విద్యాసిద్ధిదాయిని

ABN , First Publish Date - 2021-02-12T08:10:34+05:30 IST

పూర్వం... ప్రతి రోజూ ఈ సరస్వతీ ప్రార్థన చేసిన తరువాతే పిల్లలు చదువు మొదలుపెట్టేవారు. ఈ శ్లోకంలో ‘కామరూపిణి’గా సరస్వతీ దేవి అభివర్ణితమయింది.

విద్యాసిద్ధిదాయిని

16న శ్రీపంచమి

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా


పూర్వం... ప్రతి రోజూ ఈ సరస్వతీ ప్రార్థన చేసిన తరువాతే పిల్లలు చదువు మొదలుపెట్టేవారు. ఈ శ్లోకంలో ‘కామరూపిణి’గా సరస్వతీ దేవి అభివర్ణితమయింది. అంటే ‘కోరిన రూపాలు ధరించగలిగే శక్తి కలిగిన దేవత’ అని అర్థం. గాయత్రిగా, మాతంగిగా, విద్యాధిదేవతగా, వీణాపాణిగా, గీర్వాణిగా... ఇలా అనేక రూపాల్లో ఆమె దర్శనమిస్తుంది. విద్యాధిదేవత అయిన సరస్వతీ దేవికి నమస్కరిస్తూ ‘మే’ అంటే నాకు, ‘సదా’-  ఎల్లప్పుడూ, విద్యారంభం నుంచి నేను కోరుకున్న విద్యలలో ఓ ‘కామరూపిణీ’ (బోధారూపంలో), ‘సిద్ధిర్భవతు’.. సాక్షాత్కరిస్తూ ఉండమనీ, విజయం చేకూర్చమనీ నీకు నమస్కరిస్తున్నానని తాత్పర్యం. ఎంత శక్తిమంతమైన ప్రార్థన ఇది!


సరస్వతిని ‘ముగ్గురమ్మల మూలపుటమ్మ’ అన్నాడు పోతనామాత్యుడు. ‘సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధింయానః ప్రచోదయాత్‌’ అంటూ ‘దేవీభాగవతం’లో వ్యాసుడు స్తుతించాడు. సరస్వతిని ఉపాసించే వాల్మీకి రామాయణాన్నీ, వ్యాసుడు మహాభారతాన్నీ, పద్ధెనిమిది పురాణాలనూ రచించారు. భాగవతాన్ని పోతన ఆంధ్రీకరించాడు. సరస్వతిని ఆరాధించిన కాళిదాసాది మహాకవులు అపూర్వమైన రచనలతో వాఙ్మయాన్ని పరిపుష్ఠం చేశారు. 


పరాశక్తిలోని చైతన్య శక్తే సరస్వతి. విద్యాధిదేవతగా ప్రకటితమైనప్పుడు ఆమె సరస్వతీ నామాన్ని పొందుతుంది. జ్ఞానం, విద్య, వాక్కు లాంటి బుద్ధికి సంబంధించిన శక్తులన్నిటికీ ఆమె అధిష్ఠాత్రి. పరాశక్తిని శారదా మాత రూపంలో దర్శించి... సృష్టి రచనకు బ్రహ్మ శ్రీకారం చుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. మేథ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్జ్ఞ... ఇవన్నీ ధీశక్తులు. వీటన్నిటి సమాహారమే సరస్వతి. లౌకిక విద్యలకూ, పౌరలౌకిక విద్యలకూ సరస్వతి అధిష్ఠాన దేవత. బుద్ధిమాద్యం, మతిమరపు లాంటి జాడ్యాలను ఆమె తొలగిస్తుంది. అందుకే ‘నిశ్శేష జాడ్యాపహా’ అని ఆమెను కీర్తిస్తారు.


‘అంబితమే, నదీతమే, దేవితమే అంటాయి శ్రుతులు. ‘నదులలో శ్రేష్టమైనదీ, దేవతలలో ఉన్నతురాలు, ముగ్గురమ్మలకు మూలమైనదీ సరస్వతి’ అని భావం. ‘ప్రాణశక్తీ సరస్వతీ’ అంటోంది వేదం. శరీరంలోని రక్తంలో అణువణువునా ప్రాణశక్తి ప్రవహిస్తోంది. ఆ శక్తే సరస్వతి. ధనప్రదాయినిగా, అన్నప్రదాయినిగా, జ్ఞానప్రదాయినిగా సరస్వతిని వేదాలు, ఉపనిషత్తులు కొనియాడాయి. యజ్ఞవల్క్యుడు సూర్యుడి సూచన మేరకు సరస్వతిని ఉపాసించి, స్మృతి శక్తిని పొంది, విద్వాంసుడయ్యాడు. ‘యా బ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిభిః దేవైః సదాపూజితా...’ సమస్త దేవతలూ ఆరాధించే శారదామాతను ఆది శంకరులు తన హృదయంలో ప్రతిష్ఠించుకొని, అపారమైన వాఙ్మయాన్ని సృష్టించారు. అద్వైత త్తత్వసారాన్ని ప్రబోధించారు. ‘‘విద్య వల్ల వినయం అనే సుగుణం కలుగుతుంది. దాని ద్వారా సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఉంటే ఐశ్వర్యం తనకు తానే వరిస్తుంది. వినయానికీ, ధర్మానికీ కట్టుబడితే ఇహ, పరలోకాలలో సుఖాలు ప్రాప్తిస్తాయి’’ అంటాడు భర్తృహరి. 


ఆ సరస్వతిని విద్యాప్రదాత్రిగా పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మన దేశంలో... కశ్మీరులో శారదామాత ఆలయం, కర్ణాటకలోని శృంగేరి పీఠంలోని శారదాంబ ఆలయం, తెలుగునాట భాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి ఆలయం, కొలనుపాకలో కొలను భారతి ఆలయం ప్రసిద్ధి చెందాయి. ఇవే కాకుండా, అనేక ప్రాంతాల్లో విడిగానూ, ప్రధాన ఆలయాల్లో ఉపాలయాలుగానూ సరస్వతీ మందిరాలు ఉన్నాయి. 


మాఘ శుద్ధ పంచమి రోజున 

సరస్వతీ దేవి అవతరించింది. ఈ రోజును ‘శ్రీ పంచమి’, ‘వసంత పంచమి’, ‘మదన పంచమి’... ఇలా పలు పేర్లతో పిలుస్తారు. మాఘమాసమే అయినా... వసంత శోభ మొదలవుతుంది. అందుకే ‘వసంత పంచమి’గా ఇది ప్రాచుర్యం పొందింది. శ్రీపంచమి రోజున సరస్వతీ మందిరాలన్నీ పిల్లల అక్షరాభ్యాసాలతో కన్నులపండువగా ఉంటాయి.

 ఎ. సీతారామారావు, 8978799864

Updated Date - 2021-02-12T08:10:34+05:30 IST