సరస్వతీ అనుగ్రహం.. ప్రవాహం

ABN , First Publish Date - 2020-03-01T09:19:29+05:30 IST

శంకరభగవత్పాదులకు సరస్వతీదేవి కటాక్షం పట్ల విశేషమైన ప్రీతి. వారు జ్ఞానమార్గావలంబకులవడం చేత ఎప్పుడూ ‘సరస్వతి’ అన్న పేరును విశేషంగా ఇష్టపడతారు. సన్యాస వ్యవస్థనంతటినీ

సరస్వతీ అనుగ్రహం.. ప్రవాహం

శంకరభగవత్పాదులకు సరస్వతీదేవి కటాక్షం పట్ల విశేషమైన ప్రీతి. వారు జ్ఞానమార్గావలంబకులవడం చేత ఎప్పుడూ ‘సరస్వతి’ అన్న పేరును విశేషంగా ఇష్టపడతారు. సన్యాస వ్యవస్థనంతటినీ వ్యవస్థీకృతం చేసి దశనాడీ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆయన.. ఎంతో మంది సన్యాసులకు ఇచ్చిన పేరు సరస్వతీ సంబంధమే. సరస్వతి, ఇంద్రసరస్వతి, భారతి, శారద ఇలా ఇచ్చారు. వారు శృంగగిరిలో పెట్టిన పేరు కూడా శారదా పీఠం. శారద అంటే కేవలం చదువులను, పుస్తకజ్ఞానాన్నిఇచ్చే తల్లి అని అనుకోకూడదు. శారద.. సారద. లోకంలో సారమైన విషయం బ్రహ్మజ్ఞానం. ఆ సారాన్ని  ఇచ్చే (ద) తల్లి ఎవరో ఆవిడే శారద. శంకరులు జ్ఞానైకనిష్ఠులు కనక వారికి శారదా స్వరూపం అంటే అంత ప్రీతి. శారద ఎక్కడ కూర్చున్నా పుస్తకాలను కుడి చేత్తో పట్టుకోదు. పుస్తకాలను ఎడమ చేత్తో, జపమాలను కుడి చేత్తో పట్టుకుంటుంది. ఎడమ చేత్తో పట్టుకుంటే అది తక్కువ అని గుర్తు. ఎవరైనా ఉపన్యాసానికి వస్తే, వారికి ఎడమ చేతి వైపు వచ్చేటట్లుగా భగవంతుని మూర్తి పెట్టకూడదు. అలా పెడితే ఆయన కన్నా భగవంతుడు తక్కువ అని సూచించినట్లవుతుంది.


ఆయనకి కుడివైపు ఉండేటట్లుగా పెట్టాలి. కుడివైపు ఉన్నవి పూజనీయాలు. ఎడమ వైపు ఉన్నవి అంతకన్నా తక్కువ అని గుర్తు. ఎడమ చేత్తో శారద పుస్తకాలు పట్టుకుందంటే పుస్తకాలు పట్టుకుంటే వచ్చే జ్ఞానం తక్కువ అని అర్థం. అసలు దేనిచేత ఆత్మసిద్ధి కలుగుతుంది? ఎవరు ధ్యానం చేస్తారో తమకు తెలిసి ఉన్న విషయాన్ని బహుధా పరిశీలనం చేసి భగవత్‌ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారో, అటువంటి ధ్యానైకనిష్ఠులైన వారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది తప్ప, అదేపనిగా పుస్తకాలను చదువుకుంటూ కూర్చుంటే... ధనేషణ, దారేషణ, పుత్రేషణలాగే గ్రంథాలపై కూడా అనురక్తి పెరిగిపోతుంది.


పుస్తకాలను చదువుకోవడం మంచిదే! కాదనడం లేదు  కానీ.. అనుష్ఠానం, ధ్యానం, జపం చేసేదెప్పుడు? దానికి సమయం లేకుండా పోతుంది. ఉద్ధరించేది అదే. అందుకే శారదా మాత కుడి చేతి వైపు జపమాల పట్టుకుని, ఎడమ చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది. సరస్వతీ అనుగ్రహం ఒకరినుండి ఒకరికి ప్రవహిస్తుంది. ఆవిడ ప్రవాహం కాకపోతే ప్రమాదం తీసుకుని వస్తుంది. మనలోని చదువు మనలోనే ఉండి ఎదుటి వారి లోపలికి వెళ్లకపోతే ఆ సరస్వతిలో లోభ బుద్ధి ఉందన్నమాట. ‘తాంబూలం ఉంటేనే చెపుతాను, లేకపోతే చెప్పన’ంటే లోభబుద్ధి. దూడ వచ్చి పొదుగులో నాలుగు గుద్దులు గుద్ది శిరాలను నోటపట్టి చప్పరించినంత మాత్రం చేత.. తాను పచ్చిగడ్డి తిని నిలవచేసి నెమరు వేసి తయారు చేసిన పాలని ఆవు విడిచిపెట్టేస్తుంది. అదే కోవలో.. గురువైనవాడు కానీ, బాగా చదువుకొన్న వాడు కానీ, విద్యయందు మోహబుద్ధి లేనివాడు కానీ..


తమవద్దకు ఎవరైనా వచ్చి ‘అయ్యా! నాలుగు మంచి మాటలు చెప్పండ’ని, పాదాలు పట్టుకోగానే తాము చదువుకున్న శాస్త్రంలో ఉన్న విషయమంతటినీ కూడా ఆవు పాలను విడిచిపెట్టినట్లు తన నోటివెంట విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. అలా విడిచిపెట్టే త్యాగమూర్తి ఎవరో.. వాడు ‘అమృతత్వ మానసుః’ అందుకే ‘త్యాగేనైకే అమృతత్వ మానసుః’ అంటుంది శాస్త్రం. అంటే.. ఎవరైనా సరే త్యాగం చేత అమృతత్వం పొందుతారు. స్వార్థం చేత అమృతత్వం ఉండదు. దాచుకోవడం చేత అమృతత్వం ఉండదు.



చాగంటి కోటేశ్వరరావు శర్మ

Updated Date - 2020-03-01T09:19:29+05:30 IST