బ్రిటీష్ వారి కుట్రలను భగ్నం చేసిన సర్దార్: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-10-31T17:08:25+05:30 IST

దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయనకు కేంద్ర హోం మంత్రి..

బ్రిటీష్ వారి కుట్రలను భగ్నం చేసిన సర్దార్: అమిత్‌షా

నర్మద: దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఘనంగా నివాళులర్పించారు. దేశాన్ని విడొగట్టాలనే బ్రిటిష్ వారి కుట్రలను పటేల్ విఫలం చేసి, అఖండ్ భారత్‌ నిర్మాణానికి కృషి చేశారని కొనియాడారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవడియాలో ఆదివారం జరిగిన 'జాతీయ ఐక్యతా దినోత్సవం' కార్యక్రమంలో అమిత్‌షా ప్రసంగిస్తూ, ఈరోజు జరుపుకొంటున్న జాతీయ ఐక్యతా దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. దేశాన్ని ముక్కచెక్కలు చేయాలనుకున్న బ్రిటిష్ వారి కుట్రలను భగ్నం చేసి అఖండ భారతం కోసం పటేల్ అనితర సాధ్యమైన కృషి చేశారని అన్నారు.


కెవడియా కేవలం ఒక ప్రాంతానికి పెట్టిన పేరు కాదని, జాతీయ ఐక్యత, దేశభక్తి మందిరమని అన్నారు. అంబరాన్నంటే పటేల్ విగ్రహం ఇండియా ఉజ్వల భవిష్యత్తును ప్రపంచానికి చాటిచెబుతోందని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను ఏ ఒక్కరూ నష్టపరచలేరని అన్నారు.దురదృష్టవశాత్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకాలను తెరమరుగు చేసే ప్రయత్నం జరిగిందని, స్వాతంత్ర్యానంతరం పటేల్ సేవలకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. భారత రత్న కానీ, తగిన గౌరవం కానీ ఇవ్వలేదని చెప్పారు. పరిస్థితులు మారాయని, ఆ తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చారని, ప్రపంచంలోనే అతిపెద్దదైన విగ్రహం ఈరోజు మన కళ్ల ముందే ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ముందు 182 అడుగుల ఎత్తైన పటేల్ విగ్రహానికి అమిత్‌షా నివాళులర్పించారు. 2018 అక్టోబర్‌లో ఆ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం 2014లో జాతీయ ఏకతాదినోత్సవంగా అక్టోబర్ 31వ తేదీని ప్రకటించింది.

Updated Date - 2021-10-31T17:08:25+05:30 IST