సర్పంచ్‌లకు సంకటం

ABN , First Publish Date - 2021-07-29T06:21:53+05:30 IST

గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండేళ్ల నుంచి చేసిన పనులకు సంబంధించి వివిధ పెండింగ్‌ బిల్లులను ఎలాంటి వివరాలు లేకుండానే చెల్లించాలని సర్పంచ్‌లపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది.

సర్పంచ్‌లకు సంకటం

నోటీసుల జారీతో ఆందోళన 

చెక్‌పవర్‌ వచ్చీ రాగానే 

ఇదేం పెత్తనం అంటూ ఆవేదన

వివరాలు లేకుండా 

ఎలా చెల్లించాలని మీమాంస 

గ్రామ సర్పంచ్‌లకు సరికొత్త సంకంటం వచ్చిపడింది. గతంలో చేసిన పనులకు తాజాగా చెల్లింపులు చేయాలంటూ వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు నెలకొన్నాయి. గత ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగ్గా గెలిచిన సర్పంచ్‌లకు వెంటనే చెక్‌పవర్‌ ఇవ్వలేదు. అనేక ఆందోళనలు, నిరసనల తర్వాత ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత విడతల వారీగా చెక్‌పవర్‌ అందింది. అలా ఇచ్చారో లేదో ఇలా వరుసగా వారిపై భారం మోపుతున్నారు. పాత బకాయిలు, అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలంటూ ఇప్పటికే అనధికార ఆర్డర్లు జారీ అయ్యాయి. గత రెండేళ్లుగా స్పెషలాఫీసర్ల పాలనలో చేపట్టిన పలు రకాల పనులకు ఇప్పుడు చెల్లింపులు చేయాలంటూ ఒత్తిళ్లు పెరిగాయి. మండల స్థాయి అధికారుల నుంచి బెదిరింపు ఆదేశాలు కొందరికి ఎదురయ్యాయి. ఎటువంటి వివరాలు, ప్రతిపాదనలు లేకుండా చేసిన పనులకు ఇప్పుడు బిల్లులు ఎలా చెల్లించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులే న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. 

ఒంగోలు(కలెక్టరేట్‌),. జూలై 28 : గ్రామ పంచాయతీ పరిధిలో గత  రెండేళ్ల నుంచి చేసిన పనులకు సంబంధించి వివిధ పెండింగ్‌ బిల్లులను ఎలాంటి వివరాలు లేకుండానే చెల్లించాలని సర్పంచ్‌లపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. ఏబిల్లు దేనికి ఇవ్వాలో అర్థంకాని పరిస్థితుల్లో సర్పంచ్‌లు కొట్టుమిట్టాడుతున్నారు. చెక్‌పవర్‌ వచ్చీ రాగానే ఇదేం పెత్తనం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయతీలు అధికారుల పాలనలో ఉన్నాయి. సర్పంచ్‌ ఎన్నికల ముగిసిన అనంతరం వారికి చెక్‌పవర్‌ ఇవ్వకుండా సరిగ్గా నెలరోజుల క్రితం ఇచ్చారు.  అదే సమయంలో గ్రామ సచివాలయాల పరిధిలో సచివాలయం,  ఆర్బీకే, హెల్త్‌క్లినిక్‌, పాలకేంద్రాలు తదితర భవనాలను నిర్మిస్తున్నారు. అయితే ఆ భవన నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులను ఇప్పటి వరకూ పంచాయితీ స్పెషలాఫీసర్లు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇచ్చారు. అయితే ఆ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న భవనాలకు సంబంధించిన సమాచారాన్ని, రికార్డులను ఇంత వరకూ సర్పంచ్‌లకు అప్పగించ లేదు. గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శుల నేతృత్వంలో జరిగిన పనులకు ఇప్పుడు తమపై ఎలా ఒత్తిడి చేస్తారని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. 


సర్పంచ్‌లకు నోటీసులు

గ్రామపంచాయతీలో ఫలానా వ్యక్తి ఒక భవన నిర్మాణం చేశారని, అందుకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని మండల పరిషత్‌ కార్యాలయం నుంచి సర్పంచ్‌లకు నోటీసులు ఇస్తున్నారు. దీంతో వారు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. ఏ పనులకు ఎంత బిల్లులు చెల్లించాలో కూడా తమ వద్ద ఆధారాలు కూడా లేవని, ఆ సమాచారం కూడా తమకు ఇవ్వనప్పుడు ఏవిధంగా బిల్లులు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 


పనుల వివరాలు ఉన్నాయా? లేవా? 

గత రెండేళ్ల ప్రత్యేక పాలనలో చేపట్టిన పనులకు వివరాలు ఉన్నాయా?లేవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒక భవన నిర్మాణం చేస్తున్నారంటే అందుకు సంబంధించి ప్రతిపాదనలు, మంజూరు ఉత్తర్వులు, ఆ నిర్మాణ వ్యయమెంతా, ఇప్పటివరకు ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలి తదితర వివరాలు లేకుండానే తమను బెదిరించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లలో ప్రత్యేక పాలనలో చేపట్టిన అనేక పనులకు ఎలాంటి వివరాలు తమ వద్ద లేనందున తాము బిల్లులు చెల్లించలేమని చెప్పడంతో వారిపై పైస్థాయిలో బెదిరింపులు కూడా వస్తున్నాయి. 


డీపీవోను కలిసి సమస్యను విన్నవించిన సర్పంచ్‌లు

కాగా తమకు నోటీసులు ఇవ్వడంపై పలు గ్రామాల సర్పంచ్‌లు మంగళవారం డీపీఓ జీవీనారాయణరెడ్డిని కలిసి సమస్యను వివరించారు. ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో చెక్‌పవర్‌ను రద్దుచేస్తామని నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. బిల్లుల చెల్లింపు విషయంలో కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే విధానాలను ఉపసంహరించుకొవాలని కోరినట్లు సమాచారం.





Updated Date - 2021-07-29T06:21:53+05:30 IST