రూటు మార్చే‘సారా’?

ABN , First Publish Date - 2021-10-04T04:38:07+05:30 IST

సారా వ్యాపారులు రూటు మార్చారు. రోడ్డు మార్గంలో నిఘా పెరగడంతో.. అక్రమ రవాణా కొనసాగించేందుకు జల మార్గాన్ని ఎంచుకున్నారు. ఒడిశా నుంచి పడవల్లో సారాను గమ్యస్థానాలకు చేర్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రణస్థలం మండలం దోనిపేట వద్ద నాటుపడవలో 50 బస్తాల మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,850 లీటర్ల సారాను ఒడిశా నుంచి తెస్తుండగా పట్టుకున్నారు. సరుకు విలువ రూ.8 లక్షలకుపైగా ఉంటుంది.

రూటు మార్చే‘సారా’?
దోనిపేట వద్ద ఇటీవల పడవలో పట్టుబడిన సారా బస్తాలు

- సముద్ర మార్గం గుండా సారా అక్రమ రవాణా

- ఒడిశా నుంచి యథేచ్ఛగా తరలింపు

- తీర ప్రాంతాల్లో ప్రత్యేక స్థావరాలు

- అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు..

- కొరవడిన మెరైన్‌ పోలీసుల నిఘా

(రణస్థలం)

సారా వ్యాపారులు రూటు మార్చారు. రోడ్డు మార్గంలో నిఘా పెరగడంతో.. అక్రమ రవాణా కొనసాగించేందుకు జల మార్గాన్ని ఎంచుకున్నారు. ఒడిశా నుంచి పడవల్లో సారాను గమ్యస్థానాలకు చేర్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రణస్థలం మండలం దోనిపేట వద్ద నాటుపడవలో 50 బస్తాల మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,850 లీటర్ల సారాను ఒడిశా నుంచి తెస్తుండగా పట్టుకున్నారు. సరుకు విలువ రూ.8 లక్షలకుపైగా ఉంటుంది. జిల్లాలో 193 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ సుమారు 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన జీవనాధారం. అటువంటి మత్స్యకారుల మాటున సారా రవాణా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర మార్గంలో సారా రవాణా జరుగుతోందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడినా.. మత్స్యకార గ్రామాల్లో సారా ప్యాకెట్లు విచ్చలవిడిగా కనిపించేవి. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో సముద్ర మార్గం గుండా వచ్చిన సారా పెద్దత్తున చలామణి అయ్యింది. నిత్యం లక్షలాది రూపాయల సరుకు జిల్లాకు చేరేది. కొందరు చోటా నాయకులు భారీగా సొమ్ము చేసుకున్నట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. 


పెద్ద మాఫియా..

సారా అక్రమ రవాణాకు పెద్ద మాఫియానే ఉంది. ఒడిశాలో తయారుచేసే సారాను అక్కడి వారు పడవల్లోకి చేర్చుతారు. ఆ సరుకును జిల్లాలోని మండలాల వారీగా మరికొంతమంది సరఫరా చేస్తారు. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, తదితర మండలాల్లోని ఎంపిక చేసిన తీర గ్రామాల్లో స్థావరాలను ఏర్పాటు చేసి అక్కడ సారాను దించుతారు. అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తారు. ఇందుకుగాను మత్స్యకార గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుంటారు. వారే వివాహాది శుభకార్యాలకు, విందులకు, వినోదాలకు సారా అవసరమయ్యే వారి నుంచి ఆర్డర్లు స్వీకరిస్తారు. గ్రామాల వారీగా చిరు వ్యాపారులు, బెల్ట్‌ దుకాణదారులకు అందిస్తారు. ఇదో లాభసాటి మార్గం కావడంతో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మాఫియా కూడా తమ వ్యాపార విస్తరణను సులువు చేసుకుంటోంది. సముద్రంపై ఎటువంటి నిఘా లేకపోవడంతో వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది. 


మెరైన్‌ పోలీస్‌స్టేషన్లకు సిబ్బంది కొరత

తీరప్రాంత భద్రత పర్యవేక్షణకు గార మండలం కళింగపట్నం, సంతబొమ్మాళి మండలం భావనపాడు, సోంపేట మండలం బారువలో మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. తీరప్రాంత రక్షణతో పాటు అక్రమ చొరబాట్లను నిరోధించడం, నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకోవడం, సంఘ విద్రోహ శక్తులను తీరంలో అడుగు పెట్టకుండా చేయడం మెరైన్‌ పోలీసుల ప్రధాన విధి. కానీ ఏ స్టేషన్‌లో కూడా పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ప్రతి స్టేషన్‌లో ఒక సీఐతో పాటు ఎస్‌ఐ, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లు 40 మంది వరకూ ఉండాలి. కానీ, ప్రస్తుతం ఏ స్టేషన్‌లోనూ పది మందికి మించి లేరు. వాస్తవానికి తీరం నుంచి 250 మీటర్ల వరకూ వీరు నిత్యం పర్యవేక్షిస్తుండాలి. ఇందుకుగాను ప్రత్యేక బోట్లతో పాటు అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచాలి. కానీ అటువంటి పరికరాలేవీ మెరైన్‌ పోలీస్‌స్టేషన్లలో కానరావడం లేదు. సిబ్బంది కొరతతో తీర ప్రాంతంలో గస్తీ నామమాత్రమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అక్రమార్కులు సారా రవాణాకు జలమార్గాన్ని ఎంచుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 


రాష్ట్రవ్యాప్తంగా రవాణా?

సారా అక్రమ రవాణా ఒక్క సిక్కోలుకే పరిమితం కాలేదని.. రాష్ట్రవ్యాప్తంగా ఒడిశా సారా రవాణా జరుగుతున్నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా మత్స్యకారులు చేపల వేట కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆంధ్రా మత్స్యకారులు ఒడిశా వైపు వెళ్లి చేపల వేట సాగిస్తుంటారు. దీనిని సారా తయారీదారు లు.. అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మత్స్యకారుల మాటున పడవల్లో సారాను అక్రమ తరలిస్తున్నారు. తీర ప్రాంతం అంతటా ఇక్కడి సారాను రవాణా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా తీర ప్రాంతంలోని చివరి మండలం రణస్థలానికే తరలించారంటే.. విజయనగరం, విశాఖ జిల్లాలకు తీసుకెళ్లడం వారికి పెద్దకష్టం కాదనే విషయం తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా ఎస్‌ఈబీతో పాటు మెరైన్‌ పోలీసులు ఈ అక్రమ రవాణాపై దృష్టి సారించాల్సిన అవసరముంది. 


అడ్డుకట్ట వేస్తాం

జిల్లాలో సారా, మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి సారించాం. ఇటీవల రణస్థలం మండలం దోనిపేట వద్ద పడవలో తరలిస్తున్న సారాను పట్టుకున్నాం. అప్పటి నుంచి మెరైన్‌ పోలీసులను అప్రమత్తం చేశాం. తీర ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. సముద్ర మార్గం గుండా సారా రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం.

- శ్రీనివాసరావు, ఏఎస్పీ, ఎస్‌ఈబీ, శ్రీకాకుళం

Updated Date - 2021-10-04T04:38:07+05:30 IST