ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు: స్వరూపానందేంద్ర

ABN , First Publish Date - 2021-04-13T19:12:33+05:30 IST

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. ప్లవ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపడమన్నారు.

ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు: స్వరూపానందేంద్ర

విశాఖ: నగరంలోని శ్రీశారదాపీఠంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. పీఠం ఆధ్వర్యంలోని గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. ప్లవ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపడమన్నారు. శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామన్నారు. ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని జోస్యం చెప్పారు. గ్రహాల అనుకూలత లేకున్నా తెలుగు రాష్ర్టాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించారు. 


స్వరూపానందేంద్ర జోస్యం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఆయన చెప్పిన పెద్ద నేత ఎవరన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరంటూ రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి చెందిన నేతా, రాష్ట్రానికి చెందిన నేతా... తెలుగు నేతా... దక్షిణాది, ఉత్తారది వారా అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. స్వామిజీ చెప్పిన నేత ఎవరై ఉండొచ్చు... ఆయనకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమై ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. స్వరూపానందేంద్ర చెప్పిన మాటలపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదని మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-04-13T19:12:33+05:30 IST