మా సీఎం అభ్యర్థి కమల్‌హాసనే : శరత్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-03-04T18:16:31+05:30 IST

మా సీఎం అభ్యర్థి కమల్‌హాసనే : శరత్‌కుమార్‌

మా సీఎం అభ్యర్థి కమల్‌హాసనే : శరత్‌కుమార్‌

చెన్నై : ‘మక్కల్‌ నీదిమయ్యం’తో ఎన్నికల పొత్తు ఖరారైందని ‘సమత్తువమక్కల్‌ కట్చి’ అధ్యక్షుడు శరత్‌కుమార్‌ ప్రకటించారు. తూత్తుకుడి సమీపం ద్రవియపురంలో బుధవారం సమత్తువ మక్కల్‌ కట్చి ఆరో సర్వసభ్యమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లా శాఖ కార్యదర్శులు, నగరశాఖల కార్యదర్శులు సహా సుమారు ఐదువేలమంది హాజరయ్యారు. ఈ సమావేశంలో శరత్‌కుమార్‌ ప్రసంగిస్తూ... కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యంతో సమత్తువమక్కల్‌ కట్చి, ఇండియ జననాయగ కట్చి పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఖరారైందని ప్రకటించారు. మక్కల్‌నీదిమయ్యం నేత కమల్‌హాసన్‌ ఆ విషయాన్ని మంగళవారం రాత్రి తనకు ఫోన్‌ చేసి తెలిపారని సభికుల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. 


అన్నాడీఎంకే కూటమిలో మిత్రపక్షంగా ఉంటూ ఇకపై ఒకటి రెండు నియోజకవర్గాలలో పోటీ చేసే ప్రసక్తి లేదని, పార్టీ చిహ్నంపైనే పోటీచేస్తామని పేర్కొన్నారు. అన్నాడీఎంకే పార్టీ అధిష్ఠానం సీట్లసర్దుబాట్లపై చర్చలకు ఆహ్వానిస్తుందని వేచిచూసి విసిగిపోయి కూటమి నుంచి వైదొలగామని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకు ఎంతవరకు వుందో తెలుసుకోవడానికే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డీఎంకే కూటమి నుంచి వైదొలగినప్పుడు కరుణానిధి ఆ నిర్ణయాన్ని మార్చుకోమంటూ కోరారని, ఆ తర్వాత బీజేపీలోకి రమ్మని ఆహ్వానం అందినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జయ తనను పిలిచి తిరుచెందూరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చారన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కొందరు జరిపిన కుట్ర వల్ల ఓడిపోయానని శరత్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుత అన్నాడీఎంకే నాయకులు ఒక సీటిస్తే రాష్ట్రమంతటా ప్రచార చేస్తాడనే భావంతో తనపట్ల, పార్టీ పట్ల ఏహ్యభావాన్ని ప్రదర్శించారని అన్నారు. పార్టీ శ్రేణులంతా ఒంటరిపోరుకు దిగాలని పట్టుబట్టారని, వారి కోరిక మేరకే కూటమి నుంచి బయటపడ్డానని చెప్పారు. 


పార్టీలో పోటీ చేయడానికి 147 దరఖాస్తులు కూడా వచ్చాయన్నారు. మంచివారితో కలిసి పోటీచేయడానికే తాను ఐజేకేతో ఎన్నికల పొత్తును కుదుర్చుకుని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ను కలిసి కూటమిని ఏర్పాటు చేయమని కోరానని, ఆ మేరకు మంగళవారం రాత్రి 11.55 గంటలకు తనకు ఫోన్‌ చేసి రెండు పార్టీలను తన కూటమిలో చేర్చుకున్నట్టు ప్రకటించారని చెప్పారు. ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రిని పదవిలో కూర్చోబెట్టిన ఘనత కామరాజర్‌ నాడార్‌కు దక్కిందని, ఆ కోవలోనే రెండో కామరాజర్‌గా కమల్‌హాసన్‌ను సీఎం పీఠంలో అధిష్టింపజేసేందుకు ప్రయత్నిస్తున్నానని శరత్‌కుమార్‌ అన్నారు. ఈ సమావేశంలో సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడి శరత్‌కుమార్‌ను సర్వసభ్య మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూటమి ఏర్పాటుకు సంబంధించి, సీట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌ కల్పిస్తూ సర్వసభ్యమండలి సభ్యులు తీర్మానం ప్రతిపాదించి ఆమోదించారు. పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా రాధికను, కోశాధికారిగా సుందరేశన్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సుందర్‌ అధ్యఓత వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి భాగీరథి స్వాగతోపన్యాసం చేశారు. 

Updated Date - 2021-03-04T18:16:31+05:30 IST