Abn logo
May 21 2020 @ 04:43AM

నామస్మరణతో ముక్తి ప్రాప్తి

Kaakateeya

భక్తిమార్గం ఒక్కో యుగంలో ఒక్కోరకంగా ఉంది. కృతయుగంలో ధ్యానాన్ని ముక్తికి మార్గంగా ఎంచుకోగా.. త్రేతాయుగంలో యజ్ఞయాగాలకు అగ్రపీఠం వేశారు. ద్వాపరంలో అర్చనలతో పరమాత్ముడిని ప్రసన్నం చేసుకున్నారు. కేవలం ఒకటే పాదంపై ధర్మం నడిచే కలియుగం పైవాటికి భిన్నం. ఈ యుగంలో ప్రజలు అల్పాయుష్కులు. మానసిక బలహీనులు. ధనకాంక్షాపరులు. సూక్షంలోనే మోక్షం కావాలనుకునేవారు. కాబట్టి.. భగవన్నామ స్మరణ ఒక్కటే వారికి మోక్షదాయకమని వేదపురాణాలు చెబుతున్నాయి. అదే విషయాన్ని కబీర్‌దాసు తన దోహాలో చెప్పారు.


సుమిరన్‌ మార్గ్‌ సహజ్‌ కా సత్‌గురూ దియా బతాయీ 

సాఁస్‌ సాఁస్‌ సుమిరణ్‌ కరోఁ ఇక్‌ దిన్‌ మిల్‌ సీ ఆయీ


‘‘భగవంతుణ్ని చేరడానికి నామస్మరణే సులభమైన భక్తి మార్గమని నా సద్గురువు సూచించారు. ఆ మేరకు నా శ్వాస, ధ్యాసలను ఆ పరమాత్ముని నామ జపం మీదే ఉంచి ఆయన్ని చేరడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని దీని అర్థం. రామకృష్ణ పరమహంస కూడా నామస్మరణ గురించి చెబుతూ.. ‘‘బెల్లం తియ్యగా ఉంటుందని, తేనే మధురంగా ఉంటుందని తెలియాలంటే.. బెల్లం ముక్క నోట్లో వేసుకుని కొరికితే, తేనె చుక్క నాలుక మీద వేసుకుని చప్పరించాలి’’ అంటాడు. అంటే, నామ స్మరణను అనుభవించిన వారికే ఆ మాధుర్యం తెలుస్తుందనేది దీని అర్థం.


ఒక రోజు సత్యభామ కృష్ణునితో ‘‘స్వామీ.. మీ సోదరి ద్రౌపది పిలవగానే పరుగులు తీస్తుంటారు. కారణం ఏమిటి?’’ అని ప్రశ్నిస్తుంది. కృష్ణుడు దీనికి సమాధానమిస్తూ.. ‘‘ద్రౌపదే నీ సందేహాన్ని తీర్చగలదు. వెళ్దాం పద..’’ అంటూ బయలుదేరుతారు. అప్పుడే స్నానం చేసి తలదువ్వుకుంటుంది ద్రౌపది. అది చూసిన కృష్ణుడు.. ‘‘నా చెల్లెలికి సాయపడవచ్చుకదా!’’ అనగానే ఇష్టం లేకపోయినా ద్రౌపది చేతిలోని దువ్వెన తీసుకుని సత్యభామ దువ్వుతుంది. ఆ సమయంలో.. ఆమె ప్రతి అవయవంలోని అణువణువు ‘‘కృష్ణా.. కృష్ణా.. కృష్ణా’’ అంటూ చిన్నగా శబ్దం చేసిన అనుభూతి కలుగుతుంది సత్యభామకు. తన సందేహానికి సమాధానం దొరికినట్టు కృష్ణుని వైపు గౌరవంగా చూస్తుంది సత్యభామ. భగవద్గీతలో కూడా కృష్ణుడు ‘‘ప్రాణాలు పోయేటప్పుడు ఎవడైతే నా నామాన్ని జపిస్తుంటాడో వాడి దగ్గరికి యమదూతలు రావడానికి భయపడతారు’’ అని అంటాడు.


భాగవతంలో అజామిళుని వృత్తాంతమే ఇందుకు నిదర్శనం. వ్యసనపరుడైనా.. చనిపోయే ముందు తన కొడుకు పేరు(నారాయణ)ను పదేపదే ఉచ్ఛరించడం వల్ల నేరుగా వైకుంఠానికి చేరుకున్నాడు. భారతీయ మనోవైజ్ఞానిక పితామహుడిగా గుర్తింపు పొందిన నరేంద్రనాథ్‌సేన్‌ గుప్త ఓ ధార్మిక సభలో ‘‘ఆధ్యాత్మికంలో మనోవిజ్ఞానం ఉంది. నామస్మరణలు, భజనలు, ఆరాధనలు కేవలం భక్తిని మాత్రమే కలిగించవు..! ఏకాగ్రత, ఆత్మ విశ్వాసంతోపాటు సంతోషం, కృతజ్ఞతాభావం, ఆశావహదృక్పథం, ప్రేమ వంటి సానుకూల ఉద్వేగాలను పెంచుతాయి’’ అని చెప్పారు. రెప్పపాటి ఈ జీవితంలో భగవన్నామ స్మరణ ఒక్కటే ముక్తికి దగ్గరి దారి అని మహర్షులెందరో ఉద్ఘాటించారు.


పరికిపండ్ల సారంగ పాణి, 9849630290

Advertisement
Advertisement