తరలివచ్చిన ఆడ‘బిడ్డ’

ABN , First Publish Date - 2022-02-17T07:28:17+05:30 IST

మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఉద్విగ్నభరితంగా సాగింది. వనదేవత సారలమ్మ బుధవారం రాత్రి 10.52 గంటలకు గద్దెపైకి చేరడంతో జాతర సంరంభం అంగరంగ వైభవంగా మొదలైంది. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరడంతో కోలాహలం నెలకొంది. బిడ్డరాక వేళ భక్తిభావంతో భక్త జనం ఊగిపోయారు. సాయంత్రం నుంచే సారలమ్మ రాక కోసం భక్తులు ఎదురుచూడడం మొదలు పెట్టారు. ప్రధాన వడ్డె కాక సారయ్య, ఇతర వడ్డెలు సాయంత్రం 4గంటలకు కన్నెపల్లిలోని తల్లి ఆలయానికి చేరుకున్నారు.

తరలివచ్చిన ఆడ‘బిడ్డ’
మేడారంలో సారలమ్మ రాక దృశ్యం, కన్నెపల్లిలో సారలమ్మకు స్వాగతం పలుకుతున్న మహిళలు

అశేష భక్తజనం సాక్షిగా గద్దెపై కొలువుదీరిన సారలమ్మ
కన్నెపల్లి నుంచి ఉద్విగ్నభరితంగా సాగిన యాత్ర
ఉప్పొంగిన భక్తి పారవశ్యం..
బిడ్డ నామస్మరణతో మార్మోగిన జాతర
వైభవంగా మొదలైన మహాజాతర
జనసంద్రంలా మారిన జంపన్నవాగు
గుబాళిస్తున్న ఆదివాసీ సంప్రదాయాలు
జోరందుకున్న మొక్కులు...
వెల్లువలా తరలివస్తున్న భక్తులు


మేడారాం,  ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి బృందం): మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఉద్విగ్నభరితంగా సాగింది. వనదేవత సారలమ్మ బుధవారం రాత్రి 10.52 గంటలకు గద్దెపైకి చేరడంతో జాతర సంరంభం అంగరంగ వైభవంగా మొదలైంది. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరడంతో కోలాహలం నెలకొంది. బిడ్డరాక వేళ భక్తిభావంతో భక్త జనం ఊగిపోయారు.  సాయంత్రం నుంచే సారలమ్మ రాక కోసం భక్తులు ఎదురుచూడడం మొదలు పెట్టారు.   ప్రధాన వడ్డె కాక సారయ్య, ఇతర వడ్డెలు సాయంత్రం 4గంటలకు కన్నెపల్లిలోని తల్లి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయంలో పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం 7 గంటల 8 నిమిషాలకు సారలమ్మను ఆలయం నుంచి బయటకు తోడ్కోని వచ్చారు. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు మీదుగా తీసుకొని మేడారంలోని గద్దెమీదికి రాత్రి 10.52 గంటలకు చేర్చారు. సారలమ్మను గద్దెమీద  ప్రతిష్టించే ముందు పూజా తంతును ఇతరులు చూడకుండా ఉండేందుకు లైట్లను బంద్‌ చేశారు. పున్నమి వెలుగుల్లో తల్లిని గద్దెపై కొలువు దీర్చారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా రాత్రి 10.55 గంటలకు గద్దెలపైకి వేంచేశారు. వీరి ఆగమనం కన్నుల పండువగా ప్రశాంతంగా జరిగింది.  

ఉదయం నుంచే..
బుధవారం ఉదయం నుంచే కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం వద్ద  సందడి నెలకొంది. పూజారుల కుటుంబసభ్యులు ఉదయాన్నే గుడివద్దకు చేరుకున్నారు. అలుకుపూతలతో శుద్ధిచేసి ముగ్గులువేశారు. పూజాసామగ్రిని శుభ్రంచేసి పసుపు పూశారు. మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరించారు. ప్రధాన వడ్డె సారయ్య ఆధ్వర్యంలో శుద్ధి కార్యక్రమాన్ని   పూర్తిచేసుకున్న పూజారులు సాయంత్రం పూజకు సిద్ధమయ్యారు. జిల్లా అధికారులు సారలమ్మ ఆగమనం సమయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతపై ఉదయంనుంచే కసరత్తు చేశారు.


కన్నెపల్లి పూజామందిరంలో కొలువైన తల్లిని మేడారం గద్దెపైకి ప్రతిష్ఠించే క్రమంలో ఊరు ఊరంతా ఊగిపోయింది. ఆదివాసీ కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డోలువాయిద్యాలతో కన్నెపల్లి మార్మోగింది. సాయంత్రం సారలమ్మ పూజామందిరం వద్ద సందడి మొదలైంది. ప్రధానవడ్డె కాక సారయ్యతోపాటు సహాయక వడ్డెలు ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ధూపం వేస్తూ.. జలకం చల్లుతూ దేవతను కొలుచుకున్నారు. సారలమ్మ దర్శనం కోసం గుడి బయట వేలాదిమంది ఆతృతగా ఎదురు చూశారు. వారిని నిలువరించడం అధికారుల వశంకాలేదు. సార

