులు ఈ కంపెనీవే. పాటలు మాత్రమే కాకుండా, పబ్లిషింగ్‌, సినిమాలు, డిజిటల్ కంటెంట్ నిర్మాణం తదితర విభాగాల్లో కూడా ఈ సంస్ధ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఒక ఫిల్మ్‌ స్టుడియో కూడా సరేగమ చేతిలో ఉంది. ఆర్‌పీఎస్‌జీ గ్రూపులో ఈ కంపెనీ ఒక భాగం. కాగా... ఆర్‌పీఎస్‌జీ గ్రూపు... దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న గ్రూపుల్లో ఒకటి. 

Updated Date - 2022-01-25T22:22:44+05:30 IST