సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి

ABN , First Publish Date - 2021-04-10T05:42:21+05:30 IST

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు.

సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి

మోపాల్‌, ఏప్రిల్‌ 9: నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇందు లో భాగంగా శుక్రవారం మోపాల్‌ మండలం పలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై మాట్లాడారు. సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ చాలా సంవత్సరాల నుంచి మూతబడి ఉందని, ఈ ఫ్యాక్టరీ కింద ఉన్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు పండించే రైతులు ఇతర రాష్ట్రాలకు తరలించడం చాలా ఇబ్బందికరమవుతుందన్నారు. సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో అనేక మంది రైతులు ఉన్నారని వారు వివరించారు. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కార్మికులు కూడా ఎన్నో కుటుంబాలున్నాయన్నారు. ఫ్యాక్టరీని తెరిపించుకునే బాధ్యత రైతులపై ఉందన్నారు. ఈ నెల 12న నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతులను వారు కోరారు. 

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 9: సారంగపూర్‌ చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించి రైతంగాన్ని ఆదుకోవాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రతినిధి ఆకుల పాపయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఘన్‌పూర్‌, డిచ్‌పల్లి గ్రామాల్లో రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆకుల పాపయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సారంగపూర్‌ చక్కెర కర్మాగారాన్ని మూసిఉంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫ్యాక్టరీని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఫ్యాక్టరీలో పనిచేసే రైతులకే 1200ల మంది షేర్‌హోల్డర్స్‌ ఉన్న కారణంగా రైతులకే ఫ్యాక్టరీని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 12న జరిగే కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని, బహిరంగ సభకు ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో పీడీఎస్‌యూ ప్రతినిధులు సాయినాథ్‌, రాజేశ్వర్‌, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-10T05:42:21+05:30 IST