లమ్మకు స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం సిద్ధమై ఉన్నది. పోలీసులు, రోప్‌పార్టీలు పెద్దఎత్తున మోహరించారు.
సారలమ్మ ఆవహించిన వెంటనే తొలుత గుడినుంచి హనుమాన్‌ జెండాతో రక్షకుడు సోలెం వెంకటేశ్వర్లు బయటకు రాగా, ఆ వెంటనే కాక సారయ్య తల్లి రూపాన్ని వెదురుబుట్టలో తీసుకొని గుడి నుంచి బయటకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా భక్తులంతా అదిగదిగో సారక్కా.. తల్లీ కరుణించు.. అంటూ నినాదాలు చేశారు. అప్పటికే తడిబట్టలతో గుడి బయట సాగిలపడ్డ భక్తులను దాటుకుంటూ సారలమ్మను తీసుకొని పూజారులు ముందుకు కదిలారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు కాక కిరణ్‌, కాక వంశస్థులు సారలమ్మను తోడ్కోని బయలుదేరారు.


ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఆదివాసీ  మహిళలు సారలమ్మకు స్వాగతం పలికారు. ఎదుర్కోళ్లు జరిపారు. జిల్లా కలెక్టర్‌ క్రిష్ణ ఆదిత్య, అడిషనల్‌ డీసీపీ సాయి చైతన్య, మేడారం జాతర కమిటీ చైర్మన్‌ కొర్నిపల్లి శివయ్య, ఎంపీపీ గొంది వాణిశ్రీ తదితరులు స్వాగతం పలికారు. ఆదివాసీ ఉద్యోగ, యువజన సంఘాల నాయకులు ఈ సందర్భంగా హాజరయ్యారు. సారలమ్మను తీసుకొని మేడారం వెళ్లేక్రమంలో పూజారులు గ్రామంలోని వీధులను చుట్టివచ్చారు. ఈ క్రమంలో కన్నెపల్లివాసులు సారలమ్మకు మంగళహారతులిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. అలికిపూసిన పీటవేసి కాళ్లుకడిగి నీళ్లారబోశారు. పోయిరా సారక్క.. పోయిరావమ్మా.. అంటూ సాగనంపారు. భారీ పోలీసు రోప్‌పార్టీ పూజారులకు రక్షణగా నిలిచింది.

దారిపొడవునా దండాలు
కన్నెపల్లి నుంచి మేడారం వరకు మూడుకిలోమీటర్ల పొడవునా సారలమ్మకు ఘనస్వాగతం పలుకుతూ భక్తులు దండాలు పెట్టారు. వడివడిగా కదులుతున్న పూజారులకు రక్షణగా పోలీసులు, తోడుగా భక్తులు అనుసరించారు. అప్పటికే రోడ్లపైకి చేరిన భక్తులను పక్కకు తొలగిస్తూ పోలీసులు రక్షణవలయాన్ని ఏర్పాటుచేశారు.

జంపన్నవాగుకు వద్దకు రాత్రి 8.23 గంటలకు చేరగానే పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. మోకాలులోతు నీటిలో వాగును దాటుతుండగా పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు జయజయధ్వానాలు చేశారు. అక్క సారలమ్మ కాళ్లు కడిగిన జంపన్నపులకించిపోయాడు. ఈ సమయంలో జంపన్నవాగు జనసంద్రమైంది.

సమ్మక్క ఆలయంలో పూజలు
సారలమ్మను తీసుకొని వడ్డెలు మేడారంలోని సమ్మక్క ఆలయానికి రాత్రి 9.15 గంటలకు చేరుకున్నారు. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజులతో అక్కడకు వచ్చిన పూజారులు కలుసుకొని సాక ఇచ్చిపుచ్చుకున్నారు. కంకణాలు కట్టుకొని అలయ్‌ బలయ్‌ తీసుకున్నారు. సమ్మక్క గుడిలో సారలమ్మను తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులు ప్రదక్షణలు చేసిన అనంతరం దేవతలను గద్దెలపై నిలిపారు. దీంతో మహా జాతర ప్రారంభమైంది.

కిక్కిరిసిన క్యూలైన్లు
భక్తులతో క్యూలైన్‌లు, గద్దెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ రాకకు ముందే దర్శనానికి జనం బారులుతీరారు. గద్దెలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఎత్తుబంగారం, కానుకలను సమర్పించారు.  సారలమ్మ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.  బందోబస్తు ఇన్‌చార్జి కటకం మురళీధర్‌ సారలమ్మ ఆగమనాన్ని పర్యవేక్షించారు.

నేడు సమ్మక్క రాక
మేడారం : కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి రానుంది. ప్రభుత్వ లాంఛనాలతో సమ్మక్కను మేడారం గద్దెపైకి తీసుకవచ్చేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గిరిజన పూజారులు, అధికారులు సంసిద్ధం అయ్యారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య తల్లిని తీసుకవస్తారు. ఆ సమయంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీపాటిల్‌ గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానిస్తారు. అమ్మ రాకతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.

మంత్రి ఎర్రబెల్లి మొక్కులు
మేడారం: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం రాత్రి 11.45గంటల ప్రాంతంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోరిన వరాలిచ్చే వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తల్లుల దీవెనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అమ్మల కృప ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం జన్మదినం సందర్భంగా ఆయన పేర ఎత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించారు.





















Updated Date - 2022-02-17T07:28:17+05:30 IST