సరస్వతీ నమస్తుభ్యం

ABN , First Publish Date - 2022-10-03T05:17:22+05:30 IST

శంభుగిరి కొండలపై వెలసిన వర్గల్‌ విద్యాధరి సరస్వతీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

సరస్వతీ నమస్తుభ్యం
వర్గల్‌ విద్యాధరిలో పుస్తక రూపిణి సరస్వతీదేవిగా విద్యాసరస్వతీ అమ్మవారు

వర్గల్‌ విద్యాధరిలో వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు, మూల మహోత్సవ వేడుకలు

ఘనంగా లక్షపుష్పార్ఛన, పుస్తక పూజ, సామూహిక అక్షర స్వీకారాలు, చండీహోమం

వేడుకలకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు


 వర్గల్‌, అక్టోబరు 2: శంభుగిరి కొండలపై వెలసిన వర్గల్‌ విద్యాధరి సరస్వతీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో మూల మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాసరస్వతీ అమ్మవారు భక్తులకు స్వర్ణ కిరిటధారిణితో విద్యాసరస్వతీదేవిగా నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారిని సర్వంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై భక్తుల జయజయ ధ్వానాలు, మేళ తాళాల, మంగళవాయిద్యాల మధ్యన ఊరేగింపు నిర్వహిస్తూ  శంభుగిరి చుట్టూ గిరి ప్రదక్షణ చేశారు. వేడుకల సందర్భంగా సరస్వతీ అమ్మవారికి భక్తులు లక్ష పుష్పార్ఛన చేశారు. చిన్నారులకు సామూహిక అక్షర స్వీకారాలు నిర్వహించారు. సుమారు 1500 నుంచి 2వేల మంది చిన్నారులకు అక్షర స్వీకారాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం సరస్వతీ అమ్మవారికి మూల పుస్తక రూపిణి సరస్వతీ పూజ, పుస్తకపూజ, హారతి, మంత్ర పుష్ప తీర్థ ప్రసాదములతో పాటు తదితర పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయం వద్ద సంగీత, సాహిత్య కార్యాక్రమాలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్న ప్రసాదాలు అందజేశారు. మూలమహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం, పరిసరాలు భక్తులతో కిటకిటాలాడాయి. 


అమ్మవారిని దర్శించుకున్న పీఠాధిపతులు, ప్రముఖులు  

విద్యా సరస్వతీ అమ్మవారిని మూలమహోత్సవం సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులు  విద్యా శంకర భారతీ స్వామిజీ, రాంపురం పీఠాధిపతులు మాధవనంద సరస్వతీ స్వామిజీ, నాచారం శ్రీ క్షేత్రం పీఠాధిపతులు మధుసూదనానంద సరస్వతీ స్వామిజీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌  విజయేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. 


సరస్వతీ మాతగా విజయదుర్గాదేవి

కొండపాక/చేర్యాల అక్టోబరు 2 : కొండపాక మండలం మర్పడగ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం విజయ దుర్గామాత భక్తులకు సరస్వతీ మాతగా దర్శనమిచ్చింది. క్షేత్ర నిర్వాహకులు డాక్టర్‌ చెప్పెల హరినాథ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్‌, తిరుపతి రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీకాంత్‌, మల్లేశం, రాజు తదితరులున్నారు.


మల్లన్న ఆలయంలో..

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో దేవీత్రిరాత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. ఆలయ రుత్విక్కులు అమ్మవారికి పూజలు జరిపారు. అనంతరం చండీహవనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, ధర్మకర్తలు పచ్చిమడ్ల సిద్దిరాములు, సూటిపల్లి బుచ్చిరెడ్డి, జాటోతు స్వప్న, ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య  పాల్గొన్నారు.



Updated Date - 2022-10-03T05:17:22+05:30 IST