సర్దు‘పోటు’

ABN , First Publish Date - 2022-08-05T05:22:35+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులపై మళ్లీ ట్రూ అప్‌ చార్జీల భారం పడనుంది. గతంలో ఇదే పేరుతో అదనంగా బిల్లు వసూలు చేసినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

సర్దు‘పోటు’


వినియోగదారులపై విద్యుత్‌ బిల్లుల భారం
ట్రూ అప్‌ చార్జీల పేరుతో వాయింపు
గతంలో విరమించుకుని మళ్లీ భారం మోపిన ప్రభుత్వం
కట్టాల్సిందేనంటున్న విద్యుత్‌ శాఖ అధికారులు
జిల్లాలో 7.84 లక్షల మంది వినియోగదారులపై భారం


విద్యుత్‌ వినియోగదారులపై మళ్లీ ట్రూ అప్‌ చార్జీల భారం పడనుంది. గతంలో ఇదే పేరుతో అదనంగా బిల్లు వసూలు చేసినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆ తర్వాత రోజుల్లో వాటిని ఎత్తేశారు. మళ్లీ ఇప్పుడు ట్రూ అప్‌ పేరుతో చార్జీల మోతకు ప్రభుత్వం సమాయత్తమైంది. నష్టాలు పూడ్చుకోవడానికి సర్దుబాటు పేరుతో పేదలపై భారం మోపుతోంది. దీనిని ఆయా వర్గాల ప్రజలు విమర్శిస్తున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి/ రింగురోడ్డు)
విద్యుత్‌ పంపిణీకి సంబంధించి గతంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యాయని,  ఆ లోటును పూడ్చుకునేందుకు సర్దుబాటు కోసం వినియోగదారుల నుంచి ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేయక తప్పదని విద్యుత్‌ శాఖ అధికారులు చెప్పుకొస్తూ అదనపు భారం మోపేందుకు సిద్ధమవుతున్నారు. యూనిట్‌ వద్ద 7 పైసలు చొప్పున భారం వేయాలనుకుంటున్నారు. అంటే వంద యూనిట్లు వాడిన వినియోగదారుడు నుంచి రూ.7 చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ఈనెల నుంచే చార్జీల భారాన్ని వినియోగదారులు మోయాల్సి ఉంటుంది. విద్యుత్‌ వాడకం ఆధారంగా బిల్లులు వస్తుండటం సహజం. కాని వినియోగం ఆధారంగా సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా భారాన్ని మోపడం అన్యాయమని వినియోగదారులు వాపోతు న్నారు. అయితే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణా మండలి నిర్ణయం ప్రకారం తాము నడుచుకోవాల్సిందేనని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ట్రూఅప్‌ చార్జీలను గతంలోనూ అమలు చేశారు. అప్పట్లో ప్రతి నెలా రూ.200లు చొప్పున బిల్లు వచ్చే సగటు వినియోగదారునికి ఒక్కసారిగా రూ.500 లేదా రూ.700 వరకు బిల్లులు వచ్చేవి. దీంతో ఒక్కసారిగా పేదలు భగ్గుమన్నారు. తర్వాత రోజుల్లో అదనపు చార్జీలను ఎత్తేశారు. ప్రజలు ట్రూఅప్‌ చార్జీల గురించి దాదాపు మర్చిపోయారు. ఈ దశలో మళ్లీ అదనపు వడ్డనకు ఆ శాఖ తెరతీసింది. ఈసారి 18నెలల పాటు వడ్డన కొనసాగించేందుకు నిర్ణయించింది.

 ఏప్రిల్‌ 2014 నుంచి మార్చి 2019 వరకు అంటే 60 నెలలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లుల ఆధారంగా ఈవడ్డన అమలు చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 1 తరువాత తీసుకున్న సర్వీసులకు ఈ ట్రూఅప్‌ చార్జీల వడ్డన ఉండదని ఆశాఖ సిబ్బంది చెబుతున్నారు.

 జిల్లా వ్యాప్తంగా 7.84 లక్షల విద్యుత్‌ సర్వీసులున్నాయి. ఈసారి యూనిట్‌ వద్ద 7 పైసలు పెంచుతున్నారు. జిల్లాలో సరాసరి 75లక్షల యూనిట్లు వినియోగిస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో 5 లక్షలు సర్వీసులున్నాయి. పట్టణాల్లో గరిష్టంగా 200 యూనిట్లు వినియోగిస్తుండడం కన్పిస్తోంది. అంటే ప్రతి వినియోగదారునిపై సుమారు రూ.14 భారం మోయాల్సి ఉంటుంది. అయితే విద్యుత్‌ శాఖ నష్టాల పేరుతో వినియోగదార్లపై భారాన్ని మోపడం సరికాదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. ట్రూ అప్‌ చార్జీల అంశాన్ని ఆ శాఖ డీఈ కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలూ లేవన్నారు. ట్రూ అప్‌ చార్జీల గురించి తెలియదని చెప్పారు.  

అన్నింటిపైనా వడ్డనే
ప్రభుత్వం నిత్యావసరాల ధరలను అదుపు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో సాధారణ కుటుంబాల జీవనం దుర్భరంగా మారింది. నిత్యావసరాలు, కూరగాయలు, పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, బస్సు చార్జీలు పెంచుతూ వస్తున్నారు. విద్యుత్‌ చార్జీలూ పెరిగితే ఎలా అని సగటు పేద కుటుంబం ప్రశ్నిస్తోంది.

రాయితీపై తేలని వైనం
వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులతో పాటు ఎస్సీ, ఎస్టీలకు రాయితీపై విద్యుత్‌ అందిస్తున్నారు.  వీరి విషయంలో ట్రూ అప్‌ చార్జీల విధింపుపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై విద్యుత్‌ నియంత్రణా మండలి నిర్ణయం ప్రకటించాల్సి ఉందని చెబుతున్నారు.

Updated Date - 2022-08-05T05:22:35+05:30 IST